నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలోబేబీ, హబీబ్ సజీవ దహనం
ఊపిరాడక చనిపోయినఇంతియాజ్, చిన్నారులు
దాదాపు 18 గంటలపాటుమండిన బచ్చాస్ షోరూం
ఆదివారం సాయంత్రానికీబయటకు వస్తున్న పొగ
పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు మృతదేహాల అప్పగింత
సాక్షి, హైదరాబాద్/అబిడ్స్: నాంపల్లి స్టేషన్ రోడ్‌లోని సాయి బిశ్వాస్ చాంబర్స్‌లో ఉన్న బచ్చాస్ ఫర్నిచర్ క్యాసిల్ సంస్థలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఐదుగురిని పొట్టన పెట్టుకుంది. శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. ఆదివారం ఉదయానికి మంటలు అదుపులోకి వచ్చాయి. మొత్తంమీద బచ్చాస్ ఫర్నిచర్ సంస్థ 18 గంటల పాటు మండింది.
సెల్లార్‌లో మొదలైన మంటలు
సాయి బిశ్వాస్ చాంబర్స్ సబ్–సెల్లార్, సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌లతోపాటు నాలుగు అంతస్తుల్లో నిర్మితమైంది. దీని గ్రౌండ్ ఫ్లోర్‌లో బచ్చాస్ దుకాణం ఎంట్రన్స్‌తోపాటు మరో ఫర్నిచర్ దుకాణం ఉంది. బచ్చాస్ ఫర్నిచర్ మూడు అంతస్తుల్లో విస్తరించి ఉండగా... సబ్–సెల్లార్, సెల్లార్‌లతోపాటు భవనం కుడి వైపు ఉండాల్సిన సెట్ బ్యాక్‌కు రేకులు వేసి గోదాములుగా వాడుతున్నారు.
రెండు రోజుల క్రితం చైనా నుంచి భారీగా సరుకు వచ్చింది. వీటిని దుకాణంతోపాటు గోదాముల్లోనూ భద్రపరిచారు. ప్రాథమిక అంచనా ప్రకారం శనివారం మధ్యాహ్నం 1.10 గంటల సమయంలో బచ్చాస్ దుకాణం సెల్లార్ వెనుక వైపు మంటలు అంటుకున్నాయి. ఇవి గ్రౌండ్‌తోపాటు మొదటి అంతస్తుకు పాకాయి. రెండు, మూడు, నాలుగు అంతస్తులతో పాటు సబ్–సెల్లార్‌లోకి పొగ విస్తరించింది. సబ్–సెల్లార్‌లో ఉన్న సరుకు మాత్రం యథాతథంగా ఉంది.
కెమికల్స్ కూడా ఉండటంతో...
ఈ భవనం సెల్లార్‌లో బచ్చాస్ ఫర్నిచర్‌కు సంబంధించిన సరుకుతోపాటు పెయింట్స్, కొన్ని రసాయనాలు ఉన్నాయి. వీటి వల్లే మంటల ధాటి ఎక్కువై ప్రమాద తీవ్రత పెరిగింది. సెల్లార్‌లో వెనుక వైపు కుడి పక్కగా రెండు చిన్న గదులు ఉన్నాయి. మెట్లకు సమీపంలో రేకులతో పార్టిషన్ చేసి వీటిని నిర్మించారు. ఈ మెట్లతోపాటు మిగిలిన చోట్ల ఉన్న గ్రిల్స్‌కు యజమానులు తాళాలు వేశారు.
చిన్న గదుల్లోని ఒకదాంట్లో గుల్బర్గా నుంచి వలసవచ్చి బచ్చాస్ సంస్థలో స్వీపర్‌గా పనిచేస్తున్న బేబి (46), మరో గదిలో వాచ్‌మన్ తోకల యాదయ్య, తన భార్య లక్ష్మి, కుమారులు ప్రణీత్ (11), అఖిల్ (8) ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో యాదయ్య, లక్ష్మి బయటకు వెళ్లగా... 1.10 గంటలకు సెల్లార్ నుంచి మంటలు చెలరేగాయి. ఇవి అక్కడ ఉన్న సరుకుతోపాటు కెమికల్స్ కారణంగా వేగంగా విస్తరించాయి.
కాపాడటానికి వెళ్లి...: సుభాన్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఇంతియాజ్ (28), శాస్త్రీపురం వాసి హబీబ్ (35) బచ్చాస్ ఫర్నిచర్ దుకాణంలో ఆటోడ్రైవర్లుగా పనిచేస్తున్నారు. అర్టిప్రమాదం జరిగిన సమయంలో దుకాణం ఎదుట ఉన్న వీరిద్దరూ మంటల్ని చూసి అప్రమత్తమయ్యారు. సెల్లార్‌లో ఉన్న బేబీతోపాటు ప్రణీత్, అఖిల్‌లను రక్షించడానికి సిద్ధమయ్యారు. దుకాణంలో ఉన్న ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు తీసుకొని సెల్లార్‌లోకి వెళ్లారు. దీనికి ఎడమ చివరన ఎంట్రన్స్ ఉండగా, కుడి చివరన వీరు ఉన్న గదులు ఉన్నాయి.
అక్కడ వరకు వెళ్లిన ఇంతియాజ్ చిన్నారులు ఉన్న గదిలోకి, హబీబ్... బేబీ ఉంటున్న గదిలోకి వెళ్లారు. బేబీని తీసుకొని గది నుంచి బయటకు వచ్చిన హబీబ్‌కు బయటపడే మార్గం కనిపించలేదు. మంటల ధాటి పెరిగిపోవడంతో తాను లోపలకు ప్రవేశించిన మార్గం వరకు తిరిగి వచ్చే అవకాశం లేకపోవడం, గ్రౌండ్ ఫ్లోర్‌లోకి వెళ్లే మెట్ల వద్ద ఉన్న గ్రిల్స్‌కు తాళం వేసి ఉండటంతో అక్కడే బేబీతో సహా పడిపోయాడు.
మంటలతో ఇద్దరు... ఊపిరాడక ముగ్గురు !
కిందపడినపోయిన హబీబ్, బేబీ మంటలు అంటుకొని చనిపోయారని పోలీసులు ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇదే సమయంలో ఇద్దరు చిన్నారులను బయటకు తీసుకురావడానికి ఇంతియాజ్ వారు ఉన్న గదిలోకి వెళ్లారు. అప్పటికే ఆ ప్రాంతం మొత్తం పొగ నిండిపోవడం, అది ప్లాస్టిక్, ఫైబర్‌తో పాటు కెమికల్స్ వల్ల వచి్చంది కావడంతో అక్కడే స్పృహతప్పి పడిపోయారు. ఈ గదిలోనే ఊపిరి ఆడక ఇందియాజ్ సహా ఇద్దరు చిన్నారులు చనిపోయి ఉండారని పోలీసులు భావిస్తున్నారు.
ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మంటలు అదుపులోకి వచ్చాయి. అయినా పొగ తగ్గకపోవడం, సెల్లార్, సబ్–సెల్లార్ సామాన్లతో నిండిపోవడంతో లోపలకు ప్రవేశించడానికి రెస్క్యూ టీమ్స్ శ్రమించాల్సి వచి్చంది. మొత్తమ్మీద ఆదివారం ఉదయం 9.10 గంటలకు సెల్లార్‌లోకి ప్రవేశించిన బృందాలు 9.15 గంటలకు హబీబ్, బేబీల మృతదేహాలు గుర్తించారు. 9.45 గంటల సమయంలో మిగిలిన ముగ్గురి మృతదేహాలు దొరికాయి. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించారు.
బేబీ కుమారులు లాల్‌ఖాన్, సమీర్ ఖాన్‌లు బచ్చాస్‌లోనే పని చేస్తున్నారు. వీరికి ఆమె మృతదేహాన్ని అప్పగించారు. చిన్నారులతోపాటు ఇంతియాజ్, హబీబ్ మృతదేహాలను వారి కుటుంబీకులకు ఇచ్చారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక వీరంతా ఎలా చనిపోయారన్న పూర్తి వివరాలు తెలుస్తాయి. బిశ్వాస్ చాంబర్స్‌ను జేఎనీ్టయూకు చెందిన నిపుణుల బృందం ఆదివారం ఉదయం పరిశీలించింది. ప్రొఫెసర్ శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలోని టీమ్ వివిధ కోణాల్లో పరిశీలించింది. వీరు అందించే నివేదిక ఆధారంగా భవనం కూల్చివేతపై అధికారులు నిర్ణయం తీసుకుంటారు.
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం ఘటనలో ఐదుగురు మరణించడం అత్యంత విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
షార్ట్ సర్క్యూట్ వల్లేనని అనుమానిస్తున్నాం
దుకాణ సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్టు అనుమానిస్తున్నాం. ఈ ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. దుకాణ యజమాని సతీశ్ బచ్చాను అరెస్టు చేశాం. రెండు రోజుల క్రితమే బిల్డింగ్ లిఫ్ట్‌నకు మరమ్మతు జరిగింది , అందులో వైరింగ్ సమస్య వల్ల ప్రమాదం సంభవించి ఉండొచ్చు.సెల్లార్‌లో ఫర్నిచర్ నిల్వ ఉంచడంతో మంటలు తొందరగా వ్యాప్తి చెందాయి. – అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్ కుమార్
మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా: మంత్రి పొంగులేటి
బచ్చాస్ ఫర్నిచర్ క్యాసిల్ సంస్థలో చోటుచేసుకున్న ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు తక్షణమే ఆ పరిహారం అందే విధంగా చర్యలు తీసు కోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనను ఆదేశించినట్టు రెవెన్యూ మంత్రి కార్యాలయ వ ర్గాలు ఆదివారం వెల్లడించాయి.
ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, ఐదుగురు అమాయకు లు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


