ఇంట్లో నాలుగు మృతదేహాలు | Four of family found dead at home in Nalgonda | Sakshi
Sakshi News home page

ఇంట్లో నాలుగు మృతదేహాలు

Jun 23 2026 3:49 AM | Updated on Jun 23 2026 3:49 AM

Four of family found dead at home in Nalgonda

నాలుగు రోజుల క్రితమే మరణించినట్లు అనుమానం

హత్యలా లేదా ఆత్మహత్యలా అనే కోణంలో విచారణ

నల్లగొండలో కలకలం

నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఇంట్లో శవాలుగా పడి ఉన్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు సోమవారం సాయంత్రం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న నాలుగు మృతదేహాలను గుర్తించారు. వీరిని మహమ్మద్‌ సుల్తాన్‌(45), ఆయన భార్య హసీనా(40), కుమారుడు ముజమ్మిల్‌ (20), కుమార్తె అక్సర (11)గా గుర్తించారు. మృతదేహాల పరిస్థితిని బట్టి.. వారు నాలుగు రోజుల క్రితమే మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఇంటి బయట గేటుకు తాళం వేసి ఉండగా, లోపలి తలుపులు తెరిచి ఉన్నట్లు గుర్తించారు. ఇంట్లో ముగ్గురు ఒకచోట, ఒకరు మరోచోట మరణించి ఉన్నారు. మృతదేహాలపై గాయాల ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. హసీనా ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, సుల్తాన్‌ బ్యాగుల వ్యాపారం చేస్తున్నారు. ముజమ్మిల్‌ ఏసీ మెకానిక్‌గా పనిచేస్తుండగా, అక్సర ఎనిమిదో తరగతి చదువుతోంది.

మొదటి భార్య చనిపోవడంతో హసీనాను సుల్తాన్‌ రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య పిల్లలు ముజమ్మిల్, అక్సర వీరితోనే ఉంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఇవి హత్యలా లేదా, ఆత్మహత్యలా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనాస్థలిని ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు అనంతరం మరణాలకు గల కారణాలు తెలిసే అవకాశముంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement