తలొగ్గేది ప్రేమకే.. నేను అహంభావిని కాదు.. శక్తిమంతురాలిని: తమిళిసై

Governor Tamilisai Comments At Ugadi Celebrations At Raj Bhavan - Sakshi

రాజ్‌భవన్‌ ముందస్తు ఉగాది వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై

సీఎం, మంత్రులు అందరికీ ఆహ్వానం పంపినా.. ఇగ్నోర్‌ చేశారు 

యాదాద్రికి వెళ్లాలని ఉన్నా నన్ను ఆహ్వానించలేదు.. సమ్మక్క జాతరకు ఎవరూ పిలవకున్నా వెళ్లా..

 నన్ను ప్రగతిభవన్‌కు రమ్మంటే.. ప్రొటోకాల్‌ పక్కన పెట్టి వెళ్లేదాన్ని.. 

ప్రభుత్వం–రాజ్‌భవన్‌ మధ్య గ్యాప్‌కు కారణమేంటో నాకు తెలియదు

ఉగాది నుంచి తెలంగాణ కొత్త శకాన్ని చూడబోతోంది 

నేను తెలంగాణ సోదరిని.. ఇది ప్రజాభవన్‌.. ప్రజల కోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది 

వచ్చే నెల నుంచి క్రమం తప్పకుండా ప్రజాదర్బార్‌ నిర్వహిస్తానని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది ఉత్సవాలు గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మధ్య దూరాన్ని మరింత పెంచాయి. శుభకృత్‌ తెలుగు సంవత్సర ఉగాది ముందస్తు వేడుకల కోసం ఆహ్వానాలు వెళ్లినా.. సీఎం కేసీఆర్‌గానీ, మంత్రులుగానీ ఎవరూ రాలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ కూడా హాజరుకాలేదు. దీనికితోడు ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గవర్నర్‌ తమిళిసై వ్యక్తం చేసిన అభిప్రాయాలు, తర్వాత మీడియాతో నిర్మొహమాటంగా చేసిన వ్యాఖ్యలు వేడిని మరింతగా పెంచాయి. ఈ నేపథ్యంలో ప్రగతిభవన్‌కు, రాజ్‌భవన్‌కు మధ్య పూడ్చలేని స్థాయికి విభేదాలు పెరిగాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది వేడుకల్లో తమిళిసై దంపతులతో హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

నేతలు, ప్రముఖుల హాజరుతో.. 
రాజ్‌భవన్‌లో శుక్రవారం సాయంత్రం ముందస్తు ఉగాది వేడుకలను నిర్వహించారు. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, మాజీఎమ్మెల్యే లక్ష్మీనారాయణ, బీజేపీనేతలు సుధాకర్‌రెడ్డి, సి.అంజిరెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి,  పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య, ఐఐటీ డైరెక్టర్‌ మూర్తి, పలు యూనివర్సిటీల వీసీలు, పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు.

అందరినీ గవర్నర్‌ పేరుపేరునా పలకరించి, మాట్లాడారు. పంచాంగ శ్రవణం నిర్వహించాక.. ఎనిమిది మందికి గవర్నర్‌ చేతుల మీదుగా ఆర్థికసాయం అందజేశారు. తెలుగు యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులను ఉద్దేశించి గవర్నర్‌ మాట్లాడారు. తమిళిసై ప్రసంగం ఆమె మాటల్లోనే.. 

పిలిస్తే.. ప్రొటోకాల్‌ పక్కనపెట్టి వెళ్లేదాన్ని.. 
‘‘నేను రాష్ట్రంలోని 119 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపించాను. కొందరు వచ్చారు. రానివారి గురించి నేనేమీ చెప్పేది లేదు. నా ఆహ్వానాన్ని గౌరవించనందుకు నేనేమీ బాధపడడం లేదు. ప్రగతిభవన్‌లో ఉగాది కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఉంటే ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి అయినా వెళ్లేదాన్ని. యాదాద్రికి వెళ్లాలని ఉన్నా నన్ను ఆహ్వానించలేదు. నేను వివాదాలను, గ్యాప్‌ను సృష్టించే వ్యక్తిని కాదు. కొన్ని అంశాల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయి. నేను ఎన్నిసార్లు ఆహ్వానాలు పంపినా పట్టించుకోవడం లేదు. ఇగ్నోర్‌ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ పిలిచాం. కానీ రాలేదు. సమ్మక్క సారలమ్మ జాతరకు ఎవరో పిలుస్తారని ఎదురుచూడకుండా వెళ్లాను. రాష్ట్ర ప్రభుత్వానికి, రాజభవన్‌కు మధ్య దూరం (గ్యాప్‌) రావడానికి కారణం తెలియదు. 

నేను తెలంగాణ సోదరిని.. 
రాజ్‌భవన్‌లో ఉన్నది గవర్నర్‌ కాదు, తెలంగాణ సోదరి. నేను చాలా స్నేహశీలిని, నవ్వుతున్నంత మాత్రాన బలహీనంగా ఉన్నట్టు కాదు. నేను చాలా శక్తివంతురాలిని. ప్రేమాభినాలతో తప్ప నా తలను ఎవరూ వంచలేరు. నేను అహంభావిని కాదు. చురుకైన మహిళను. తెలంగాణ ప్రజలకు చేయి అందించేందుకు ఇక్కడ మీ సోదరి ఉంది. మీకు సాయం చేసేందుకు చేయూతనిస్తా.. ఇదే ప్రజలకు నా సందేశం. గత రెండున్నరేళ్లుగా తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకు రాజ్‌భవన్‌ ఎంతో చొరవ తీసుకుంది. ఇది ప్రజాభవన్‌.. తెలంగాణ సోదర సోదరీమణులు, పెద్దల కోసం రాజ్‌భవన్‌ తలుపులు తెరిచే ఉన్నాయి. 

వచ్చే నెల నుంచి ప్రజా దర్బార్‌ 
విజ్ఞాపనల పెట్టె ద్వారా తెలంగాణ ప్రజల నుంచి అనేక సూచనలు వస్తున్నాయి. అందులో వచ్చే వినతులను పరిశీలించి నా బృందం ఎంపిక చేసిన వారికి అవసరమైన సాయం కూడా చేస్తున్నాం. ప్రస్తుతం రాజ్‌భవన్‌ నుంచి అందుతున్నది చిరుసాయం మాత్రమే. రాబోయే రోజుల్లో ఎక్కువ మందికి అందేలా చూస్తాం. ఉగాది నుంచి తెలంగాణ కొత్త శకాన్ని చూడబోతోంది. ఉమ్మడి ప్రయత్నాలతో ఓవైపు తెలంగాణను అభివృద్ది చేస్తూనే.. ప్రజాదర్బార్‌ ద్వారా ప్రజలను కలుస్తున్నా. వచ్చేనెల నుంచి ప్రజాదర్బార్‌ క్రమం తప్పకుండా ఉంటుంది. రాజ్‌భవన్‌ పరిమితులు ఏమిటో నాకు తెలుసు. అయినా తెలంగాణ ప్రజలను కలిసి వారి వినతులు స్వీకరించి పరిష్కరించడం ద్వారా మేలు చేసేందుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తా.

పరస్పరం గౌరవించుకుందాం.. 
ఉగాది వేడుకలకు రావాలంటూ తెలంగాణలో అత్యున్నత స్థాయి వ్యక్తి నుంచి రాజ్‌భవన్‌ ఉద్యోగి వరకు ఆహ్వానాన్ని పంపించా. చాలా మంది నా ఆహ్వానానికి స్పందించి గౌరవించి వచ్చారు. కొత్త ఏడాది నుంచి తెలంగాణలో కొత్త శకాన్ని ప్రారంభిద్దాం. ప్రేమాభిమానాలతో ఒకరినొకరు అర్థం చేసుకుని, పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు సాగుదాం. ప్రస్తుతం కరోనా సమస్య ముగిసింది. వాక్సినేషన్, సామాజిక దూరం వంటి జాగ్రత్తలు పాటించడం వల్లే ఈ రోజు తిరిగి సురక్షితంగా కలుసుకోగలుగుతున్నాం. సురక్షిత ప్రపంచంలోకి అడుగు పెడుతూ.. సమస్యలు పరిష్కరించుకుంటూ తెలంగాణ అభివృద్ధి కోసం ఐక్యంగా పనిచేద్దాం. నా ఆహ్వానం మేరకు పుదుచ్చేరి స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌తోపాటు పలువురు అధికారులు కూడా ఉగాది వేడుకలకు వచ్చారు. నేను తెలంగాణ ప్రజలు, సంస్కృతిని ప్రేమిస్తున్నా. ఇలాంటి పండుగలు పుదుచ్చేరి, తెలంగాణ మధ్య బంధాన్ని బలోపేతం చేస్తాయి’’ అని గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు.  
సంబంధిత వార్త: రాజ్‌‌భవన్‌లో ఉగాది వేడుకలు.. సీఎం కేసీఆర్‌ దూరం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top