ఇంటర్‌ రెండేళ్ల ఫలితాల్లోనూ అమ్మాయిలదే హవా | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ రెండేళ్ల ఫలితాల్లోనూ అమ్మాయిలదే హవా

Published Wed, May 10 2023 4:10 AM

Girls Tops In Telangana Intermediate Exam Results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో మరోసారి బాలికలు సత్తా చాటారు. మొదటి, రెండో సంవత్సరం రెండింటిలోనూ బాలురను మించి ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు. ఫస్టియర్‌లో బాలురు 54.66 శాతం పాసయితే, బాలికలు 68.68% ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో బాలురు 55.60% ఉత్తీర్ణులైతే, బాలికలు 71.57 శాతం పాస్‌ కావడం గమనార్హం. మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ రెండేళ్ల పరీక్షలు కలిపి మొత్తంగా 9,48,153 మంది హాజరయ్యారని తెలిపారు.

ఫస్టియర్‌లో 61.68 శాతం, సెకండియర్‌లో 63.49 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు వెల్లడించారు. ఫస్టియర్‌లో 1,75,505 మంది, సెకండియర్‌లో 1,91,698 మంది ఏ గ్రేడ్‌ (75శాతంపైన మార్కులతో)లో ఉత్తీర్ణులైనట్టు వివరించారు. ఫస్టియర్‌ ఫలితాల్లో మేడ్చల్‌ (75% పాస్‌) మొదటి స్థానంలో, రంగారెడ్డి (73% పాస్‌) ద్వితీయ స్థానంలో నిలిచా యని మంత్రి తెలిపారు. సెకండియర్‌లో ములుగు (85% పాస్‌) మొదటి స్థానంలో, కొమురం భీం (81 శాతం పాస్‌) రెండో స్థానంలో నిలిచినట్టు స్పష్టం చేశారు. 

ఫెయిలైతే ఆందోళన పడొద్దు 
ఇంటర్‌ ఫెయిలైన విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రాసి పాసవ్వాలని మంత్రి సూచించారు. ఎంసెట్‌లో ఈ ఏడాది ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ లేదని, అందువల్ల ఇంటర్‌ మార్కులు తక్కువ వచ్చినా ఆందోళన పడొద్దని చెప్పారు. 

నేటి నుంచి రీవెరిఫికేషన్‌.. 
ఇంటర్‌ జవాబు పత్రాల రీవెరిఫికేషన్, రీవాల్యూయేషన్‌ ప్రక్రియను ఈ నెల 10 నుంచి 16 వరకు చేపడుతున్నామని.. విద్యార్థులు సంబంధిత కాలేజీల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. రీవెరిఫికేషన్‌కు రూ.100, రీవ్యాల్యూయేషన్‌కు రూ.600 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఫెయిలైన విద్యార్థులతోపాటు పాసైనా ఇంప్రూవ్‌మెంట్‌ కోరుకునే విద్యార్థులు ఈ నెల 16 లోగా ఫీజు చెల్లించాలని సూచించారు.

మార్కుల మెమోలు, కలర్‌ ప్రింట్లను ఇంటర్‌ బోర్డ్‌ వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు. మానసిక ఆందోళనకు గురైన విద్యార్థులు 14416 టోల్‌ ఫ్రీనంబర్‌కు కాల్‌ చేసి నిపుణుల ద్వారా కౌన్సిలింగ్‌ పొందవచ్చని తెలిపారు. వీలైనంత త్వరగా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఇంటర్‌ బోర్డ్‌ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చే వరకు కూడా.. ఏ కాలేజీలోనూ అడ్మిషన్లు చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు. 


ఎంపీసీలో అత్యధిక ఉత్తీర్ణత.. రెండో స్థానంలో బైపీసీ 
– హెచ్‌ఈసీ, సీఈసీ కోర్సుల్లో 50 శాతంలోపే పాస్‌ 
ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా సైన్స్‌ గ్రూపుల్లోనే అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెండింటిలోనూ ఎంపీసీ (మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) గ్రూపులో ఎక్కువ మంది పాసయ్యారు. తర్వాత స్థానంలో బైపీసీ ఉండగా.. సీఈసీ, హెచ్‌ఈసీ వంటి సంప్రదాయ గ్రూపుల్లో తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. 

 
తగ్గిన ఉత్తీర్ణత శాతం 

– వంద శాతం సిలబస్‌ కారణమంటున్న నిపుణులు 
– కోవిడ్‌కు ముందుతో పోలిస్తే ఉత్తీర్ణత ఎక్కువే 

ఇంటర్‌లో గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు రెండింటి ఫలితాలూ ఇలాగే ఉన్నాయి. కోవిడ్‌ కారణంగా 2021లో పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పాస్‌ చేశారు. తర్వాత 2022లోనూ 75శాతం సిలబస్‌తో పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది వంద శాతం సిలబస్‌తో పరీక్షలు పెట్టారు. పూర్తి సిలబస్‌ నేపథ్యంలోనే ఇంటర్‌ జనరల్‌ విభాగంలో ఉత్తీర్ణత స్వల్పంగా తగ్గిందని నిపుణులు చెప్తున్నారు. అయితే 2019తో పోలిస్తే మాత్రం పాస్‌ పర్సంటేజీ ఎక్కువగానే ఉంది. 

కొన్నేళ్లుగా ఇంటర్‌ ఉత్తీర్ణత శాతం (శాతాల్లో) 
ఏడాది    ఫస్టియర్‌        సెకండియర్‌ 
2018–19    60.60        64.94 
2019–20    61.07        69.61 
2020–21    100        100 
2021–22    64.85        68.68 
2022–23    62.85        67.27   

Advertisement
Advertisement