
వర్షాల నేపథ్యంలో డ్‌సీలు, డీసీల పర్యటనలు
ట్రాఫిక్ జామ్‌లపై ప్రత్యేక దృష్టి అత్యవసరమైతే తప్ప
ప్రజలు బయటికి రావొద్దు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధిక వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జీహెచ్‌ఎంసీ యంత్రాంగం సర్వం సన్నద్ధంగా ఉందని కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. బుధవారం జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీస్‌లోని కంట్రోల్ రూంను ఆయన తనిఖీ చేశారు. ఫిర్యాదులపై ఆరా తీశారు. కంట్రోల్ రూం కార్యకలాపాలను సమీక్షించారు. 24్ఠ7 అప్రమత్తంగా ఉండాలని కంట్రోల్ రూం సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
‘నగరంలో భారీ వర్షాలున్నాయనే వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశాం. ఉన్నత అధికారులను హెడ్ క్వార్టర్లో ఉండాలని ఆదేశించాం. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని గమనిస్తూ అపసవ్యతలను చక్కదిద్దుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు శిథిలావస్థకు చేరిన భవనాలలో నివాసం ఉంటున్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.
పౌరుల ఫిర్యాదులపై స్పందించేందుకు, సహాయక కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో ప్రభావవంతంగా నిర్వహించేందుకు పోలీస్, హైడ్రా, విద్యుత్, జలమండలి, మెట్రో రైలు, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. రిలీఫ్ కార్యకలాపాలను డిప్యూటీ కమిషనర్, స్థానిక తహసీల్దార్లు చూసుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీకి కంట్రోల్ రూమ్‌తో పాటు నేరుగా, వివిధ మాధ్యమాల ద్వారా అందుతున్న ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందిస్తున్నాం. నాలాల వద్ద రక్షణ చర్యలు చేపట్టాం. ప్రజలు లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లకూడదు’ అని కమిషనర్ సూచించారు.
ట్రాఫిక్ ఫ్లో సజావుగా సాగేలా చర్యలు..
నగరంలో వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుందని కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ చెప్పారు. నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశా రు. మ్యాన్‌హోళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవవద్దు అని కమిషనర్ జీహెచ్‌ఎంసీ, జలమండలి, హైడ్రా సిబ్బందికి, ప్రజలకు సూచించారు. మ్యాన్‌హోళ్లపై ఫిర్యాదులను జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.
ట్రాఫిక్ చోకింగ్ పాయింట్లపై ప్రత్యేక దృష్టి సారించామని, ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీస్, హైడ్రా తో సమన్వయం చేసుకుంటున్నామన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కృషి చేస్తున్నామని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ సంపుల నిర్మాణంతో వాటర్ లాగింగ్ కాకుండా చేసినందువల్ల ట్రాఫిక్ జామ్‌లు తగ్గాయని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో భూగర్భ సంపులను నిర్మిస్తామని కమిషనర్ తెలిపారు.