ఈఎస్‌ఐలో పేరుకుపోయిన రీయింబర్స్‌మెంట్ బకాయిలు
పెండింగ్‌లో రూ.55 కోట్ల మేర మూడేళ్ల బిల్లులు
సాక్షి, హైదరాబాద్: కార్మిక రాజ్యబీమా పరిధిలో మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు భారీగా పేరుకుపోతున్నాయి. చికిత్స పొందిన కార్మికులు...వెనువెంటనే బిల్లులు సమర్పిస్తున్నప్పటికీ వాటిని ఆమోదించడం, నిధులు విడుదల చేయడంలో మెడికల్ ఇన్సూరెన్స్ సర్విసెస్ సంచాలక కార్యాలయం(డీఐఎంఎస్) తీవ్ర జాప్యం చేస్తోంది. దాదాపు మూడేళ్లకు పైబడి మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. దాదాపు 11 వేల బిల్లులకు సంబంధించి రూ.55 కోట్లమేర బకాయిలు ఉన్నట్లు తెలిసింది. సాధారణంగా మెడికల్ బిల్లు సమర్పించిన నాటి నుంచి మూడు నెలల్లోపు పూర్తిగా చెల్లింపులు చేయాల్సి ఉండగా...ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో కార్మికులు డీఐఎంఎస్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
అత్యవసర సేవల కోసం...
రాష్ట్రంలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్‌ఐ)పరిధిలో 18.75లక్షల మంది కార్మికులు చందాదారులుగా కొనసాగుతున్నారు. వేతనం నుంచి నెలవారీ చందా ఈఎస్‌ఐసీకి చెల్లిస్తుండడంతో వారికి వైద్య సేవలు ఉచితంగా అందించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఈఎస్‌ఐ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సనత్‌నగర్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కొనసాగుతుండగా...రాష్ట్ర కార్మిక శాఖ పరిధిలో ఉన్న మెడికల్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ డైరెక్టరేట్ పరిధిలో 10 ఆస్పత్రులు, 70 డిస్పెన్సరీల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు.
సమీపంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి లేకపోవడం, లేదా అక్కడ వైద్య సేవలకు మౌలిక వసతులు లేకపోవడం, అత్యవసర కేటగిరీలో శస్త్ర చికిత్సల కోసం ఈఎస్‌ఐసీ గుర్తింపు పొందిన ప్రైవేటు ఆస్పత్రుల్లో ఐపీ సేవలు పొందే వెసులుబాటు కల్పించింది. ఈ కేటగిరీలో వైద్య సేవలు పొందేందుకు ముందుగా కార్మికుడు వ్యక్తిగతంగా ఖర్చులు భరించి...ఆ తర్వాత బిల్లులు సమర్పించి నిధులు పొందవచ్చు.
కార్పొరేషన్ పరిధిలోని సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి మినహాయిస్తే... నాచారం, జీడిమెట్ల, రామచంద్రాపురం, వరంగల్ ఆస్పత్రుల్లో అత్యాధునిక వసతులు లేకపోవడంతో వైద్య సేవల కోసం ప్రైవేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు. గత మూడేళ్లుగా ఈ కేటగిరీలో దాదాపు 15వేల మంది కార్మికులు ప్రైవేటు ఆస్పత్రుల్లో సేవలు పొందారు. ఇందులో దాదాపు 11వేల బిల్లులకు సంబంధించి నిధులు విడుదల కాకుండా పెండింగ్‌లో ఉన్నాయి.
కార్పొరేషన్ నిధులిచ్చినా...
కార్మికుల వైద్య సేవల కోసం ఈఎస్‌ఐసీ పరిధిలోని ఆస్పత్రుల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేయడంతోపాటు ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయిస్తుంది. ప్రతి మూడు నెలలకోసారి ఈ నిధులను విడుదల చేస్తుంది. అయితే ఈ నిధులు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు విడుదల చేస్తాయి. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ ఇన్సూరెన్స్ సర్విసెస్ డైరెక్టరేట్‌కు విడుదల చేయాలి. కానీ రెండున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదలలో జాప్యం చేస్తోంది. దీంతో మెడికల్ రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు నిలిచిపోవడంతో బిల్లుల క్లియరెన్స్ కోసం కార్యాలయానికి వచ్చే కార్మికులకు బడ్జెట్ రాలేదంటూ చేతులు దులిపేసుకుంటున్నారు.


