సీబీఐ విచారణకు హాజరైన మంత్రి గంగుల, ఎంపీ గాయత్రి రవి

Gangula Kamalakar Gayathri Ravi Attend CBI Enquiry In Fake Officer Case - Sakshi

న్యూఢిల్లీ: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌, రాజ్యసభ ఎంపీ గాయత్రి రవి గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్‌ కేసులో వీరిద్దరూ  సీబీఐ విచారణకు హాజరయ్యారు. శ్రీనివాస్‌ అరెస్ట్‌ వ్యవహారంలో సీఆర్పీసీ 160 ప్రకారం సాక్షులుగా హాజరవ్వాలని గంగుల, గాయత్రి రవికి సీబీఐ బుధవారం నోటీసులు జారీ చేసింది.

కాగా కొవ్విరెడ్డి శ్రీనివాస్‌ గత మూడేళ్లుగా నకిలీ ఐపీఎస్‌గా చలామణి అవుతూ ఢిల్లీ స్థాయిలో రాయబారాలు సాగిస్తూ అనేకమందిని మోసం చేస్తున్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. దీంతో మూడు రోజుల క్రితం ఢిల్లీలోని తమిళనాడు భవన్‌లో శ్రీనివాస్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మున్నురుకాపు ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి గంగుల, ఎంపీ గాయత్రి రవిని శ్రీనివాస్‌ ఫోటోలు దిగినట్లు సమాచారం. అలాగే ఓ గెట్‌ టూ గెదర్‌ కార్యక్రమంలోనూ వీరిని శ్రీనివాస్‌ కలిసినట్లు సీబీఐ చెబుతోంది. ఈ క్రమంలో వీరిద్దరికి శ్రీనివాస్‌తో ఉన్న సంబంధాలపై సీబీఐ ఆరా తీస్తోంది.

నాకు నోటీసులు రాలేదు: బొంతు రామ్మోహన్‌
మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఫోన్స్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేగాక నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కేసులో రామ్మోహన్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంపై బొంతు రామ్మోహన్ స్పందించారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎక్కడికీ వెళ్లలేదని అన్నారు.

నకిలీ ఐపీఎస్‌ శ్రీనివాస్‌ను ఓ ఫంక్షన్‌లో కలిసినట్లు బొంతు రామ్మోహన్‌ తెలిపారు. తనకు సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. సీబీఐ నోటీసులు వస్తే సమాధానం ఇస్తానన్నారు. 
చదవండి: Hyderabad: ఈ ప్రాంతాల్లో జనవరి 31 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top