
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదం, పేలుళ్ల కుట్ర కేసులో విచారణ కొనసాగుతోంది. ఇవాళ ఐదో రోజు పోలీస్ కస్టడీలో సిరాజ్, సమీర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. మరో 20 మంది సభ్యులు ఉన్నట్టు ధ్రువీకరించిన సిరాజ్, సమీర్.. ఆ 20 మంది పేర్లు తెలిసినా.. వారు ఎక్కడున్నారనేది చెప్పడం లేదు. ఆ 20 మంది కోసం తెలంగాణ పోలీసులు వేట మొదలుపెట్టారు. సిరాజ్ అరెస్ట్ తర్వాత విజయనగరంలో అదృశ్యమైన వారు ఎవరు?. హైదరాబాద్‌లో సమీర్ ఇంట్లో సమావేశమైన వారు ఇప్పుడు ఎక్కడ?’’ అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన సూత్రధారి సిరాజేనని, దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లకు వ్యూహరచన చేశాడని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) విచారణలో తేలినట్టు సమాచారం. ఉగ్రవాద భావజాలం, పేలుడు పదార్థాలు కలిగిన హైదరాబాద్‌కు చెందిన సమీర్, విజయనగరం జిల్లా ఆబాద్‌వీధికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్‌ను ఈ నెల 16న కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు వీరిద్దరినీ వారం రోజులు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో ఎన్‌ఐఏ, స్థానిక పోలీస్ అధికారులు విచారణ జరుపుతున్నారు.
గత మూడురోజులుగా నోరు విప్పని సమీర్.. సోమవారం పలు విషయాలు బహిర్గతం చేసినట్టు సమాచారం. పేలుళ్లకు పథక రచన చేసింది సిరాజేనని చెప్పినట్టు తెలిసింది. అహీం గ్రూప్‌నకు అడ్మిన్ కూడా సిరాజ్ అని, అతనితోపాటు మరో 20 మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారని చెప్పినట్టు సమాచారం. సౌదీలో పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన సిరాజ్, హైదరాబాద్‌లో ఉంటూ తరచూ సౌదీతోపాటు ఓమెన్ దేశాలకు వెళ్లినట్టు ఎన్‌ఐఏ గుర్తించింది. వరంగల్‌కు చెందిన ఫర్హన్, ఢిల్లీకి చెందిన బాదర్, సౌదీకి చెందిన ఇమ్రాన్‌తో మిలాఖత్ అయ్యి పాకిస్థాన్‌కు చెందిన ఓ ముస్లిం సంస్థతో టై అప్ అయినట్టు సమాచారం. అహీం గ్రూప్ ద్వారా ఆ సంస్థతో సిరాజ్ సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది.
