వాంగ్మూలపత్రం రాసిస్తేనే ధాన్యం కాంటా..! 

Farmers appeal to higher authorities to respond about grain purchases - Sakshi

మిల్లర్లు పెట్టే తరుగుకు ఒప్పుకోవాలంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల కొర్రీ 

లేదంటే కాంటా వేయకుండా ఇబ్బంది పెడుతున్న తీరు 

ఉన్నతాధికారులు స్పందించాలని రైతుల విజ్ఞప్తి 

నల్లబెల్లి:  ఇన్నాళ్లూ గుట్టుచప్పుడు కాకుండా రైతుల ధాన్యానికి కోతలు పెట్టడం సాగుతుంటే.. ఇప్పుడు ఏకంగా సంతకాలు తీసుకుని మరీ కోతలు పెడుతున్న పరిస్థితి మొదలైంది. ‘‘నేను నా ధాన్యాన్ని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. జల్లెడ పట్టి ఇతరత్రా చెత్త, మట్టిని క్లీన్‌ చేయకుండా పీపీసీ సెంటర్‌కు అమ్ముతున్నాను. నిబంధనల ప్రకారం నా ధాన్యం లేనందున మిల్లర్‌ తెలిపిన తరుగుదలకు నా ఇష్టపూర్తిగా అంగీకరిస్తున్నాను’’అని రైతుల నుంచి వాంగ్మూలపత్రంపై సంతకం చేయించుకుంటున్నారు.

సంతకం చేయని వారి ధాన్యం కాంటా వేయట్లేదు. వరంగల్‌ జిల్లా నల్లబెల్లి, అర్శనపల్లి కొనుగోలు కేంద్రాల్లో శుక్రవారం ఈ వ్యవహారం వెలుగు చూసింది. నల్లబెల్లి మండలంలో పీఏసీఎస్, ఐకేపీల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. 17శాతం తేమ ఉన్న ధాన్యాన్ని ఒక్కోబస్తా 40 కిలోలు చొప్పున తూకం వేయాల్సి ఉంది. వానలు పడితే ధాన్యం తడుస్తుందని రైతుల్లో ఉన్న భయాన్ని అదునుగా తీసుకుని నిర్వాహకులు ఒక్కో బస్తాను 43 కిలోల వరకు తూకం వేస్తున్నారు.

దీనికి అదనంగా తాలు, తేమ పేరుతో మిల్లర్లు అభ్యంతరం తెలిపితే.. మరింత కోత ఉంటుందంటూ రైతుల నుంచి బలవంతంగా వాంగ్మూలపత్రం తీసుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ధాన్యాన్ని కాంటా వేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. దీనిపై కొందరు రైతులు నిర్వాహకులను నిలదీశారు. తాను వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరిస్తే కాంటా పెట్టలేదని నల్లబెల్లికి చెందిన రైతు ఉడుత వీరన్న పేర్కొన్నాడు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఈ దోపిడీని అరికట్టాలని విజ్ఞప్తి చేశాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top