భార్యాభర్తలను విడదీయొద్దు | Sakshi
Sakshi News home page

భార్యాభర్తలను విడదీయొద్దు

Published Tue, Jan 11 2022 3:38 AM

Govt Teachers Protest Against GO 317 Directorate School Education Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ఖైరతాబాద్‌: జోనల్‌ విధానంలో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317పై ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేటాయింపుల్లో గందరగోళం చోటు చేసుకుందని మండిపడుతున్నారు. కనీసం తమ గోడు విన్పించుకునేందుకూ అవకాశం ఇవ్వడం లేదని వాపోతున్నారు. సోమవారం సుదూర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ఉపాధ్యాయులు హైదరాబాద్‌లోని పాఠశాల విద్య డైరెక్టరేట్‌కు  తరలివచ్చారు. పరిస్థితిని గమనించిన అధికారులు భారీగా పోలీసులను దించారు. దీంతో మహిళలతోసహా టీచర్లను ప్రధాన ద్వారం వద్దే ఆపేశారు.

కనీసం తమ విజ్ఞప్తులన్నా తీసుకోవాలంటూ మెయిన్‌ గేట్‌ దగ్గర గంటల తరబడి పడిగాపులు కాశారు. వాహనాల్లో లోనికి వెళ్తున్న అధికారులను ప్రాధేయపడేందుకు మహిళలు ప్రయత్నించారు. కానీ అక్కడున్న పోలీసులు వారిని వారించారు. కొంతమంది ఉపాధ్యా య సంఘాల నాయకుల అండతో ఆఫీసులోకెళ్లి అధికారులకు వినతిపత్రాలిచ్చారు. అక్కడే కొంతసేపు ధర్నా చేశారు. ‘మా చేతుల్లో ఏమీ లేదు, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందే’ అని ఉన్నతాధికారులు చెప్పడంతో వెనుదిరిగారు. 

13 జిల్లాల్లో 2,500 మంది...
317 జీవోతో జరిగిన బదిలీల్లో భార్య, భర్తకు వేరు వేరు జిల్లాలు వచ్చాయంటూ బాధితులు నిరసన వ్యక్తంచేశారు. 13 జిల్లాల్లో 2,500 మంది భార్యాభర్తలు 100 నుంచి 250 కి.మీ. దూరంలో పనిచేస్తూ మనోవేదనకు గురవుతున్నారని, ప్రభుత్వం స్పందించి కుటుంబాలను కలపాలని కోరారు. వారందరినీ ఒకే జిల్లాకు కేటాయించాలన్న కేసీఆర్‌ ఆదేశాలను 19 జిల్లాల్లోనే అమలుచేశారని, 13 జిల్లాల్లో అమలుచేయలేదని వాపోయారు. 

విద్యామంత్రి ఇంటి వద్ద ధర్నా 
ప్రభుత్వ కాలేజీల లెక్చరర్లు జీవో 317కు వ్యతిరేకంగా ఇంటర్‌ విద్య పరిరక్షణ జేఏసీ చైర్మన్‌ పి.మ ధుసూదన్‌రెడ్డి నేతృత్వంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం ముందు ధర్నా చేశారు. జీవోను తక్షణమే సవరించాలని డిమాండ్‌ చేశారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తా నియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఆయన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

భార్య ఒక చోట... భర్త మరో చోట
ఆయన హెచ్‌ఎం. మల్టీ జోన్‌ కిందకొస్తారు. నేను జిల్లా కేడర్‌. జిల్లా ఆప్షన్లు ఇచ్చేటప్పటికీ మల్టీ జోనల్‌ కేడర్‌ కేటాయింపులు కాలేదు. అలాంటప్పుడు కావల్సిన ఆప్షన్‌ ఎలా ఇవ్వాలి? ఇప్పుడు స్పౌజ్‌ కేసు అంటే పట్టించుకోవడం లేదు. వనపర్తిలో ఒకరు. నాగర్‌కర్నూల్‌లో ఒకరు.. ఇదేం న్యాయం? 
– సందె వినీల, వెంకటరమణ(నాగర్‌కర్నూల్‌) 

పేర్లు మాయమయ్యాయి
జిల్లా నుంచి వచ్చిన జాబితాలో నేను పెట్టుకున్న ఆప్షన్‌కు అంగీకరించారు. కానీ రాష్ట్ర కార్యాలయానికి రాగానే జాబితా మారింది. కామారెడ్డిలో సుదూర ప్రాంతానికి బదిలీ చేశారు. మా దగ్గర 8 మందికి ఇలాగే జరిగింది. 
– ప్రభాకర్‌ రెడ్డి (టీచర్, జగిత్యాల)  

స్పౌజ్‌ లిస్ట్‌ తారుమారు
స్పౌజ్‌ అప్పీళ్లను సరిగా పరిష్కరించలే దు. భార్యాభర్తలను చెరొక చోటుకు పంపా రు. జిల్లా కేటాయింపుల్లో ఇద్దరి పేర్లూ ఉన్నా యి. కానీ, రాష్ట్రస్థాయి జాబితాలో ఎగరగొట్టారు. ప్రభుత్వం బ్లాక్‌ చెయ్యని జిల్లాల్లో అన్నీ ఇలాంటి పొరపాట్లే ఉన్నాయి. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థంకావడం లేదు.
– సాయి రమేష్‌ (ఎస్‌జీటీ, నల్లగొండ) 

Advertisement
Advertisement