జూరాలకు నీటి విడుదలలో అనిశ్చితి! | Farmers oppose Telangana govt request for water from Karnataka | Sakshi
Sakshi News home page

జూరాలకు నీటి విడుదలలో అనిశ్చితి!

Oct 5 2026 5:22 AM | Updated on Oct 5 2026 5:22 AM

Farmers oppose Telangana govt request for water from Karnataka

కర్ణాటక నుంచి వదలకుండానే నిలిపివేశారా అంటూ రైతుల్లో అనుమానాలు 

ప్రస్తుతం జూరాలలో లైవ్‌ స్టోరేజీ 4.5 టీఎంసీలే.. 

ఆయకట్టులో లక్ష ఎకరాల సాగుపై సందిగ్ధం

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: కర్ణాటక నుంచి తెలంగాణకు కృష్ణా నీటి విడుదలలో అనిశ్చితి నెలకొంది. ఇరు రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ఊగిసలాటల మధ్య జూరాల ఆయకట్టులో లక్ష ఎకరాల్లో ఖరీఫ్‌ సాగుపై సందిగ్ధత కొనసాగుతోంది. ఉమ్మడి పాలమూరులోని జూరాల ఆయకట్టు రైతులు సాగు నీటి కోసం ఆందోళనలకు దిగిన క్రమంలో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి బృందం గత నెల 22న కర్ణాటకలో పర్యటించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో తెలంగాణకు 3 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు అక్కడి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. అర్ద్ధాంతరంగా నీటి విడుదల ఆగిపోయింది.  

కర్ణాటకలో వ్యతిరేకత.. 
తెలంగాణకు సాగునీటిని విడుదల చేయడాన్ని కర్ణాటకలోని కృష్ణా బేసిన్‌ జిల్లాల్లోని రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచే గెజిట్‌ నోటిఫికేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తున్న అంశాన్ని అక్కడి పెద్దల దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం.

మానవతా దృక్పథంతో పరిమితంగా నీటిని విడుదల చేయడానికి ఆ రాష్ట్ర మంత్రి ఒకరు మద్దతు తెలపగా.. రైతు సంఘాల నేతలు సాగునీటికి సరఫరా చేస్తే ప్రతిఘటిస్తామని చెప్పినట్టు తెలిసింది. కర్ణాటకలో ఇది వరకే వారబందీ పద్ధతిన సాగునీరు ఇస్తున్నారని, అలాంటప్పుడు తెలంగాణకు ఎలా ఇస్తారని ప్రశ్నించినట్టు సమాచారం.  

మళ్లీ మొదటికి.. రైతుల బెంబేలు 
కర్ణాటకలో ప్రస్తుత పరిస్థితుల్లో జూరాలకు నీటి విడుదలపై మీమాంస కొనసాగుతుండగా.. జూరాల ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఉమ్మడి పాలమూరులోని పలు రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. అధికారిక రికార్డుల్లో పేర్కొన్న గణాంకాలే వారి నాటకాలకు నిదర్శనమని ఉదహరిస్తున్నారు. గత నెల 24 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు నారాయణపూర్‌ నుంచి జూరాలకు 27,600 క్యూసెక్కుల నీరు విడుదలైనట్టు రికార్డుల్లో చూపిస్తున్నారని వివరించారు.

నారాయణపూర్‌ గేట్లు ఎత్తనేలేదని.. ఎగువన రెండు, మూడు రోజులు వర్షాలు కురవడంతో జూరాలకు వరద వచ్చిందని చెబుతున్నారు. గత నెల 23న జూరాలలో నీటి మట్టం 9.214 టీంఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 8.51 టీఎంసీలు. గత నెల 24 నుంచి ఇప్పటివరకు జూరాల నుంచి ఔట్‌ఫ్లో 28,300. ఈ లెక్కన ఇన్‌ఫ్లో, ఔట్‌ ఫ్లో దాదాపు సమానం.

అలాంటప్పుడు నిల్వ ఉన్న నీటిమట్టంలో ఐదారు రోజుల్లోనే అంత తేడా ఎందుకు ఉంటుందని ప్రశి్నస్తున్నారు. కాగా, జూరాల ఆయకట్టులో పంటలు చేతికి రావాలంటే ఐదు నుంచి ఆరు టీఎంసీల నీరు అవసరం. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో లైవ్‌ స్టోరేజీ 4.5 టీఎంసీలే. దీంతో కర్ణాటక నుంచి నీటి విడుదల అనివార్యం. కానీ కర్ణాటక నుంచి నీటి విడుదలపై ప్రస్తుతం డైలమా నెలకొనడం జూరాల ఆయకట్టు రైతులను బెంబేలెత్తిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement