
ఎంపిక చేసిన పత్రాలు మూడోసారి కూడా పరిశీలన
పకడ్బందీగా గ్రూప్–1 మెయిన్స్ మూల్యాంకనం
నిపుణులైన ఎవాల్యుయేటర్లతో మూల్యాంకన ప్రక్రియ
సోషల్‌మీడియాలో అసత్య ప్రచారం నమ్మొద్దు
గ్రూప్–1 ఫలితాలపై టీజీపీఎస్సీ సుదీర్ఘ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 జవాబుపత్రాల మూ ల్యాంకనం అత్యంత పకడ్బందీగా నిర్వహించినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీ ఎస్సీ) స్పష్టం చేసింది. ప్రతి జవాబుపత్రాన్ని వేరువేరు ఎవాల్యుయేటర్లతో రెండుసార్లు మూల్యాంకనం చేయించినట్లు వెల్లడించింది. ఎంపిక చేసిన(ర్యాండమ్‌గా) కొన్ని జవాబు పత్రా లను మూడోసారి కూడా పరిశీలన జరిపినట్లు తెలిపింది.
ఈ నెల 10వ తేదీన టీజీపీఎస్సీ గ్రూప్–1 అభ్యర్థుల మార్కులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మార్కులపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లు వెత్తాయి. జవాబు పత్రాల మూల్యాంకనం సరిగా చేయలేదని కొందరు వ్యక్తులు ఆరోపణలు చేస్తు న్నారు. ఈ ప్రచారంపై స్పందించిన కమిషన్.. గురువారం సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది.
మొత్తం 20,161 మంది అభ్యర్థుల జవాబు పత్రాలను 351 మంది నిపుణులైన ఎవాల్యు యేటర్లతో మూల్యాంకనం చేయించినట్లు తెలిపింది. మూల్యాంకనం తీరు, మాధ్యమాల వారీగా అభ్యర్థులు, పేపర్‌వారీగా వచ్చిన టాప్ మార్కు లు, టాప్ 100 ర్యాంకులు, 500 ర్యాంకుల్లో జెండర్, కమ్యూనిటీ వారీగా అభ్యర్థుల వివరాలను వెల్లడించింది.
యూపీఎస్సీ స్థాయి నిపుణులతో మూల్యాంకనం
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీలో భాగంగా గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఈ జవాబుపత్రాల మూల్యాంకనం వెంటనే ప్రారంభించిన కమిషన్.. గత నెల 15వ తేదీనాటికే పూర్తి చేసింది. ఈ ప్రక్రియలో పాల్గొన్న చీఫ్ ఎగ్జామినర్లు, ఎవాల్యుయేటర్లు యూపీఎస్సీ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో పాల్గొన్నవారేనని స్పష్టం చేసింది.
వీరంతా శాశ్వత ప్రాతిపదికన వివిధ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నవారు అని కమిషన్ తెలిపింది. తుది మార్కులను ఖరారు చేసే సమయంలో కూడా మరోమారు పరిశీలన జరిపిన తర్వాతే మార్చి 10వ తేదీన విడుదల చేసినట్లు వెల్లడించింది.
అయితే గ్రూప్–1 మార్కులపై కొందరు సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి నిరాధార ఆరోపణలను పట్టించుకోవద్దని అభ్యర్థులకు సూచించింది. ప్రతి కేటగిరీలోని పోస్టులను నిబంధనల ప్రకారం నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా భర్తీ చేస్తామని కమిషన్ వివరించింది.

Comments
Please login to add a commentAdd a comment