
ఇంజనీరింగ్‌లో యాజమాన్య సీట్లు 25,956
ఇప్పటివరకు 8 వేలు కూడా నిండక బేజారు
అడ్మిషన్లు పూర్తయ్యేనాటికి 15 వేలు నిండితే గొప్పే
కన్వీనర్ కోటాలోనే మిగిలిపోయిన 11,638 సీట్లు
విద్యార్థుల కోసం రంగంలోకి కన్సల్టెన్సీలు, పీఆర్‌ఓలు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్లు భారీగా మిగిలిపోయే అవకాశం కన్పిస్తోంది. టాప్ కాలేజీలకే విద్యార్థులు ప్రాధాన్యమిస్తున్నారు. జిల్లాలు, రాజధాని పరిసర ప్రాంతాల్లోని సాధారణ కాలేజీల్లో చేరేందుకు మొగ్గు చూపడం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు 180 ఉన్నాయి. వీటి పరిధిలో కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటా సీట్లు 1,16,877 ఉన్నాయి. ఇందులో కన్వీనర్ కోటా కింద 90,921 సీట్లు ఉన్నాయి.
156 ప్రైవేటు కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా కింద 25,956 సీట్లు ఉన్నాయి. టాప్ టెన్ కాలేజీల్లో దాదాపు 7 వేల సీట్లు ఉన్నాయి. కన్వీనర్ కోటా సీట్లే ఇంకా 11,638 మిగిలిపోయాయి. యాజమాన్య కోటా సీట్లు అన్ని కాలేజీల్లో కలిపి 8 వేలకు మించి భర్తీ అవ్వలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. టాప్ టెన్ కాలేజీల్లో కూడా యాజమాన్య కోటాలో కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సులకే ఎక్కువ డిమాండ్ కనిపించింది. ఈసీఈ, సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచీల్లో సీట్లు మిగిలిపోయాయి.
15 వేల సీట్ల భర్తీ కూడా కష్టమే
యాజమాన్య కోటాలో ఉన్న 25,956 సీట్లలో స్పాట్ అడ్మిషన్లు పూర్తయ్యే వరకు 15 వేల సీట్లు భర్తీ అవ్వడం కూడా కష్టమేనని యాజమాన్యాలు అంటున్నాయి. టాప్ టెన్ కాలేజీల్లో సీఎస్‌ఈ, ఎమర్జింగ్ కోర్సుల్లో ఒక్కో సీటుకు రూ.12 నుంచి రూ.19 లక్షల వరకు వసూలు చేశారని సమాచారం. ఇతర బ్రాంచీల్లో రూ.5 లక్షలకు సీటు ఇస్తామన్నా కాస్త మంచి ర్యాంకు ఉన్న విద్యార్థులు ముందుకు రావడం లేదు. సివిల్, మెకానికల్ కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద ఉండే వార్షిక ఫీజుతోనే కొన్ని కాలేజీలు విద్యార్థులను చేర్చుకున్నాయి.
సాధారణ కాలేజీల్లో సీఎస్‌ఈ సీటుకు రూ.3 లక్షలకు మించి డిమాండ్ రావడం లేదు. జిల్లాలు, గ్రామీణ ప్రాంత కాలేజీల్లో కన్వీనర్ కోటా ఫీజుకే సీఎస్‌ఈ సీటు ఇస్తామన్నా విద్యార్థులు ముందుకు రావడం లేదు. దీంతో విద్యార్థులను ఆకర్శించేందుకు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు పీఆర్‌ఓలు, కన్సల్టెన్సీలు, ఏజెన్సీలను రంగంలోకి దించాయి. వీటికి ఒక్కో విద్యార్థి ఫీజులో సాధారణ కాలేజీలు 30 శాతం కమీషన్ ఇస్తుంటే, మరికొన్ని 40 శాతం వరకూ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయి.