భూ వివాదాల పరిష్కారానికి శాశ్వత ట్రిబ్యునళ్లు

Government Hopes To Set Up Permanent Tribunals To Resolve Land Disputes - Sakshi

ఏర్పాటు యోచనలో ప్రభుత్వం

కొత్త చట్టం ఆమోదించే సమయంలో ట్రిబ్యునళ్లు తాత్కాలికమేనన్న సీఎం

ఏ వివాదమైనా కోర్టుకు వెళ్లి పరిష్కరించుకోవాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌ : భూ వివాదాల పరిష్కారానికి శాశ్వత ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను విచారించి పరిష్కరించేందుకు ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని, ఆ ట్రిబ్యునళ్లకు క్వాసీ జ్యుడీషియల్‌ అధికారాలివ్వాలని ప్రభుత్వం తొలుత భావించింది. కానీ రెవెన్యూ కోర్టులకు వచ్చే కేసులు పెరగడం, ధరణి పోర్టల్‌ అమలు నేపథ్యంలో సమస్యలు వస్తుండటంతో వాటిని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసే ట్రిబ్యునళ్లను శాశ్వత ప్రాతిపదికన ఉంచాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కొత్త రెవెన్యూ చట్టం ఆమోదం సందర్భంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నాటికే దాదాపు 20 వేల కేసులు రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. వాటితోపాటు చిన్నచిన్న ఫిర్యాదులు, ధరణి అమలు ద్వారా వస్తున్న సమస్యలు, సంధికాలంలో వచ్చిన సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో అసెంబ్లీలో చెప్పినట్లు ఈ ట్రిబ్యునళ్లకు నిర్ణీత కాలపరిమితి విధించకుండా భూ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కొనసాగించాలన్న రెవెన్యూ ఉన్నతాధికారుల సూచన మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దీంతోపాటు రాష్ట్రంలో దాదాపు 15 లక్షల ఎకరాల్లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి భూ సమగ్ర సర్వేనే మార్గమని, వీలైనంత త్వరలో ఈ ప్రాజెక్టును చేపట్టాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. సమగ్ర భూ సర్వే ద్వారా గరిష్ట స్థాయిలో భూ వివాదాలు పరిష్కారం అయ్యాక మాత్రమే ట్రిబ్యునళ్లపై మళ్లీ నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top