హైదరాబాద్: బాలికల అక్రమ రవాణా, వ్యభిచారంలోకి నెట్టడం, లైంగిక దోపిడీకి పాల్పడిన కేసులో 33 మంది నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ హైదరాబాద్ హకా భవన్‌లోని పోక్సో ప్రత్యేక సెషన్స్ కోర్టు (ఎఫ్‌టీఎస్‌సీ) బుధవారం తీర్పు వెలువరించింది. వీరిలో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. మరో 28 మందికి వివిధ కాలపరిమితులతో కఠిన కారాగార శిక్షలు విధించింది.
సీఐడీ హైదరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో 2015లో నమోదైన క్రైం నంబర్ 14/2015కు సంబంధించిన కేసులో విచారణ పూర్తయింది. మహిళల భద్రత విభాగం ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగిన ఈ కేసులో పోక్సో చట్టం, ఐపీసీ, ఇమ్మోరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) యాక్ట్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి.
ఉద్యోగం పేరుతో మోసం..
2015 జులై 17న బాధితురాలు సీఐడీని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న ఆమెకు పరిచయస్తుడైన వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. అనంతరం ఆమెను ఏ1 నుంచి ఏ3 నిందితులకు పరిచయం చేసి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అక్కడ ఆమెను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టడంతోపాటు పలువురితో లైంగికంగా సంబంధాలు పెట్టుకునేలా ఒత్తిడి చేసినట్లు తెలిపింది. సుమారు నాలుగు నెలల పాటు నిందితుల నియంత్రణలో ఉన్న బాధితురాలు వారి నుంచి తప్పించుకుని సీఐడీ కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించారు.
9 మంది బాలికలకు విముక్తి
దాడుల సందర్భంగా ఏ1 నుంచి ఏ45 వరకు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిది మంది మైనర్ బాలికలతో పాటు పలువురు బాధితులను రక్షించారు. నేరానికి సంబంధించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శాస్త్రీయ, సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. ప్రత్యేక సెషన్స్ జడ్జి ఉదయ్ భాస్కర్‌రావు విచారణ అనంతరం 33 మంది నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ శిక్షలు విధించారు. ఐదుగురికి జీవిత ఖైదు, ముగ్గురికి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 14 మందికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 11 మందికి మూడేళ్ల కఠిన కారాగార శిక్షను విధించారు.
బాధితులకు రూ.45 లక్షల పరిహారం
నిందితుల దారుణ చర్యల కారణంగా శారీరక, మానసిక వేదనకు గురైన తొమ్మిది మంది బాధిత బాలికలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.45 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. చట్ట ప్రకారం ఇప్పటికే అందిన పరిహారానికి అదనంగా ఈ మొత్తాన్ని చెల్లించాలని పేర్కొంది. పరిహారం చెల్లింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శిని ఆదేశించింది. నిందితులపై విధించిన జరిమానా మొత్తాన్ని కూడా బాధితులకు పరిహారంగా అందించాలని కోర్టు సూచించింది.


