దారుణం: కుల బహిష్కరణ.. మాట్లాడితే రూ.50వేల జరిమానా.. చిన్నమ్మ చనిపోయినా

Man Caste Deportation in Sultanabad Peddapalli District - Sakshi

చిన్నమ్మ చనిపోయినా రానివ్వని కుల సంఘ పెద్దలు

గట్టెపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి..

సాక్షి, పెద్దపల్లి: సాంకేతికకాలంలోనూ కుల బహిష్కరణ సంస్కృతి కొనసాగుతోంది. తమ మాట వినడం లేదంటూ మూడు కుటుంబాలను కుల పెద్దలు వెలివేసిన సంఘటన సుల్తానాబాద్‌ మండలం గట్టెపల్లెలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బహిష్కరణకు గురైన వారిలో ఇద్దరు దివ్యాంగులు కావడం విశేషం. బాధితుల కథనం ప్రకారం.. సుల్తానాబాద్‌ మండలం గట్టెపల్లిలో నల్లవెల్లి సమ్మయ్య, నల్లవెల్లి మల్లయ్య, నల్లవెల్లి రాజయ్య అన్నదమ్ములు. అదే గ్రామానికి చెందిన అబ్దుల్‌ అలీ వద్ద గతంలోనే గంపగుత్తగా ఆరు గుంటల భూమిని సాదాబైనామాపై కొనుగోలు చేశారు.

సదరు స్థలాన్ని కుల సంఘానికి కావాలని వారి కులానికే చెందిన పెద్దలు కోరడంతో ముగ్గురు అన్నదమ్ములు అంగీకరించారు. సదరు స్థలాన్ని అబ్దుల్‌ అలీతో 2008లో రిజిస్ట్రేషన్‌ చేయించారు. కొన్నాళ్లక్రితం అబ్దుల్‌అలీ చనిపోయాడు. ఈనేపథ్యంలో సదరు భూమికి కొలతలు వేయగా.. తక్కువగా ఉంది. దీనికి సమ్మయ్య కుటుంబమే కారణమని, కొనుగోలు చేసిన సమయంలోనే భూమికి హద్దులు వేయిస్తే సమస్య ఉండేది కాదని, దీనికి బాధ్యత వహించి మొత్తం స్థలం చూపించాలని కుల పెద్దలు పంచాయితీ పెట్టారు. అయితే తాము కొనుగోలు చేసిన భూమిని అలాగే కుల సంఘానికి విక్రయించామని, ఇందులో తాము తప్పు చేయలేదని ముగ్గురు అన్నదమ్ములు అంటున్నారు. ఈ విషయమై కొద్దిరోజులుగా పంచాయితీ నడుస్తోంది.

చదవండి: (సాగర్‌ కాల్వలో ముగ్గురి గల్లంతు.. వీరంతా కేరళ ఆయుర్వేదిక్‌ సిబ్బంది)

సమస్య పరిష్కారం చూపే వరకూ ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాలను కులం నుంచి బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. వారితో మాట్లాడిన వారికి రూ.50వేల జరిమానా విధిస్తామని హెచ్చరించడంతో అప్పటినుంచి వీరితో కులానికి చెందిన వారెవరూ మాట్లాడడం లేదు. ఈనెల ఒకటో తేదీన బాధితుల పినతల్లి నల్లవెల్లి మల్లమ్మ (75) అనారోగ్యంతో చనిపోయింది. ఆమెను చివరిచూపు చూసేందుకు సమ్మయ్య, మల్లయ్య, రాజయ్య వెళ్తే కుల పెద్దలు అడ్డుచెప్పారు. గత్యంతరం లేక బాధితులు అక్కడి నుంచి వచ్చాక అంత్యక్రియలు పూర్తిచేశారు. తమను కుల బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని పేర్కొంటూ సమ్మయ్య మూడు రోజుల క్రితం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

తన సోదరులు మల్లయ్య, రాజయ్య దివ్యాంగులు అని, కుల సభ్యులు ఎవరూ కనీసం పాలు పోయడం లేదని, సుల్తానాబాద్‌ నుంచి తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు రోజులుగా న్యాయం కోసం స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై పోలీసుల వివరణ కోరగా.. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని, కుల సంఘానికి విక్రయించిన భూమి ప్రస్తుతం లేదని కుల సంఘం పెద్దలు, ప్రతినిధులు చెబుతున్నారని తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేపడుతామని పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top