breaking news
permanent tribunal
-
భూ వివాదాల పరిష్కారానికి శాశ్వత ట్రిబ్యునళ్లు
సాక్షి, హైదరాబాద్ : భూ వివాదాల పరిష్కారానికి శాశ్వత ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను విచారించి పరిష్కరించేందుకు ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని, ఆ ట్రిబ్యునళ్లకు క్వాసీ జ్యుడీషియల్ అధికారాలివ్వాలని ప్రభుత్వం తొలుత భావించింది. కానీ రెవెన్యూ కోర్టులకు వచ్చే కేసులు పెరగడం, ధరణి పోర్టల్ అమలు నేపథ్యంలో సమస్యలు వస్తుండటంతో వాటిని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసే ట్రిబ్యునళ్లను శాశ్వత ప్రాతిపదికన ఉంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త రెవెన్యూ చట్టం ఆమోదం సందర్భంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన నాటికే దాదాపు 20 వేల కేసులు రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. వాటితోపాటు చిన్నచిన్న ఫిర్యాదులు, ధరణి అమలు ద్వారా వస్తున్న సమస్యలు, సంధికాలంలో వచ్చిన సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో అసెంబ్లీలో చెప్పినట్లు ఈ ట్రిబ్యునళ్లకు నిర్ణీత కాలపరిమితి విధించకుండా భూ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కొనసాగించాలన్న రెవెన్యూ ఉన్నతాధికారుల సూచన మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు రాష్ట్రంలో దాదాపు 15 లక్షల ఎకరాల్లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి భూ సమగ్ర సర్వేనే మార్గమని, వీలైనంత త్వరలో ఈ ప్రాజెక్టును చేపట్టాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. సమగ్ర భూ సర్వే ద్వారా గరిష్ట స్థాయిలో భూ వివాదాలు పరిష్కారం అయ్యాక మాత్రమే ట్రిబ్యునళ్లపై మళ్లీ నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. -
జల జగడాలు ఆగుతాయా?
రాష్ట్రాల మధ్యా, ప్రాంతాలమధ్యా తరచు నిప్పును రాజేస్తున్న నీళ్ల సమస్యకు పరిష్కారం కోసం శాశ్వత ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి 1956నాటి అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టానికి అవసరమైన సవరణలు తీసుకురావాలని ఈమధ్యే మంత్రి వర్గం నిర్ణయించింది. మూడు కాలాలూ, ఆరు రుతువులూ సక్రమంగా ఉంటే... పుష్కలంగా వర్షాలు పడితే నదులన్నీ జీవ జలాలతో ఉప్పొంగుతాయి. వాపీ, కూప, తటాకాలన్నీ జలసిరితో తొణికిసలాడతాయి. తాగునీరూ, సాగునీరూ కావల సినంత లభిస్తుంది. నీరు నాదంటే నాదన్న వ్యర్థ వివాదాలుండవు. సమస్యల్లా రుతు పవనాలు ముఖం చాటేసినప్పుడే... ఆకాశం చినుకు రాల్చనప్పుడే! అప్పుడు పంట పొలాలకే కాదు, గొంతు తడుపుకోవడానికి కూడా ఇబ్బందులెదురవుతాయి. ఆ గడ్డు పరిస్థితుల్లో జల యుద్ధాలు మొదలవుతాయి. రాష్ట్రాలమధ్యే కాదు...ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతాలమధ్య కూడా కొట్లాటలు ప్రబలుతాయి. మన దేశంలో రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలు తక్కువేమీ కాదు. వీటి పరిష్కారం కోసం ఇప్పటి వరకూ అయిదు ట్రిబ్యునళ్లు– కృష్ణ, వంశధార, కావేరి, రావి–బియాస్, మహాదాయి వివాదాల కోసం ఏర్పాటయ్యాయి. చిత్రమేమంటే ఈ ట్రిబ్యునళ్ల ఏర్పాటు ఫలితంగా ఒక్కటంటే ఒక్క వివాదం కూడా సమసిపోయిన దాఖలా లేదు. అవి దశాబ్దాలుగా సెగలూ, పొగలూ కక్కుతున్నాయి. హింసనూ, విధ్వం సాన్నీ సృష్టిస్తున్నాయి. ట్రిబ్యునళ్లు సకాలంలో సక్రమంగా తీర్పులిచ్చిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి లేదు. ఎప్పటికో తీర్పులిచ్చినా తదుపరి చర్యలు అంతకన్నా నత్తనడకన నడుస్తున్నాయి. కావేరీ ట్రిబ్యునల్ ఎడతెగని జాప్యం తర్వాత 2007లో తుది అవార్డు ప్రకటించగా దానిపై విడుదల చేయాల్సిన నోటిఫికేషన్ కోసం కేంద్రం మరో ఆరేళ్ల సమయం తీసుకుంది. సాధారణ సంవత్సరాల్లో తమిళనాడుకు కర్ణాటక 192 టీఎంసీల నీరు విడుదల చేయాలన్నది ట్రిబ్యునల్ తీర్పు సారాంశం. ఈ తీర్పుపై కర్ణాటక సుప్రీంకోర్టుకెక్కింది. అదే వివాదంలో తమిళనాడుకు రోజుకు 1.3 టీఎంసీల చొప్పున పదిరోజులపాటు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు మూడు నెలలక్రితం కర్ణాటకలో ఏ స్థాయిలో ఆగ్రహావేశాలు రగిల్చాయో అందరూ చూశారు. కృష్ణా జలాల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న నీటి నుంచే రెండు తెలుగు రాష్ట్రాలూ వాటా పొందాల్సి ఉంటుందంటూ ట్రిబ్యునల్ ఇటీ వల ఇచ్చిన తీర్పు సైతం ఉభయ రాష్ట్రాల్లోనూ అసంతృప్తి కలగజేసింది. చూడగానే కేంద్రం చేసిన ఆలోచన ఉత్తమమైనదని ఎవరికైనా అనిపిస్తుంది. ఇప్పుడున్న తాత్కాలిక ట్రిబ్యునళ్లకు బదులు ఏర్పాటయ్యేది ఏదైనా మెరుగైనదన్న అభిప్రాయం కలుగుతుంది. కానీ సమస్య ట్రిబ్యునల్ స్వభావానికి సంబంధిం చిందా? శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటైతే జరిగేదేమిటి? వివాదంపై శరవేగంతో విచారించడానికి తాత్కాలిక ట్రిబ్యునల్‌కు ఉండే అడ్డంకులేమిటి... దీనికి లేకుండా పోయేవి ఏమిటి? వివాదం తలెత్తడానికీ, దానిపై తాత్కాలిక ట్రిబ్యునల్ ఏర్పా టుకూ మధ్య ఇప్పుడైతే సుదీర్ఘ సమయం తీసుకుంటున్న మాట వాస్తవం. శాశ్వత ట్రిబ్యునల్ ఉంటే ఫిర్యాదులు నేరుగా దానికే వెళ్తాయి. వివాదంపై ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలో, లేదో అది నిర్ణయిస్తుంది. చూడటానికి ఇది బాగానే ఉన్నా... ఆ ప్రత్యేక బెంచ్ ఏర్పాటుకైనా ట్రిబ్యునల్‌కు వ్యవధి పట్టదా? దానికి ముందు అన్ని పక్షాల వాదనలూ వినాల్సిన అవసరం ఉండదా? పైగా అప్పుడుండేది ఏకైక ట్రిబ్యు నల్ కనుక అన్ని వివాదాల భారాన్నీ అదొక్కటే మోయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న అయిదు ట్రిబ్యునళ్ల పనే కాదు... భవిష్యత్తులో వివాదాలు తలెత్తగలవి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ ట్రిబ్యునల్ చైర్మన్‌గా నియమితులయ్యే సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చూడాల్సివస్తుంది. బెంచ్ ఏర్పాటు అవసరమో, కాదో నిర్ణయించాలి. ఆయన ఇచ్చే తాత్కాలిక ఆదేశాలైనా, తుది తీర్పులైనా మళ్లీ సుప్రీంకోర్టు ముంగిటకు వెళ్లవన్న గ్యారెంటీ ఏం లేదు. సుప్రీంకోర్టు ఇస్తున్న ఆదేశాలనే ధిక్కరిస్తూ అసెంబ్లీలు తీర్మానాలు చేస్తుంటే ఈ ట్రిబ్యునల్ డిక్రీలకు ఏపాటి విలువుం టుందో చెప్పలేం. ఏ వివాదంపైన అయినా ట్రిబ్యునల్ మూడేళ్లలో తీర్పు నివ్వాలని నిబంధన విధించినట్టు చెబుతున్నారు. కావేరీ వివాదంపై 1990లో ట్రిబ్యునల్ ఏర్పాటైతే అది తుది తీర్పు వెలువరించేసరికి 17 సంవత్సరాలు పట్టింది. దానిపై కేంద్రం నోటిఫికేషన్‌కు మరో ఆరేళ్లు పట్టింది. ఈ నేపథ్యంలో మూడేళ్లలోనే తీర్పు వెలువరించడం సాధ్యమేనా? ఎక్కువ సందర్భాల్లో ఇలాంటి జాప్యానికి రాష్ట్రాల్లోని పాలకులకు ఉండే రాజకీయ ప్రయోజనాలు... కేంద్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న పాలకులకు ఆయా రాష్ట్రాల్లో ఉండే స్వప్రయోజనాలు మూల కారణమని ప్రతి ఒక్కరికీ తెలుసు. తమ తమ రాష్ట్రాల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి వివాదంలో తాము వీరోచితంగా పోరాడుతున్నామన్న అభిప్రాయం కలిగించడానికి పార్టీలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. అందుకోసం ఎంతవరకైనా వెళ్తున్నాయి. కనుక సమస్య మూలాలు వేరే చోట ఉన్నాయని ముందుగా గుర్తించాలి. అలాంటి రాజకీయ జోక్యాన్ని మొగ్గలోనే తుంచాలి. ఏ వివాదంపైన అయినా వెలువరించే తీర్పులకు నిపుణులిచ్చే సశాస్త్రీయమైన నివేదికలే గీటురాయి కావాలి. ఆ నిపుణుల తటస్థతపై, వారి సమర్ధతపై వివాదంలోని అన్ని పక్షాలకూ విశ్వాసం ఉండాలి. మూడేళ్లక్రితం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా సగటు వార్షిక నదీ ప్రవాహ పరిమాణాన్ని పరిశీలించడానికి 47 సంవత్సరాల సమాచారాన్నే తీసు కుంది. ఎగువ రాష్ట్రాల్లో అనావృష్టి ప్రాంతాలకు ఉదారంగా కేటాయింపులు చేసిన ట్రిబ్యునల్... దిగువ రాష్ట్రాలకు రిక్త హస్తం చూపింది. ఇలాంటి అశాస్త్రీయమైన, అహేతుకమైన నిర్ణయాలు దిగువ ప్రాంతాలకు తీరని అన్యాయం చేస్తాయి. నీరు వంటి సహజ వనరుపై వాటాలను తేల్చడంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది పెను వివాదానికి దారితీస్తుంది. ట్రిబ్యునల్ ఎలాంటిదని కాక దాని సమర్ధత, చురుకుదనం, నిష్పాక్షికత, నైపుణ్యం ఏపాటి అన్న అంశాల ప్రాతిపదికనే దానికి విశ్వసనీయత ఏర్పడుతుందని గుర్తించాలి. -
జల వివాదాలపై ఒకే శాశ్వత ట్రిబ్యునల్!
న్యూఢిల్లీ: రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలను సత్వరమే సమన్యాయంతో పరిష్కరించేందుకు దేశంలో ఒక్కటే శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఇప్పుడున్న 5 అంతర్రాష్ట్ర జలవివాదాల ట్రిబ్యునళ్లను రద్దు చేసి వాటి స్థానంలో జాతీయ స్థాయిలో ఒక్కటే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కొన్నేళ్లుగా నలుగుతున్న సంగతి తెలిసిందే. జాతీయ జల విధానం ముసాయిదా 2012 కూడా శాశ్వత ట్రిబ్యునల్‌నే సూచిం చింది. ఈ మేరకు అంతర్రాష్ట్ర నదీజల వివాదాల చట్టం-1956ను సవరించేందుకు కేంద్ర జల వనరుల శాఖ ఒక కేబినెట్ నోట్‌ను రూపొందించింది. అయితే ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునళ్లను రద్దు చేసి జాతీ య స్థాయిలో ఒకే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడానికి తొలుత 2011లో అప్పటి న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ చొరవ తీసుకున్నారు. పలువురు సభ్యులతో కూడిన శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేంద్రం యోచి స్తోంది. ఈ ట్రిబ్యునల్‌లో ముగ్గురేసి సభ్యులతో కొన్ని ధర్మాసనాలను ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం జలవివాదాల పరిష్కారానికి ఏర్పాటుచేసిన ట్రిబ్యునళ్లు తీర్పు ఇచ్చేసరికి ఏళ్ల తరబడి సమయం పట్టడం, ఒకవేళ తీర్పు ఇచ్చినా వాటిపై బాధిత రాష్ట్రాలు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం తదితర పరిణామాలను కేంద్రం పరిశీలనలోకి తీసుకుంది.