ఎల్‌ఎల్‌ఆర్ తర్వాత మరో రెండు ఆన్‌లైన్ టెస్టులు తప్పనిసరి
ఆ తర్వాత డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లో పరీక్ష
సాక్షి, హైదరాబాద్ : డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఇక ఏ మాత్రం ఈజీ కాదు. రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన, వాహనం నడపడంలో నైపుణ్యం ఉంటేనే ఆర్టీఏ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లభిస్తుంది. మొదటి దశలో నిర్వహించే లెర్నింగ్ లైసెన్స్ (ఎల్‌ఎల్‌ఆర్)తోపాటు మరో రెండు ఆన్‌లైన్ పరీక్షలు తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఈ దిశగా డ్రైవింగ్ లైసెన్సుల జారీపై విధివిధానాలు రూపొందించేందుకు రవాణాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకనుగుణంగా వాహన్ సారథి పోర్టల్‌లో మార్పులు చేయనున్నారు.
ఇప్పటి వరకు ఎల్‌ఎల్‌ఆర్ కోసం స్లాట్ నమోదు చేసుకొని, ఆర్టీఏ అధికారులు నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులైన తర్వాత నెల రోజుల నుంచి 6 నెలల వరకు డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరయ్యేందుకు అవకాశం ఉండేది. ఈ వ్యవధిలోనే మరో రెండు పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ రెండు పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లో నిర్వహించే పరీక్షకు అనుమతి లభిస్తుంది. అందులో సాధించే ఉత్తీర్ణతకు అనుగుణంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. ఈ పరీక్షల్లో ఏ దశలో ఫెయిల్ అయినా మరోసారి హాజరుకావాల్సిందే. ఇందుకనుగుణంగా మాడ్యూల్‌ను రూపొందించనున్నట్టు అధికారులు తెలిపారు.
ప్రమాదాల నియంత్రణే లక్ష్యం...
డ్రైవింగ్‌పై సరైన అవగాహన లేకపోవడం, నిబంధనలను ఉల్లంఘించి ప్రమాదా లకు గురికావడం, స్పీడ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ వంటి వివిధ కారణాల వల్ల యువత ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. 25 నుంచి 30 ఏళ్లలోపు యువత వాహనాలు నడిపే సమయంలో అజాగ్రత్తగా వ్యవహరించడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. శాశ్వత వికలాంగులవుతున్నారు.
» మొదట ఎల్‌ఎల్‌ఆర్ పరీక్షకు హాజరయ్యే సమయంలో ట్రాఫిక్ నియమాలపైన కనీస అవగాహనను పరీక్షిస్తారు.
» ఆ తర్వాత నిర్వహించే రెండు పరీక్షల్లో రోడ్డు నిబంధనలు, భద్రతా ప్రమాణాలను వివిధ కోణాల్లో పరీక్షిస్తారు. ఈ రెండు పరీక్షలు ఆన్‌లైన్‌లోనే ఉంటాయి. అభ్యర్థులు ఇంటి వద్ద నుంచే ఈ పరీక్షల్లో పాల్గొనొచ్చు. ఈ రెండింటిలో వారికి ఉన్న అవగాహనను పరీక్షించి డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్‌కు స్లాట్ నమోదు చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఈ మేరకు సారథి పోర్టల్‌లో త్వరలో మార్పులు చేస్తారు.
వీడియోలు ఉంటాయి...
» ఆన్‌లైన్ టెస్టుల్లో పాల్గొనడానికి ముందు రహదారి భద్రతపై అవగాహన పెంచేందుకు రెండు నుంచి మూడు గంటల నిడివి కలిగిన వీడియోలను రూపొందించనున్నారు. ప్రమాదాలకు దారితీసే పరిస్థితులు, నియంత్రణ మార్గాలు, డ్రైవింగ్‌లో మెళకువలు, అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల ఎదురయ్యే పరిణామాలు, పరిమితికి మించిన వేగం వల్ల జరిగే అనర్ధాలు వంటి వివిధ అంశాలపై ఈ వీడియోలు ఉంటాయి.
త్వరలో బయోమెట్రిక్
» డ్రైవింగ్ టెస్ట్‌ట్రాక్‌లలో ఏజెంట్‌లు, మధ్య వర్తులు, దళారుల జోక్యాన్ని పూర్తిగా అరికట్టేoదుకు బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరి చేయనున్నారు. అభ్యర్థులు టెస్ట్‌కు హాజ రయ్యే సమయంలో వేలిముద్రలను నమోదు చేస్తారు. కొన్ని డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో పరీక్షలు నిర్వహించకుండానే లైసెన్సులు అందజేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో రవాణాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.


