కుక్కల దాడిలో చిన్నారి మృతి బాధాకరం.. చర్యలతో పునరావృతం కానివ్వం: మేయర్

సాక్షి, హైదరాబాద్: నగరంలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన బాధాకరమన్నారు జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఈ పరిణామంపై సాక్షి వరుస కథనాల నేపథ్యంలో స్పందించిన ఆమె అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
వీధి కుక్కలను కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. నగరంలో కుక్కలను స్టెరిలైజ్ చేసేందుకు.. ప్రతీరోజూ 30 వాహనాలు తిరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇప్పటిదాకా 4 లక్షల కుక్కలకు స్టెరిలైజ్ చేసినట్లు గణాంకాలు వివరించారామె. నగరంలో ఐదున్నర లక్షలకుపైనే వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా వేస్తున్నట్లు ఆమె తెలిపారు.
అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందడం బాధాకరమన్న ఆమె.. ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారామె. కుక్కలు ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో.. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారామె.
అంతకు ముందు మేయర్ విజయలక్ష్మి అధికారులతో అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ భేటీకి జోనల్ కమిషనర్లు, వెటర్నరీ అధికారులు హాజరయ్యారు. వీధి కుక్కల కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఆమె అధికారుల నుంచి వివరాలను సేకరించారు.
మరిన్ని వార్తలు :