భయం.. తత్తరపాటు లేకుండా..

Hariharakrishna answers in police interrogation - Sakshi

పోలీసుల విచారణలో హరిహరకృష్ణ సమాధానాలు

కస్టడీలో నిందితుడిని లోతుగా విచారించిన పోలీసులు 

నవీన్‌ శరీర భాగాలు ఎక్కడ విసిరేశావ్‌...

సెల్‌ఫోన్లను ఎందుకు ధ్వంసం చేశావంటూ ప్రశ్నలు

తొలిరోజు సరైన సమాచారం రాబట్టలేకపోయినట్లు సమాచారం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్‌ హత్య కేసులో మృతుడు నవీన్‌ శరీర భాగాలు పోలీసులకు ఇంకా దొరకలేదు. హతుడి ఫోన్‌తో పాటు నిందితుడు హరిహరకృష్ణ సెల్‌ఫోన్లు సైతం ఇంకా స్వాదీనం చేసుకోలేదు. దీంతో తొలిరోజు కస్టడీలో నిందితుడు హరిని పోలీసులు ఆయా వివరాలను రాబట్టే కోణంలోనే విచారించారు. గత నెల ఫిబ్రవరి 17న ప్రేమించిన యువతి దూరమవుతుందనే అనుమానంతో మద్యం మత్తులో ఇంజనీరింగ్‌ విద్యార్థి నవీన్‌ను స్నేహితుడు హరిహరకృష్ణ అబ్దుల్లాపూర్‌మెట్‌ శివారు ప్రాంతంలో గొంతు నులిమి హత్య చేసి.. అనంతరం మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు చేతి వేళ్లు, పెదాలు, గుండె, మర్మాంగాలను కోసి ముక్కలు చేశాడు.

అనంతరం ఫిబ్రవరి 24న నిందితుడు హరి అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో న్యాయస్థానం నిందితుడిని ఈనెల 9వ వరకు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు చర్లపల్లి జైలు నుంచి నిందితుడిని తరలించిన పోలీసులు.. వైద్య పరీక్షల అనంతరం విచారణ చేపట్టారు.

పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఎలాంటి భయం, తత్తరపాటు లేకుండా నిందితుడు సమాధానాలు ఇచ్ఛినట్లు తెలిసింది. హత్య కేసులో మరిన్ని ఆధారాలను రాబట్టేందుకు నిందితుడు హరిని హత్య జరిగిన ప్రాంతం అబ్దుల్లాపూర్‌మెట్‌ శివారు ప్రాంతానికి తీసుకెళ్లి సీన్‌–రీకన్‌స్ట్రక్షన్‌ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

కొత్త సెల్‌ఫోన్‌తో ఠాణాకు..  
హత్య తర్వాత హరి మరొక స్నేహితుడు హసన్‌ ఇంట్లో ఆ రోజు రాత్రి నిద్రించి మర్నాడు ఉదయం కోదాడ, విజయవాడ, విశాఖపట్నం మీదుగా తిరిగి.. సొంతూరైన వరంగల్‌కు చేరుకున్నాడు. తండ్రికి జరిగిన విషయం చెప్పడంతో పోలీసులకు లొంగిపోవాలని తండ్రి సూచించడంతో తిరిగి హైదరాబాద్‌కు వచ్ఛిన హరి.. ప్రేమికురాలిని కలిసి నవీన్‌ హత్య గురించి వివరించారు. ఆమె సూచన మేరకు ఫిబ్రవరి 24న అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

అయితే అప్పటికే హరి వినియోగిస్తున్న సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేసి.. కొత్త సెల్‌ఫోన్‌ తీసుకొని దాన్ని జేబులో పెట్టుకొని పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. ఈ సెల్‌ఫోన్‌నే పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. సాంకేతిక ఆధారాలతో ఇది కొత్త ఫోన్‌ అని గుర్తించిన పోలీసులు.. హత్యకు ముందు సెల్‌ఫోన్‌ గురించి కస్టడీ విచారణలో పోలీసులు ఆరా తీయగా.. తాను వాడేది ఇదే ఫోన్‌ అని బుకాయించినట్లు తెలిసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top