రైల్వేలో ఎలక్ట్రిక్‌ విప్లవం  | Electric Revolution in Railways | Sakshi
Sakshi News home page

రైల్వేలో ఎలక్ట్రిక్‌ విప్లవం 

Published Sat, Nov 11 2023 3:48 AM | Last Updated on Sat, Nov 11 2023 3:48 AM

Electric Revolution in Railways - Sakshi

సంప్రదాయ డీజిల్‌ ఇంజిన్లను రైల్వే శాఖ వేగంగా వదిలించుకుంటోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌లను పెద్ద సంఖ్యలో సమకూర్చుకుంటోంది. భారతీయ రైల్వేలో కీలక జోన్లలో ఒకటిగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే, ఏకంగా వేయి కరెంటు ఇంజిన్లను వినియోగంలోకి తెచ్చి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆధునిక ఇన్సులేటెడ్‌ గేట్‌ బైపోలార్‌ ట్రాన్సిస్టర్స్‌ (ఐజీబీటీ) ప్రొపల్షన్‌ సిస్టంతో ఉన్న 1,000వ ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌ను శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే పట్టాలెక్కించింది.

దూరప్రాంతాలకు నడిచే దాదాపు అన్ని కీలక రైళ్లను ఇప్పుడు ఎలక్ట్రిక్‌ ఇంజిన్లతోనే నడిపించేందుకు ఏర్పాట్లు చేసింది. శుక్రవారం అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌కు సహస్రాశ్వ అన్న పేరు పెట్టారు. దీన్ని లాలాగూడ ఎలక్ట్రిక్‌ లోకోషెడ్  తనిఖీలో భాగంగా జోన్‌ జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ ప్రారంభించారు.  

సాక్షి, హైదరాబాద్‌: రైలు మార్గాలను విద్యుదీకరించటం ద్వారా ఆధునికతకు శ్రీకారం చుట్టిన రైల్వే ఇప్పుడు డీజిల్‌ ఇంజిన్లను శాశ్వతంగా నిలిపివేయాలని నిర్ణయించింది. వాటిని కేవలం రైలు యార్డులు, ఇతర చోట్ల కోచ్‌లను పార్క్‌ చేయటానికి తరలించడం లాంటి పనులకే వినియోగించబోతోంది. ప్రయాణికుల రైళ్లతో పాటు సరుకు రవాణా రైళ్లను సైతం కరెంటు ఇంజిన్లతోనే నడపటం ద్వారా వాతావరణ కాలుష్యానికి కళ్లెం వేస్తోంది. డీజిల్‌ వినియోగాన్ని తగ్గించటం ద్వారా చమురు ఖర్చుకు బ్రేక్‌ వేస్తోంది. డీజిల్‌ ఇంజిన్లతో పోలిస్తే కరెంటు ఇంజిన్ల వినియోగం వల్ల ఖర్చు భారీగా తగ్గుతుంది. 

ప్రయాణికుల రైలును ఒక డీజిల్‌ లోకోమోటివ్‌తో నడిపితే సగటున ఏడాదికి 45 లక్షల లీటర్ల డీజిల్‌ ఖర్చవుతుంది. అదే గూడ్సు రైలు అయితే 15 లక్షల లీటర్లు ఖర్చు అవుతుంది. ఒక్కో ఇంజిన్‌ ద్వారా అంతమేర ఇంధనం ఆదా అవుతుంది.  
 ఒక ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ ప్రయాణికుల రైలును లాగేందుకు ప్రతి కి.మీ.కు ఆరు యూనిట్ల కరెంటును ఖర్చు చేస్తుంది. డీజిల్‌తో పోలిస్తే ఇది పెద్ద ఆదా అన్నమాటే.  
   ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌లను కూడా ఆధునికీకరించారు. సంప్రదాయ కరెంటు ఇంజిన్‌ బదులు తాజాగా ఇన్సులేటెడ్‌ గేట్‌ బైపోలార్‌ ట్రాన్సిస్టర్స్‌ 
(ఐజీబీటీ)ప్రొపల్షన్‌ సిస్టం ఉన్న ఇంజిన్లు వాడుతున్నారు. బ్రేక్‌ వేసినప్పుడల్లా ప్రత్యేక మెకానిజం వల్ల కొంత చొప్పున కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఈ రూపంలో 12.4 శాతం కరెంటు ఆదా అవుతుంది. దాన్ని తిరిగి గ్రిడ్‌కు పంపి.. పునర్వినియోగానికి వీలు కల్పిస్తారు. అంటే.. ఒక ఇంజిన్‌ సగటున సాలీనా 
976 టన్నుల బొగ్గును ఆదా చేస్తుందన్నమాట.  
 డీజిల్‌ వినియోగాన్ని నిరోధించటం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. ప్రతి లోకోమోటివ్‌ సంవత్సరానికి 2.362 కిలో టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గిస్తుంది.  
♦ ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న వేయి కరెంటు లోకోమోటివ్‌లలో 600 ఇన్సులేటెడ్‌ గేట్‌ బైపోలార్‌ ట్రాన్సిస్టర్స్‌ (ఐజీబీటీ)ప్రొపల్షన్‌ సిస్టం ఉన్న ఇంజిన్లే. మిగతావి సంప్రదాయ ఇంజిన్లు.  
 ♦సంప్రదాయ ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌ 5000 హెచ్‌.పీ. సామ ర్థ్యం కాగా, ఆధునిక ఇంజిన్ల సామర్థ్యం 6000 హెచ్‌.పీ. 

త్వరలో అన్ని మార్గాల విద్యుదీకరణ 
దక్షిణ మధ్య రైల్వేలో కొత్త లైన్లు మినహా మిగతా ప్రధాన మార్గాలన్నీ విద్యుదీకరించారు. 6650 రూట్‌ కి.మీ.మార్గాన్ని విద్యుదీకరించగా, కేవలం 691 కి.మీ. మాత్రమే మిగిలి ఉంది. తెలంగాణకు సంబంధించి అక్కన్నపేట– మెదక్, మనోహరాబాద్‌–కొత్తపల్లి (సిద్దిపేట వరకు పూర్తి) మార్గాలు మాత్రమే విద్యుదీకరించాల్సి ఉంది.  

695 రైళ్లు కరెంటువే.. 
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో లైన్ల విద్యుదీకరణ వేగంగా పూర్తి అవుతుండటం, కరెంటు ఇంజిన్లు అందుబాటులోకి వస్తుండటంతో రైళ్లకు ఎలక్ట్రిక్‌ ఇంజిన్లనే ఎక్కువగా వాడుతున్నారు. జోన్‌పరిధిలో ప్రస్తుతం 874 రైళ్లను కరెంటు ఇంజిన్లతోనే నడుపుతున్నారు. మరో 695 రైళ్లకు ఇంకా డీజిల్‌ ఇంజిన్లు వాడుతున్నారు. వీటిల్లో విద్యుదీకరించని మార్గాల్లో నడుస్తున్న రైళ్లు ఉన్నాయి. కొత్తగా కరెంటు ఇంజిన్లు అందుబాటులోకి వచ్చే కొద్దీ డీజిల్‌ ఇంజిన్ల వినియోగం తగ్గనుంది. మిగతా కొత్త మార్గాలను కూడా విద్యుదీకరిస్తే ఇక డీజిల్‌ ఇంజిన్ల వినియోగం నామమాత్రమే అవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement