
32 శాతం ఆత్మహత్యలు కుటుంబ సమస్యల వల్లే
బాధితుల్లో సుమారు 73 శాతం మంది పురుషులే
2023లో దేశవ్యాప్తంగా 1,71,418 ఆత్మహత్యలు
మృతుల్లో మూడొంతులు 18–30 ఏళ్లలోపు వారే
స్వల్పంగా పెరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు
ఆత్మహత్యలపై నివేదిక విడుదల చేసిన ఎన్‌సీఆర్‌బీ
దేశంలో 2023లో మొత్తం 1,71,418 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 2022తో పోలిస్తే ఇది స్వల్పంగా ఎక్కువ. గత 5 ఏళ్లుగా చూస్తే.. ఏటా ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోంది. జాతీయ నేర గణాంక విభాగం (ఎన్‌సీఆర్‌బీ) 2023వ సంవత్సరానికి విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కుటుంబ సమస్యలు, తట్టుకోలేని అనారోగ్య సమస్యలు; మాదక ద్రవ్యాలు, మద్యానికి బానిసలు కావడం, ప్రేమ వ్యవహారాలు, అప్పుల భారం, నిరుద్యోగం, పరీక్షల్లో ఫెయిల్ కావడం.. ఇలా అనేక కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. మొత్తం మరణించినవారిలో దాదాపు 33 శాతం.. 18–30 ఏళ్లలోపు వారే. 2022తో పోలిస్తే (34.56 శాతం) ఇది తక్కువ. 2022లో విద్యార్థుల ఆత్మహత్యలు 7.6 శాతం కాగా, 2023లో ఇవి 8.1 శాతానికి పెరగడం గమనార్హం. మొత్తం మృతుల్లో 72.7 శాతం పురుషులు కాగా, 27.2 శాతం మహిళలు.

టాప్ 10 రాష్ట్రాలు
2021, 2022, 2023.. ఈ మూడు సంవత్సరాల్లోనూ ఆత్మహత్యల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్. మొత్తం ఆత్మహత్యల్లో సుమారు 34 శాతం ఈ రాష్ట్రాల్లోనే జరిగాయి.

అనేక కారణాలు
దేశంలో ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు.. కుటుంబ సమస్యలే. అనారోగ్య సమస్యలను తట్టుకోలేక మరణాన్ని ఆశ్రయించేవారూ ఎక్కువగానే ఉన్నారు. పై రెండు కారణాలవల్లే దాదాపు 51 శాతం ఆత్మహత్యలు జరిగాయి.

వృత్తి / ఉద్యోగాల పరంగా..: ఆత్మహత్యలు చేసుకున్నవారిలో గృహిణులు 14 శాతం కాగా, వ్యవసాయ రంగానికి సంబంధించిన వారు 6.3 శాతం. నిరుద్యోగులు 8.3 శాతం కాగా, విద్యార్థులు 8.1 శాతం. రోజువారీ కూలీలు అత్యధికంగా 27.5 శాతం ఉన్నారు.

ఉరివేసుకుని..: ఆత్మహత్యల్లో అత్యధికంగా సుమారు 61 శాతం ఉరివేసుకుని మరణించారు. విషం తాగి 25 శాతం మంది, నీట మునిగి 4.1 శాతం, వాహనాల కింద పడి 2.8 శాతం మంది ప్రాణాలు తీసుకున్నారు.