ధర్మాసుపత్రిలో దాష్టీకం: డాక్టర్లు ప్రాక్టీసుకు.. పేషెంట్లు ప్రయివేటుకు..

Government Doctors Doing Private Practice In Karimnagar District - Sakshi

ధర్మాసుపత్రిలో యథేచ్చగా ‘ప్రైవేటు’ దందా 

పేషెంట్లను ప్రయివేటుకు తరలిస్తున్న అంబులెన్స్‌ నిర్వాహకులు 

ఆసుపత్రి కంపౌండ్‌ లోపల దర్జాగా అంబులెన్స్‌ల అడ్డా

పేషెంట్లను తరలిస్తే అందుతున్న 30– 50శాతం కమీషన్లు

నిరుపేదలపై ప్రయివేటు ఆసుపత్రుల దాష్టీకం

కొత్తపల్లి మండలం చింతకుంటకు చెందిన రాజనర్సుకు ప్రమాదంలో కుడికాలు విరిగింది. నిరుపేద కుటుంబం కావడంతో వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి ఆటోలో రాగానే అక్కడే కాచుకుని కూర్చున్న అంబులెన్స్‌ నిర్వాహకులు రాజనర్సు బంధువులను అడ్డగించి ‘ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు.. ఇక్కడ వైద్యులు లేరు. ఉన్నా వైద్యం సరిగా చేయక ప్రాణాల మీదకు తెస్తారని’ భయబ్రాంతులకు గురిచేసి వారిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇలా వచ్చిన పేషెంట్లను వచ్చినట్లు ప్రైవేటు ఆసుపత్రులకు తరలిస్తూ అంబులెన్స్‌ల నిర్వాహకులు కమీషన్లు దండుకుంటున్నారు.

సాక్షి, కరీంనగర్: జిల్లా ఆస్పత్రిలో కమీషన్ల కాసులవర్షం కురుస్తోంది. ఆసుపత్రికి వచ్చే రోగులకు పైసా ఖర్చు లేకుండా వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తుంటే... కొంతమంది కమీషన్లకు కక్కుర్తిపడి పేద రోగులకు ప్రభుత్వ వైద్యం అందకుండా చేస్తున్నారు. ఆస్పత్రి వైద్యులు మధ్యాహ్నానికే ‘ప్రయివేటు’ ప్రాక్టీసుకు వెళ్లిపోగా.. అదనుచూసి అంబులెన్స్‌ డ్రైవర్లు ఆస్పత్రి ఆవరణలో తిష్ట వేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారిని ప్రైవేటు ఆసుపత్రులకు పంపుతున్నారు. ఆస్పత్రిలో వైద్యం చేసేందుకు డాక్టర్లు లేదని, ఉన్నా పట్టించుకోరని, తీరా ప్రాణాల మీదకు వచ్చాక ఎక్కడికి పోతారని పేషెంట్ల బంధువులను భయబ్రాంతులకు గురిచేసి ప్రైవేటు ఆసుపత్రులకు తరలిస్తూ కమీషన్లు దండుకుంటున్నారు. అవసరమైతే ఉచితంగా అంబులెన్స్‌ సేవలు అందిస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు ఈ దందా యథేచ్చగా సాగుతుండగా.. ఈ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడం కొసమెరుపు. 

చదవండి: (దారుణం: కుల బహిష్కరణ.. మాట్లాడితే రూ.50వేల జరిమానా) 

ప్రభుత్వాసుపత్రి సిబ్బంది అండతో: ప్రైవేటు అంబులెన్స్‌లను ప్రభుత్వాసుత్రి కంపౌండ్‌ వెలుపలే ఉంచాలి. కానీ గత కొద్ది రోజులుగా ప్రభుత్వాసుపత్రి సిబ్బంది అండదండలతో కంపౌండ్‌లో అడ్డా పెట్టి అంబులెన్స్‌లకు సీరియల్‌ నంబర్లు కూడా కేటాయిస్తున్నారు. పేషెంట్ల బంధువులు ద్విచక్రవాహనాలపై వస్తే దూరంగా పార్కింగ్‌ చేయిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది ప్రైవేటు ఆంబులెన్స్‌లకు మాత్రం ఎక్కడపడితే అక్కడ పార్కింగ్‌ చేసుకునేందుకు స్థలాలు చూపిస్తున్నారు. దగ్గరుండి పేషెంట్లను అంబులెన్స్‌లలో ప్రైవేటుకు తరలిస్తున్నారు.

ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ: అంబులెన్స్‌ల ద్వారా పేషెంట్లను తీసుకువచ్చే వారికి 30 నుంచి 50 శాతం వరకు కమీషన్లు ఇస్తున్నారు. కమీషన్లు ఇచ్చేందుకు పేషెంట్లను నిలువుదోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా వైద్యం పొందాల్సిన పేషెంట్లను ప్రైవేటు ఆసుపత్రులకు పంపుతున్న వారిపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
సెక్యూరిటీ, పీఆర్‌వోలకు చెప్పాం. ప్రైవేటు ఆంబులెన్స్‌లు కంపౌండ్‌లోపల పార్కింగ్‌లో పెట్టకూడదని సెక్యూరిటీకి, పీఆర్వోలకు చెప్పాం. ఎవరూ కంపౌండ్‌ లోపల ప్రైవేటు ఆంబులెన్స్‌లు పెట్టకుండా చర్యలు చేపడతాం.
– డాక్టర్‌ జ్యోతి, జిల్లా ఆసుపత్రి ఆర్‌ఎంవో 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top