
ఎన్నికల కోసమేనా?
పాలకమండలిలో గళం..
క్షేత్రస్థాయిలోనూ పర్యటనలు
తీరు మారిన కార్పొరేటర్లు
జూబ్లీహిల్స్ అసెంబ్లీపై కన్ను
రేసులో నగర మేయర్ సైతం?
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కాలంలో జీహెచ్‌ఎంసీలోని కార్పొరేటర్ల హడావుడి పెరిగింది. అన్ని కార్యక్రమాల్లోనూ తామున్నామంటూ ముందుకొస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమంటూ సర్కిల్, జోనల్ అధికారులతో పాటు ప్రధాన కార్యాలయంలోని కమిషనర్‌ను, ఉన్నతాధికారులను కలుస్తున్నారు. తమ పరిధిలోని అభివృద్ధి పనులపై ఆరా తీస్తున్నారు. త్వరితంగా చేయాల్సిందిగా తొందర పెడుతున్నారు.
అంతే కాదు.. స్థానిక సమస్యలపైనా పాలకమండలి సమావేశాల్లో గళమెత్తుతున్నారు. అవినీతి, అక్రమాలు, అవకతవకలపై ప్రశ్నలతో అధికారులను ఇరుకున పెడుతున్నారు. బోగస్ బర్త్, డెత్ సర్టిఫికెట్ నుంచి మొదలు పెడితే, వివిధ అంశాల్లో అవినీతిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. వేయని రోడ్లకు బిల్లులు కాజేస్తున్నారంటూ ఇంజినీర్ల అక్రమాలను కళ్లకు కడుతున్నారు.
నాలుగేళ్ల పాటు లేనిది..
గడచిన నాలుగేళ్లుగా లేని చైతన్యం ఇప్పుడే ఎందుకొచ్చింది అనే ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి. త్వరలోనే వారి పదవీకాలం ముగియనుండటం అందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పాలక మండలికి దాదాపు ఏడు నెలల సమయం మాత్రమే ఉంది. తిరిగి గెలవాలంటే ప్రజల్లోకి వెళ్లక తప్పదు. తీరా ఎన్నికలు వచ్చాక వెళ్తే ప్రజలు తిరగబడ్తారని, అభాసుపాలవుతారని తెలిసి ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా తమ దీర్ఘకాల సమస్యలు పరిష్కారమైతే తమకదే పదివేలంటున్నారు ప్రజలు. ఇది అందరి కార్పొరేటర్ల పరిస్థితి కాగా, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల పరిధిలోని కార్పొరేటర్ల పరిస్థితి ఇంకొంచెం భిన్నంగా ఉంది. అందుకు కారణం త్వరలో జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుండటమేనని చెబుతున్నారు.
‘జూబ్లీహిల్స్’పై కన్ను..
ఆ నియోజకవర్గాల్లోని కార్పొరేటర్లతో పాటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సైతం గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు సోమవారం ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. జూబ్లీహిల్స్ పరిధిలోనే ఉన్న యూసుఫ్‌గూడ చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌తో పాటు రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజల ఫిర్యాదులు ఓపికగా విన్నారు. జాప్యం లేకుండా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఇదివరకు లేని విధంగా జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎక్కువసేపు ఉంటున్నారు. మే యర్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ జూబ్లీహిల్స్ కూడా పొరుగునే ఉండటాన్ని ఈ సందర్భంగా పలువురు ప్రస్తావిస్తున్నారు. రాబో యే ఎన్నికల్లో తాను మళ్లీ కార్పొరేటర్‌గా పోటీ చేయ నని ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీపై ఆమె చూపు ఉందేమో అనే వ్యాఖ్యానాలు సైతం వినిపిస్తున్నాయి.