జ్ఞాపకాల హ్యాపీ ఎండింగ్‌ | Elderly people tend to share their favorite things before they die | Sakshi
Sakshi News home page

జ్ఞాపకాల హ్యాపీ ఎండింగ్‌

Jul 5 2026 4:40 AM | Updated on Jul 5 2026 4:40 AM

Elderly people tend to share their favorite things before they die

కన్నుమూసేలోగా ఇష్టమైన వాటిని పంచిపెట్టాలనే ధోరణిలో వృద్ధులు 

స్వీడన్‌ నుంచి హైదరాబాద్‌కు చేరిన డోస్టాడ్నింగ్‌ అనే కొత్త సంస్కృతి 

65 ఏళ్లు పైబడిన వారిలో ఈ ఏడాది ఈ ప్రక్రియ మొదలు పెట్టిన 41% మంది పెద్దలు

సాక్షి, హైదరాబాద్‌: ‘పుట్టినప్పుడు ఏమీ తీసుకురాము.. పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్లం.. మరి జీవితంలో సంపాదించినంత కాలం వరకు కొనుక్కున్న ఇష్టమైన వస్తువులు, దుస్తులు, దాచుకున్న బహుమతుల వంటి వాటిని మాత్రం ఎందుకు తర్వాతి తరం వారికి భారంగా మిగల్చాలి? వారు మనతో పంచుకున్న మధుర క్షణాలను జ్ఞాపకంగా మనసులో దాచుకుంటే సరిపోతుందిగా’.. ఇదీ ఇటీవల కాలంలో కొందరు వృద్ధుల ఆలోచనా ధోరణిగా కనిపిస్తోంది. ఇది వారి జీవితంలో ప్రేమను పంచే కొత్త పద్ధతిగా అవతరిస్తోంది. యూరోపియన్‌ దేశమైన స్వీడన్‌లో కొన్నేళ్ల కిందట డోస్టాడ్నింగ్‌ పేరిట మొదలైన ఈ ప్రక్రియ క్రమంగా ప్రపంచమంతా విస్తరిస్తూ భాగ్యనగరం దాకా విస్తరించింది. ప్రస్తుతం నగరం లోని ఖరీదైన ప్రాంతాల నుంచి సామాన్యులు నివసించే ప్రాంతాల వరకు ఈ సంస్కృతి చేరింది. 

ఇదీ ఉద్దేశం 
వయోభారంతో కన్నుమూసేలోగా అక్కర్లేనివి దానం చేయడం, జ్ఞాపకంగా అట్టిపెట్టుకున్న వస్తువులను వారసులకు అప్పగించడం, ఆస్తి పత్రాలు, బ్యాంకు పుస్తకాల వంటి ఆర్థిక వివరాలను ఒక చోట పెట్టడం దీని ముఖ్య ఉద్దేశం. అయితే ఇదేమీ చావు కోసం అన్నీ సర్దుకోవడం కాదు. బతుకును భారంగా లేకుండా చేసుకోవడం. ఇలా చేయడం వల్ల బంధాలు బలపడతాయని, జ్ఞాపకాలు మరింత పదిలపరుచుకోవచ్చని వృద్ధులు భావిస్తున్నారు. దీన్నే కొన్ని దేశాల్లో స్వీడిష్‌ డెత్‌ క్లీనింగ్‌ అని కూడా పిలుస్తున్నారు. 

నగరంలో పెరుగుతున్న ట్రెండ్‌ 
హైదరాబాద్‌ సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం–2026 సర్వే ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారిలో 41% మంది ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. అయితే 2023లో ఇది 9 శాతంగా మాత్రమే ఉండటం గమనార్హం. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, మియాపూర్‌లలో నివసిస్తున్న వృద్ధుల్లో ఈ స్పృహ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ప్రక్రియను ఎలా ఆచరించాలో తెలియజేసేందుకు నగరంలో నెలకు 2, 3 వర్క్‌షాప్‌లు కూడా జరుగుతున్నాయి. ఒక్కో సెషన్‌కు నిర్వాహకులు రూ. 1,500 వరకు వసూలు చేస్తున్నారు. ముంబైలోనైతే రూ. 5 వేల దాకా తీసుకుంటున్నారు. ఢిల్లీలోని గ్రేటర్‌ కైలాష్, వసంత్‌ కుంజ్‌లో సీనియర్లు డోస్టాడ్నింగ్‌ ప్రక్రియ గురించి తెలుసుకోవడానికి గ్రూపులుగా కలుస్తున్నారు. స్వీడన్‌లో 80% మంది సీనియర్‌ సిటిజన్స్‌ ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు. జపాన్‌లో షుకాట్సు పేరుతో ఇదో జీవన విధానంగా మారింది. ఇది జీవితంపై వృద్ధుల్లో నెలకొన్న నిరాశ కాదని.. బాధ్యతతో కూడిన ప్రేమ అని సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు. 

లైబ్రరీకి పుస్తకాలు ఇచ్చేశా.. 
నాకిప్పుడు 68 ఏళ్లు. నా ఒక్కగానొక్క కొడుకు షికాగోలో నివసిస్తున్నాడు. 40 ఏళ్ల కెరీర్‌లో నేను దాచుకున్న వస్తువులు, 500 పుస్తకాలు వాడికి అర్థం కావు. అవి బరువు తప్ప కన్నీళ్లు మిగల్చవు. అందుకే వాటన్నింటినీ పంచిపెట్టా. ఒక లైబ్రరీకి పుస్తకాలు ఇచ్చేశా. ఇప్పుడు ఇల్లు ఖాళీగా ఉన్నా మనసు నిండుగా ఉంది. 
– రాఘవరావు, రిటైర్డ్‌ బ్యాంకు మేనేజర్, మియాపూర్‌ 

కూతుళ్లకు గాజులు పంచిపెట్టా.. 
నాకు ముగ్గురు కూతుళ్లు. నేను పోయాక నా బంగారు గాజులు, పట్టుచీరల కోసం వాళ్లు గొడవపడదనుకున్నా. అందుకే అందరినీ పిలిచి వాటిని పంచేశా. కూతుళ్లకు ఒక్కో గాజు తొడుగుతూ నా పెళ్లికి తొడుక్కున్నవి, నా భర్త తొలి బోనస్‌తో కొనిచ్చినవి అంటూ వాటి వెనకున్న కథ చెప్పా. దీంతో ఆ రోజు ఇల్లంతా జ్ఞాపకాలతో నిండిపోయింది. 
– సుశీలమ్మ (70), సికింద్రాబాద్‌   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement