శ్రీశైలం అగ్ని ప్ర‌మాదం: పరిహారం భారీగా పెంపు

Extra 75000 Announced For Victims Of Sri Sailam Fire Accident - Sakshi

సాక్షి, నాగర్ కర్నూల్ : శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఎక్స్ గ్రేషియాకు అదనంగా రూ.75 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు తెలంగాణ జెన్ కో- ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన డిఈ కుటుంబానికి మొత్తం రూ.1.25 కోట్లు, మిగతా ఉద్యోగుల కుటుంబాలకు 1 కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందుతుందని ఆయ‌న వెల్లడించారు. మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇతర శాఖాపరమైన సహాయం కూడా త్వరితగతిన అందించనున్నట్లు వెల్లడించారు. (శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో ఉత్కంఠ!)

తెలంగాణ జెన్ కో బోర్డు సమావేశం సీఎండీ ప్రభాకర్ రావు అధ్యక్షతన విద్యుత్ సౌధలో శనివారం జరిగింది. శ్రీశైలం ప్రమాదంపై బోర్డు సమావేశంలో విస్తృతంగా చర్చించారు. మరణించిన వారికి బోర్డు సభ్యులు సంతాపం తెలిపారు. సమావేశంలో సీఎండీ పాటు డైరెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా  శ్రీశైలం ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. కుటుంబ పెద్దను కోల్పోయి దుఃఖంలో ఉన్న వారి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సముచిత నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. (శ్రీశైలం పవర్‌ ప్లాంట్‌లో మళ్లీ పేలుడు?)

గతంలో ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి సహాయం అందింది, భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే విషయంతో సంబంధం లేకుండా శ్రీశైలం ప్రమాదాన్ని ప్రత్యేక పరిస్థితిగా పరిగణలోకి తీసుకుని, ప్రత్యేక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కూడా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు చేయగలిగినంత సాయం చేయాల్సిందిగా సీఎండీని కోరారు. ముఖ్యమంత్రి, మంత్రి ఆదేశాలను పరిగణలోకి తీసుకుని, మరణించిన వారి త్యాగాన్ని, సాహసాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన సహాయంపై బోర్డు విస్తృతంగా చర్చించింది. శ్రీశైలం ప్రమాదాన్ని ప్రత్యేకమైన అంశంగా పరిగణించి సహాయం అందించాలని బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయించింది. 

‘‘ప్రమాదంలో మన తోటి ఉద్యోగులు మరణించడం అందరినీ కలిచివేస్తున్నది. ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన. మరణించిన వారిది గొప్ప సాహసం, త్యాగం. మరణించిన వారిని మళ్లీ తీసుకురాలేకపోవచ్చు. కానీ మానవ మాత్రులుగా చేయాల్సినంత సహాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. గతంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా కాకుండా, ప్రత్యేక అంశంగా పరిగణించి సహాయం అందించాలి. ప్రభుత్వం ప్రకటించిన సహాయానికి అదనంగా తెలంగాణ జెన్ కో పక్షాన అదనపు సహాయం అందించాలని భావిస్తున్నాం’’ అని సీఎండీ ప్రభాకర్ రావు సమావేశంలో ప్రకటించారు. 

మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రతిపాదనలు చేయగా, వాటిని బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించింది. అవి
1. ప్రమాదంలో మరణించిన డిఇకి రూ.50 లక్షలు, మిగతా ఉద్యోగులకు రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. దీనికి అదనంగా తెలంగాణ జెన్ కో ఒక్కొక్క కుటుంబానికి రూ.75లక్షల చొప్పున సహాయం అందిస్తుంది. దీని వల్ల డిఈ కుటుంబానికి మొత్తం రూ.1.25 కోట్లు, ఇతర ఉద్యోగుల కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున సహాయం అందుతుంది.

2. మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి విద్యుత్ సంస్థల్లో ఉద్యోగ అవకాశం కల్పించబడుతుంది. విద్యార్హతలను బట్టి డిఈ, ఎఈల కుటుంబాలకు ఎఈ/పీఓ ఉద్యోగాలు, ఇతరులకు జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. 

3. ప్రమాదానికి గురైన శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో తిరిగి ఉత్పత్తి ప్రారంభించేందుకు అసవరమైన చర్యలు తీసుకోవడానికి ముగ్గురు సభ్యుల కమిటీని సీఎండీప్రభాకర్ రావు నియమించారు. జెన్ కో హైడల్, సివిల్ డైరెక్టర్లు, శ్రీశైలం ప్రాజెక్టు సిఇలు ఇందులో సభ్యులుగా ఉంటారు. శ్రీశైలం ప్లాంటులో జరుగుతున్న పునరుద్ధరణ పనులను పర్యవేక్షించడంతో పాటు, అక్కడికక్కడే అవసరమైన నిర్ణయాలు తీసుకుని అమలు పరుస్తారు. వీలైనంత త్వరగా ప్లాంటును పునరుద్ధరించడం లక్ష్యంగా కమిటీ పనిచేస్తుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top