స్నాప్‌చాట్‌లో నకిలీ ప్రొఫైళ్లతో అమ్మాయిలకు వల
ప్రైవసీ ఫీచర్ అడ్డుపెట్టుకుని లైంగిక వేధింపులు, ఆర్థిక దోపిడీలు
యువతరమే లక్ష్యంగా రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
సైబరాబాద్‌లో ఎక్కువ కేసులు
సాక్షి, హైదరాబాద్: స్నాప్‌చాట్ యాప్‌తో సైబర్ నేరస్తులు అలవోకగా మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ ప్రొఫైళ్లలో అమ్మాయిలకు ప్రేమ పేరుతో వల వేసి లైంగిక వేధింపులు, ఆర్థిక దోపిడీలకు తెగబడుతున్నారు. ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గచ్చి»ౌలి, మాదాపూర్, కూకట్‌పల్లి వంటి ఐటీ కారిడార్లు, కాలేజీల పరిసరాల్లో స్నాప్‌చాట్ వేదికగా జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో నేరస్తులు సిండికేట్లుగా ఏర్పడి స్నాప్‌చాట్ వేదికగా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. శనివారం గచ్చిబౌలిలో ఇలాంటి ఉదంతమే వెలుగులోకి వచ్చింది.
వల.. వేస్తారిలా..
సైబర్ నేరగాళ్లు అమాయక యువతులను బురిడీ కొట్టించడానికి పక్కా వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ప్రముఖ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగానో, పేరున్న విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులుగానో నకిలీ ప్రొఫైల్స్ సృష్టిస్తారు. పెద్ద పెద్ద కార్లు, విలాసవంతమైన జీవితాన్ని ప్రతిబింబించే ఫొటోలు పెట్టి అమ్మాయిలను ఆకర్షిస్తారు. స్నాప్‌చాట్‌లో ఉండే క్విక్ యాడ్ ఫీచర్ ద్వారా ఒకే కాలేజీ లేదా ప్రాంతానికి చెందిన వందలాది మందికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతారు. బాధితురాలు ‘మ్యూచువల్ ఫ్రెండ్స్’ సంఖ్యను చూసి, రిక్వెస్ట్ పంపిన నిందితుడు తెలిసినవాడే అనుకుని రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారు.
స్ట్రీక్స్.. లవ్ బాంబింగ్..
ఒకసారి కేటుగాళ్ల ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాక.. ఇక, రోజూ ఫోటోలు పంపుకుంటూ ‘స్ట్రీక్స్’ మెయింటెన్ చేస్తూ నమ్మకం పెంచుకుంటారు. ఆ తర్వాత బాధితులకు అతిగా బహుమతులు ఇవ్వడం, ప్రేమను కురిపిస్తూ ‘లవ్ బాంబింగ్’ చేస్తారు. మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు చూసిన వెంటనే డిలీట్ అయిపోతాయని, డిజిటల్ ఫుట్‌ప్రింట్ ఉండదనే భ్రమను కల్పించి, బాధితుల నుంచి వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలను సేకరిస్తారు. ఫొటోలు చేతికి చిక్కగానే నేరస్తుల అసలు రంగు బయటపడుతుంది. ఫొటోలను మార్ఫింగ్ చేసి ‘లక్షల్లో డబ్బులు ఇవ్వకపోతే ఈ ఫొటోలను మీ అమ్మానాన్నలకు, కాలేజీ వాట్సాప్ గ్రూపులకు పంపుతాం’ అని బెదిరించి, రూ.లక్షలు గుంజుతారు.
ఏం చేయాలంటే..
» గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను నిర్ధారించుకోకుండా యాక్సెప్ట్ చేయకూడదు.
» ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితులకు ప్రైవేట్ ఫొటోలు పంపవద్దు.
» ‘స్ట్రీక్’ కౌంట్ పెంచుకోవడానికి అపరిచితులతో చాటింగ్ చేయొద్దు.
» నేరస్తుడి యూజర్‌నేమ్, సంభాషణ, బెదిరింపుల స్క్రీన్ షాట్‌లను తీసుకోవడం కీలకం.
» ఒకవేళ మోసపోతే 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి.


