అధిక ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరగాలి: హరీశ్‌రావు  

Harish Rao Says Most Deliveries Should Take Place In Government Hospitals - Sakshi

సాక్షి, సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రం రాకముందు 30 శాతం ప్రసవాలు మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగేవని.. ప్రస్తుతం ఇది 60 శాతానికి చేరుకుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. త్వరలోనే ఈ సంఖ్యను 75 శాతానికి పెంచాలని ఆయన వైద్యులకు సూచించారు. అలాగే సహజ ప్రసవాలు జరిగేందుకు ఆశ కార్యకర్తలు, క్షేత్ర స్థాయిలోని సిబ్బంది కృషి చేయాలన్నారు.

శనివారం సిద్దిపేట పట్టణంలో ఆశ కార్యకర్తలకు మొబైల్‌ ఫోన్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 5,500 హెల్త్‌ సబ్‌ సెంటర్లు ఉండగా వాటిలో 202 సెంటర్ల పనితీరు బాగా లేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సూది, మందుల కోసం నిధులను రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచామని, ఆస్పత్రిలో మందులు లేవని తెలిస్తే సంబం ధిత డాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టంచేశారు.

బీపీ, షుగర్‌ ఉన్న వారికి ప్రభుత్వం ఉచితంగా మందులను అందజేస్తుందన్నారు. మూడు రంగుల బ్యాగుల్లో ఈ మందులు అందజేస్తామని అందులో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేసుకునే మందులు నెలకు సరిపడేవి ఉంటాయన్నారు. తనకు కూడా షుగర్, బీపీ ఉందని రోజూ మందులు వేసుకుని తిరుగుతున్నా అని తెలిపారు.  

రాష్ట్రంలోనే ఆశ కార్యకర్తల వేతనాలు అధికం 
బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణలోనే ఆశ కార్యకర్తలకు ఎక్కువ వేతనాలు ఇస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు. ప్రతి నెలా 3వ తేదీన ఆశ కార్యకర్తలు మొదలు జిల్లా వైద్య అధికారి వరకు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తానని తెలిపారు. త్వరలో అన్ని జిల్లాల్లో కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 
ప్రభుత్వ ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీలు చేయనున్నట్లు హరీశ్‌రావు స్పష్టం చేశారు. సమయపాలన పాటించని, విధిని ర్వహణలో అలసత్వం వహించే వైద్యులు, ఉద్యోగులపట్ల చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.

దించిన తల ఎత్తొద్దు  
సిద్దిపేట టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో టెట్‌కు సంబంధించి కేసీఆర్‌ ఉచిత కోచింగ్‌ సెంటర్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులందరూ ఈ రెండు నెలలు దించిన తల ఎత్తొద్దన్నారు. అప్పుడే జీవితమంతా తల ఎత్తుకునేలా బతుకుతారన్నారు. హైదరాబాద్‌ కంటే ఇక్కడ అద్భుతంగా కోచింగ్‌ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించామన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top