
సాక్షి, హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌లో కాల్పుల కలకలం రేగింది. మార్నింగ్ వాకర్స్‌పై దుండగులు కాల్పులు జరిపారు. శాలివాహన నగర్ పార్క్‌లో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. వాకింగ్ చేస్తున్న సమయంలో చందు నాయక్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరపగా.. ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
చందు నాయక్ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట వాసిగా పోలీసులు గుర్తించారు. కాల్పులకు భూ వివాదమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారులో నలుగురు వ్యక్తులు.. చందు నాయక్‌పై ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. మృతుడిపై కారం చల్లి.. ఆ తర్వాత దాడికి పాల్పడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇసుక రేణువుల్లో ఉన్న బుల్లెట్స్ కోసం పోలీసులు సెర్చింగ్ చేస్తున్నారు. మృతుడు చందును చంపుతున్న క్రమంలో అడ్డొచ్చిన వారిని దుండగులు గన్‌తో బెదిరించారు. చుట్టుపక్కల సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. గన్స్‌లో ఉన్న బుల్లెట్స్‌ను పరిశీలించిన క్లూస్ టీమ్.. నమూనాలను ల్యాబ్‌కి పంపించారు. నిందితుల కార్ నెంబర్ ఆధారంగా పోలీసులు ట్రాక్ చేస్తున్నారు.
సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యకుమార్ కాల్పుల ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘‘ఉదయం 7:30 గంటలకు ఓ వ్యక్తిపై కాల్పులు జరిగాయని సమాచారం వచ్చింది. చందు నాయక్ అనే వ్యక్తి వాకింగ్ చేస్తుండగా నలుగురు దుండగులు వచ్చి కాల్పులు జరిపారు. షిఫ్ట్ కార్ లో వచ్చి నలుగురు వ్యక్తులు కాల్పులు జరిపారని స్థానికులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.
నిందితుల కోసం 10 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నాం. స్పాట్‌లో 7 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నాం. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించాం. స్పాట్‌లో దొరికిన బుల్లెట్లను చూస్తే ఒకే వెపన్తో ఫైరింగ్ చేసినట్టు ఉన్నాయి. 2022లో జరిగిన హత్య కేసులో చందు నాయక్ నిందితుడిగా ఉన్నాడు.
కాగా, ఈ కాల్పుల ఘటనలో ఎస్‌వోటీ పోలీసుల ఎదుట నలుగురు లొంగిపోయారు. ఐదుగురి మధ్య ఆర్థిక లావాదేవీలే చందునాయక్ హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతుడు చందునాయక్‌తో పాటు ఈ నలుగురు ఓ హత్య కేసులో నిందితులు.
