మాస్క్‌ ధరించడం చాయిసే

Face Mask Wearing Is Choice Says DPH Dr Srinivasa Rao - Sakshi

వృద్ధులు తప్పనిసరిగా ధరించాలి

జనసమూహంలో ఉన్నప్పుడు అందరూ ధరిస్తే మంచిది

ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం కోవిడ్‌ ఆంక్షలను ఎత్తివేసిందని ప్రజా రోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. ‘గత రెండేళ్లుగా కరోనాతో ఎంతో ఇబ్బందిపడ్డాం. మాస్క్‌లు ధరించడాన్ని కొంత అసౌకర్యంగా భావించాం. అందువల్ల మాస్క్‌ పెట్టుకోవాలా.. వద్దా.. అనేది ఇప్పుడు చాయిస్‌ మాత్రమే’అని స్పష్టం చేశారు. అయితే కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోనందున మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం మంచిదని అభిప్రాయపడ్డారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మాస్క్‌లు ధరించాలని, ముఖ్యంగా ఆసుపత్రులకు వెళ్లినప్పుడు తప్పనిసరని పేర్కొన్నారు. ఇతరులు జనసమూహంలో ఉన్నప్పుడు ధరించాలని  సూచించారు.

గురువారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాస్క్‌ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా కొనసాగుతుందని, అయితే ఈ విషయం లో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించాలని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తు తం రోజుకు 40 కరోనా కేసులు నమోదవుతున్నాయని, 20 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కావడం లేదన్నారు. ఆరేడు జిల్లాల్లో ఒక్కో కేసు, జీహెచ్‌ఎంసీలో 20 వరకు కేసులు నమోదవుతున్నాయని చెప్పారు.

ప్రస్తుతం 0.18 శాతం పాజిటివిటీ నమోదవుతోందని, ఇప్పటివరకు ఇదే అత్యల్పమని పేర్కొన్నారు. కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కరోనా కేసులు నమోదవుతున్నా, ఆ వేరియంట్లు ఇప్పటికే మనదేశంలో వచ్చిపోయాయని అన్నా రు. ఈ ఏడాది చివరినాటికి కరోనా ఎండమిక్‌ దశకు చేరుకుంటుందని, ఏదో ఒక ప్రాంతానికి అది పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఎన్ని వేరియంట్లు వచ్చినా మనం తట్టుకోగలమన్నారు. 

వ్యాక్సిన్‌ వికటించి ఒకరు మృతి
18 ఏళ్లుపైబడిన వారందరికీ మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌ పూర్తయిందని డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. 12–14 ఏళ్ల వయస్సు పిల్లల వ్యాక్సినేషన్‌లో హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాలు వెనుకబడ్డాయని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లోనూ వ్యాక్సినేషన్‌ చేపట్టామని, ఈ రెండు జిల్లాల్లో ప్రైవేట్‌ స్కూళ్లు ఎక్కువగా ఉన్నాయని, యాజమాన్యాల నుంచి అనుమతి రావడంలేదన్నారు. ప్రతీ తొమ్మిది నెలలకు కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నారు. ఇప్పటికే ఐటీ కంపెనీలు 50 నుంచి 60 శాతం వరకు వర్క్‌ఫ్రం హోం ఎత్తేశాయని, మిగిలినవి కూడా ఇదే పద్ధతిని పాటించాలని కోరారు.

12–14 ఏళ్ల పాపకు వ్యాక్సిన్‌ వికటించి బ్రెయిన్‌డెడ్‌ అయిన సంఘటనపై డాక్టర్‌ శ్రీనివాసరావు స్పందిస్తూ, టీకాకు, దానికి సంబంధంలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆ వయస్సు వారిలో 7 లక్షలకుపైగా టీకాలు వేస్తే, ఎవరికీ ఏమీ కాలేదన్నారు. రాష్ట్రంలో 6 కోట్ల టీకా డోసులు వేస్తే, రాష్ట్రంలో ఒకరు చనిపోయారని, దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించిందన్నారు. టిమ్స్‌ ఆసుపత్రిని ఎత్తేయడంలేదని, అక్కడ సాధారణ ఓపీ కొనసాగుతుందని, దాన్ని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. 

పెరిగిన ఎండల తీవ్రత
రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగిపోయిందని, రాష్ట్రంలోని 6 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసిందని డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం 40 డిగ్రీలకుపైగా ఎండలు ఉంటున్నాయని, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని అన్నారు. వడదెబ్బ తగిలినవారిని వెంటనే నీడలోకి తీసుకువెళ్లి గాలి ఆడేలా చూడాలని, అరగంటలోపు లక్షణాలు తగ్గకపోతే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.

నిరంతరం బయట ఉంటూ విధులు నిర్వహించేవాళ్లు ఎక్కువగా నీరు, పానీయాలు తీసుకోవాలన్నారు. రోజుకు 4 లీటర్లకుపైగా నీరు తాగాలని, కొబ్బరినీళ్లు, మజ్జిగ తరచూ తీసుకోవాలన్నారు. ఈసారి ఎండలు తీవ్రంగానే ఉంటాయన్నారు. అన్ని ఆసుపత్రులకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్‌ పంపించామన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలని, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top