దారిలేదు.. ముగ్గురం చనిపోయేట్టు ఉన్నాం! | Imtiaz phone call goes viral on social media | Sakshi
Sakshi News home page

దారిలేదు.. ముగ్గురం చనిపోయేట్టు ఉన్నాం!

Jan 31 2026 6:01 AM | Updated on Jan 31 2026 6:01 AM

Imtiaz phone call goes viral on social media

సోషల్‌ మీడియాలో వైరల్‌గా ఇంతియాజ్‌ ఫోన్‌ కాల్‌  

నాంపల్లి అగ్ని ప్రమాదంలో మృతుడి ఆఖరి మాటలు  

చిన్నారుల కోసం వెళ్లి చిక్కుకొని మిత్రుడిని వేడుకోలు

సాక్షి, హైదరాబాద్‌/అబిడ్స్‌: ‘హలో... అన్నా, అన్నా.. మర్‌జాతే అన్నా. జగా నహీహై అన్నా’ నాంపల్లి స్టేషన్‌ రోడ్‌లోని సాయి బిశ్వాస్‌ చాంబర్స్‌లో ఉన్న బచ్చాస్‌ ఫర్నిచర్‌ క్యాసిల్‌ సంస్థలో గత శనివారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో అసువులు బాసిన ఆ షాపు ఆటో డ్రైవర్‌ మహ్మద్‌ ఇంతియాజ్‌ మాటలు ఇవి. సెల్లార్‌లో ఉన్న చిన్నారుల్ని రక్షించడానికి వెళ్లి, తప్పించుకునే దారిలేక, చిక్కుకుపోయిన అతడు అక్కడి నుంచే అదే దుకాణంలో పనిచేసే తన స్నేహితుడికి ఫోన్‌ చేశాడు. 

ఈ కాల్‌లో అతడు మాట్లాడుతుండగా..వెనుక చిన్నారుల అరుపులు, ఏడుపులు సైతం వినిపించాయి. సదరు స్నేహితుడి ఫోన్‌లో రికార్డు అయిన ఈ కాల్‌ శుక్రవారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి అనేక మందిని కన్నీరు పెట్టించింది. ఈ ఫోన్‌ సంభాషణను పరిశీలిస్తే ఆ దుకాణంలోని సెల్లార్, సబ్‌ సెల్లార్‌ సరుకుతో నిండిపోయి ఉండటం, ఎటూ కదలడానికి ఖాళీ లేకపోవడం, తలుపులు, గ్రిల్స్‌కు తాళాలు వేసి ఉండటం తదితర పరిస్థితులు స్పష్టంగా తెలుస్తున్నాయి. 

మంటలు చుట్టుముడుతుండటం ఇంతియాజ్, చిన్నారులు భయంతో, పొగ నిండిపోవడంతో ఊపిరి పీల్చుకోలేక వారు పడిన ఇబ్బంది కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇది అనేక సిటీజనుల హృదయాలను కలచివేసింది. ఈ కాల్‌లో మాట్లాడింది దుకాణ యజమానే అని తెలుస్తోంది. అయితే దీనిని అధికారులు ధ్రువీకరించట్లేదు. 

ఇదీ జరిగింది... 
ఈ దుకాణం సెల్లార్‌లో రెండు చిన్న గదులు ఉన్నాయి. ఒకదాంట్లో గుల్బర్గా నుంచి వలసవచ్చి బచ్చాస్‌ సంస్థలో స్వీపర్‌గా పనిచేస్తున్న బేబీ, తన కుమారుడు సమీర్‌తో కలిసి మరో గదిలో వాచ్‌మన్‌ తోకల యాదయ్య, తన భార్య లక్షి్మ, కుమారులు ప్రణీత్, అఖిల్‌లతో కలిసి ఉన్నారు. సుభాన్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ ఇంతియాజ్‌ , శాస్త్రీపురం వాసి హబీబ్‌ బచ్చాస్‌ ఫర్నిచర్‌ దుకాణంలో ఆటోడ్రైవర్లుగా పని చేసేవారు. 

వినియోగదారులకు సంబంధించిన సరుకు డెలివరీ వీరి బాధ్యత. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో దుకాణం ఎదుట ఉన్న ఇంతియాజ్, హబీబ్‌ అప్రమత్తమయ్యారు. సెల్లార్‌లో ఉన్న బేబీతో పాటు ప్రణీత్, అఖిల్‌లను రక్షించడానికి సిద్ధమయ్యారు. దుకాణంలో ఉన్న ఫైర్‌ ఎక్స్‌టింగి్వషర్లు తీసుకొని సెల్లార్‌లోకి వెళ్లారు. ఇంతియాజ్‌ చిన్నారులు ఉన్న గదిలోకి, హబీబ్‌... బేబీ ఉంటున్న గదిలోకి వెళ్లారు. ఈ ఐదుగురూ అక్కడే అసువులు బాశారు.

ఇంతియాజ్, స్నేహితుడి మధ్య ఉర్దూలో జరిగిన సంభాషణ తెలుగులో...
ఇంతియాజ్‌: హలో అన్న.. అన్న.. చనిపోతాం అన్న. ఎక్కడా దారి లేదు అన్న.  
స్నేహితుడు: అరె ఇటు ఎందుకు వచ్చావు? అటు నుంచి వెనుక వైపు నుంచి రా 
ఇం: ఎక్కడా స్థలం లేదు అన్న. చనిపోతాం అన్న. తలుపు మూసి ఉంది 
స్నే: ఏ తలుపు మూసి ఉంది? 
ఇం: వెనుకాల ఉన్న తలుపు మూసి ఉంది 
స్నే: అదెలా మూసి ఉంది 
ఇం: నాతోపాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు... ముగ్గురం చనిపోతాం అన్న 
స్నే: ఇంతియాజ్‌ ముందు నా మాట విను. ఇటు నుంచి రా బయటకు 
ఇం: ఎటు నుంచీ అవకాశం లేదు అన్నా అన్నీ మూసి ఉన్నాయి 
స్నే: అక్కడ గ్రిల్‌ గేట్‌ ఉంది కదా... దాని నుంచి బయటకు రా 
ఇం: అంతా చూశాను ఎక్కడ నుంచీ బయటకు రావడానికి ఆస్కారం లేదు 
స్నే: గ్రిల్‌ గేట్‌... గ్రిల్‌ గేట్‌.. సెకండ్‌ సెల్లార్‌లోకి వెళ్లిపో 
ఇం: ఏదీ తెరుచుకోవట్లేదు అన్న 
స్నే: తెరుచుకోవట్లేదా..? సెకండ్‌ సెల్లార్‌లోకి వెళ్లు 
ఇం: ఇక్కడ ఏం చేయలేను అన్న 
స్నే: ఏదో ఒకటి చేసి సెకండ్‌ సెల్లార్‌లోకి దూకెయ్‌ ఇంతియాజ్‌.. లేదంటే ఇబ్బంది అయిపోతుంది.  
ఇం: లేదు అన్న.. ఏం కనిపించట్లేదు 
స్నే: అక్కడ ఉన్న వస్తువులు పక్కకు పడేృయ్‌ 
(ఈ సమయంలో ఇంతియాజ్, చిన్నారులు ఊపిరి అందక ఆయాస పడటంతోపాటు దగ్గుతున్నట్లు రికార్డు అయింది) 
ఇం: నాతో పాటు పిల్లలు కూడా ఉన్నారు. ఎంతకీ కనిపించట్లేదు 
స్నే: అదే చెబుతున్నా... ఇంతియాజ్‌ సెకండ్‌ సెల్లార్‌లోకి దూకెయ్‌ 
ఇం: వెనుక ఉన్న తలుపు తీయమని చెప్పు అన్న 
స్నే: ఇంతియాజ్‌ మంటల తీవ్రత ఎక్కువగా ఉంది. కిందకు వెళ్లే పరిస్థితి లేదు 
ఇం: అన్న నేనేం చేయలేను.. కనిపించట్లేదు.. సమీర్‌ని వాళ్ల రూమ్‌ తలుపు తీయమని చెప్పు 
(ఈ అగ్నిప్రమాదంలో చనిపోయిన బేబీ కుమారుడే సమీర్‌) 
స్నే: మంటలు ఎక్కువగా ఉన్నాయి అక్కడకు వెళ్లడం కుదరదు. సెకండ్‌ సెల్లార్‌లోకి దూకెయ్‌ 
ఇం: ఎక్కడా స్థలం లేదు... నేను బయటకు రాలేను 
స్నే: పిల్లల్ని తీసుకొని సెకండ్‌ సెల్లార్‌లోకి వెళ్లిపో... 
ఇం: అన్నా... నేను వెళ్లలేను... అంతా చీకటి, ఏం కనిపించట్లేదు 
స్నే: టార్చ్‌ వేసుకో... ఏదో ఒకటి వేసుకో... సమీర్‌ గది తలుపు దగ్గరే మంట అంటుకుంది 
ఇం: వెళ్లలేం అన్న 
స్నే: ఎవరెవరు ఉన్నారు కింద 
ఇం: ముగ్గురం ఉన్నాం 
స్నే: ఆగు నేను పంపిస్తాను  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement