
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మంత్రులు దామోదర, తుమ్మల, పొంగులేటితో కలిసి ఖమ్మంలో మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దొరలు, నాయకుల కోసం కాకుండా ప్రజల అవసరాలను తీర్చేలా పనిచేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నూతన భవనాల నిర్మాణానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆపై కలెక్టరేట్‌లో వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్షించారు.
ఏడాదిలోనే రూ.11,482 కోట్లు
బీఆర్‌ఎస్ పాలనలో వైద్య రంగానికి ఏటా సగటున రూ.5,950 కోట్లు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.11,482 కోట్లు వెచ్చించిందని భట్టి వెల్లడించారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ బిల్లులు సైతం తాము చెల్లిస్తూ, పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో ఇప్పటివరకు 90 లక్షల కుటుంబాలకు లబ్ధి జరిగిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు చిలువలు పలువలుగా ప్రచారం చేస్తున్నారని, గత పాలకులు రూ.ఏడు లక్షల కోట్ల అప్పు చేసినా ఏనాడూ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేదని భట్టి ఎద్దేవా చేశారు.
ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం: మంత్రి దామోదర
రాష్ట్రంలో ప్రతీ 35 కి.మీ.కు ఒకటి చొప్పున మొత్తం 84 ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయనున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు.ప్రపంచ బ్యాంక్ మంజూరు చేసిన రూ.4,100 కోట్ల నిధులలో రూ.37 కోట్లతో వరంగల్‌లో రీజినల్ కేన్సర్ సెంటర్, ఖమ్మంలో ఆర్గాన్ రిట్రీవల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల ప్రజలు హైదరాబాద్ వెళ్లే పని లేకుండా స్థానికంగానే సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలు బలోపేతం చేస్తున్నామన్నారు.
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్య, వైద్యానికి సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మెడికల్ కళాశాలలు, అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు అవుతున్నాయన్నారు.
రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా స్థల సేకరణ చేసి ఖమ్మంలో వైద్య కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. గత ప్రభుత్వం మెడికల్ కళాశాలలను మధ్యలో వదిలేస్తే వాటిని పునఃప్రారంభించే దిశగా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా, కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, సీపీ సునీల్‌దత్, రాయల నాగేశ్వరరావు, డాక్టర్ నరేంద్రకుమార్, ఫణీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.