మత్తు వదలరా... మద్యం మానేయాలంటూ హితభోధ!

Ex Alcoholics Awareness Programs Conduct Conferences Debate  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘టెన్త్‌లో ఫస్ట్‌ సెకండ్‌ థర్డ్‌ వచ్చామని ముగ్గురం స్నేహితులం కలిసి బీరు కొనుక్కుని అందులో నీళ్లు పోసుకుని ట్యాంక్‌ బండ్‌ కింద ఫ్రెండ్‌ కారులో కూర్చుని తాగాం. అలా మొదలైన జర్నీ 33 సంవత్సరాలు నిరాటంకంగా నడిచింది. ఆఖరి 7 సంవత్సరాల్లో చివరి మూణ్నెళ్లు సూర్యుడ్ని చూడలేదంటే నమ్మండి’ అంటారు నగరానికి చెందిన కె.మూర్తి (62). ఆయనకు 36వ ఏటే హార్ట్‌ ఎటాక్‌ వచ్చి బైపాస్‌ సర్జరీ జరిగినా మద్యం మానని ఆయన ఇప్పుడు వ్యసనాలన్నీ వదిలేసి, అరవైలో ఇరవైలా హాయిగా ఉన్నారు. అంతేకాకుండా తనలాంటి మరికొందరి చేత తాగుడు మానిపించే పనిలో బిజీగా ఉన్నారు.  

నగరానికి చెందిన ఓ టాప్‌ లేడీ డాక్టర్‌...20 ఏళ్ల పాటు మద్యానికి బానిసయ్యారు. అర్జున్‌రెడ్డి సినిమాలో చూపించినట్టు ఆపరేషన్‌ థియేటర్స్‌కి కూడా తాగి వెళ్లేవారట. అలాంటి మహిళా వైద్యురాలు ఇప్పుడు అరవై ఏళ్ల వయసులో పూర్తిగా మందు మానేసి ఆల్కహాల్‌ వ్యసనాన్ని దూరం చేసే మందుగా మారారు.  ...ఇలా తాగుడు మానాలని అనుకున్నవారు, విజయవంతంగా మానేసిన వారు..కొత్త పాత ఆల్కహాలిక్స్‌ కొందరు నగరంలో పలు చోట్ల సమావేశం అవుతున్నారు. తమను తాము సంస్కరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. వీరిని కలిపేందుకు వారధిగా మారింది ఆల్కహాలిక్స్‌ అనానిమస్‌ ఫెలోషిప్‌.  

అమెరికాలో పుట్టి...అంతర్జాతీయంగా మెట్టి... 
దాదాపుగా 90 ఏళ్ల వయసున్న ఆల్కహాలిక్‌ అనానిమస్‌ (ఎఎ) సంస్థ అమెరికాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. ఆల్కహాలిక్స్‌ను విముక్తుల్ని చేసేందుకు అవసరమైన చికిత్సలో వైద్యులకు కో థెరపీగా గుర్తింపు పొందింది. దీనిలో భాగంగానే ఒక ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించింది. మహిళలు, పురుషులు ఆల్కహాల్‌ వ్యసనం నుంచి బయటపడడానికి స్వచ్ఛందంగా ఇందులో భాగస్తులు అవుతారు. పరస్పరం ఆల్కహాలిజమ్‌ కు దూరమయ్యేందుకు సహకరించకుంటారు.

ఫీజులు, రుసుములు ఏమీ ఉండవు. వ్యసనం నుంచి బయటపడాలనే ఆకాంక్ష ఒకటే అర్హత. మందులు, ఇతరత్రా ఉపయోగించరు.  తాగుడు వ్యసనాన్ని దూరం చేసుకున్నవారిని సోబర్స్‌గా పిలుస్తారు.  ఈ సోబర్స్‌.. బృందంలో చేరి ఆ విషయాలను విడమరచి చెప్పుకోవడం ఇందులో ప్రధానమైన విశేషం. వీరికి సంబంధించిన సమావేశాలు, ఇతరత్రా విషయాలన్నీ రహస్యంగానే ఉంచుతారు. వ్యసన పరుల కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువు లు కూడా దీనికి అనుబంధంగా పనిచేస్తుంటారు.  

ట్విన్‌ సిటీస్‌లోనూ మీటింగ్స్‌.. 
ఈ సంస్థ గురించి తెలిసిన నగరవాసులు గతంలో ముంబై వెళ్లి సమావేశాల్లో పాల్గొనేవారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వారానికి 60, 70 దాకా సమావేశాలు జరుగుతున్నాయి. నగరంలోనూ సెయింట్‌  ఫ్రాన్సిస్‌ ఉమెన్స్‌ కాలేజ్, వైఎంసిఎ నారాయణగూడ, మాదాపూర్, దిల్‌సుఖ్‌నగర్, నానక్‌రాంగూడ తదితర ప్రాంతాల్లో వారానికి డజను దాకా సదస్సులు నిర్వహిస్తున్నారు. 

లాక్‌డౌన్‌లో పీక్స్‌.. 
ఈ సంస్థ కార్యకలాపాలు నగరంలో లాక్‌ డౌన్‌ టైమ్‌లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఆ సమయంలో ఆల్కహాలిక్స్, వారి బంధువుల నుంచి హెల్ప్‌లైన్స్‌కి కాల్స్‌ వెల్లువెత్తాయి. అయితే మీటింగ్స్‌ నిర్వహించే అవకాశం లేక పలువురికి సాయం చేయలేకపోయాం అంటున్నారీ గ్రూప్‌ సభ్యులు. రెగ్యులర్‌ మెంబర్స్‌కి మాత్రం  ఆన్‌లైన్, ఫోన్‌ ఇన్, జూమ్‌ మీటింగ్స్‌ నిర్వహించామని చెప్పారు.  ఈ సంస్థ సహకారం కోసం 
సంప్రదించాల్సిన నెంబర్లు: 96664 66118/119  

(చదవండి: ‘స్పీడ్‌’ రూల్స్‌ ఇక పక్కా!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top