
ఎట్టకేలకు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది.
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 20వ తేదీన కార్పొరేటర్లలో 15 మందిని స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నుకోనున్నారు. ఈమేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. నవంబర్ 2వ తేదీన అధికారికంగా ఎన్నికల నోటీసు వెలువరిస్తారు. నవంబర్ 3 నుంచి 11వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ప్రభుత్వ సెలవుదినాలైన 4వ తేదీ, 7వ తేదీన మాత్రం నామినేషన్ల స్వీకరణ ఉండదు.
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం మూడో అంతస్తులోని అడిషనల్ కమిషనర్(ఎన్నికలు) కార్యాలయంలో నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారు. ఎన్ని నామినేషన్లు దాఖలైంది 11వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రకటిస్తారు. 12వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కమిషనర్ నామినేషన్లు స్క్రూటినీ చేస్తారు. (చదవండి: 36 ఏళ్ల తర్వాత ఆమెను, ఆ కుటుంబాన్ని.. ఫేస్‌బుక్ కలిపింది!)
అర్హత కలిగిన నామినేషన్ల వివరాలు అదే రోజు ప్రకటిస్తారు. ఉపసంహరణకు 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువుంది. పోటీలో మిగిలిన అభ్యర్థుల వివరాలు అదేరోజు ప్రకటిస్తారు. నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కమిషనర్ కార్యాలయంలో పోలింగ్ జరుగుతుంది. అదేరోజు పోలింగ్ ముగిశాక 3 గంటల తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. (Huzurabad ByElection: రౌండ్ల వారీగా హుజూరాబాద్ బైపోల్ ఫలితాలు)