చైనాతో ఇండియాను పోల్చొద్దు.. కరోనాపై భయాలు వద్దు

Gandhi Hospital Superintendent Raja Rao On Covid Surge In China India - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మన దేశంలో కోవిడ్‌ ఫోర్త్‌వేవ్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నవన్ని ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లేనని, భయపడాల్సిన అవసరం లేదని కోవిడ్‌ నోడల్‌ సెంటర్‌ సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు తెలిపారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతు ఇండియాకు చైనాకు చాలా వ్యత్యాసం ఉందన్నారు.

చైనా అజాగ్రత్తగా వ్యవహించిందని, అక్కడి ప్రజలందరికీ వ్యాక్సినేషన్‌ జరగలేదని, హెర్డ్‌ ఇమ్యూనిటీ రాకపోవడంతో మరోమారు విజృంభిస్తున్నట్లు నిపుణుల పరిశీలన లో తేలిందన్నారు. ఇండియాను చైనాతో పోల్చవద్దన్నారు. ఇండియాలో ముఖ్యంగా తెలంగాణలో వ్యా క్సినేషన్‌ వందశాతం పూర్తయిందన్నారు. ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్లే వ్యాప్తిలో ఉన్నాయని, కరోనా వైరస్‌ రూపాంతరం చెంది కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు.

► చిన్నారులు, వృద్ధులు, గర్భిణిలు, బాలింతలు, దీర్ఘకాల రుగ్మతలతో బాధపడేవారు కోవిడ్‌ తర్వాత వచ్చే బ్లాక్‌ఫంగస్‌ వంటి రుగ్మతల బారిన పడే అవకాశాలున్నాయని, వారంతా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  

► మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరక్టర్‌ (డీఎంఈ) రమేష్‌రెడ్డి ఆదేశాల మేరకు కరోనా పాజిటివ్‌ బాధితుల నుంచి నమూనాలు సేకరించి గాంధీ మెడికల్‌ కాలేజీ వైరాలజీ ల్యాబ్‌లో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు.  

► కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తు, మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్లతో చేతులు పరిశుభ్రం చేసుకోవాలని, సామూహిక, ఎక్కువమంది గుమిగూడే ప్రదేశాలకు దూరంగా ఉండాలన్నారు.  

► గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఎనిమిది మంది కోవిడ్‌ బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. గత కొన్ని నెలలుగా బాధితుల సంఖ్య పదికి మించలేదన్నారు. ఫోర్త్‌వేవ్‌ వచ్చే అవకాశం లేదని, వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top