స్కూళ్లల్లో దోపిడీ షురూ..! జోరుగా ముందస్తు అడ్మిషన్లు | Sakshi
Sakshi News home page

స్కూళ్లల్లో ముందస్తు అడ్మిషన్లు.. డోనేషన్ల పేరుతో దోపిడీ షురూ..!

Published Fri, Dec 16 2022 8:02 AM

Early Admissions Start In Private Schools Huge Donations Collected - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: అప్పుడే ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లలో 2023–24 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు జోరందుకున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగియక ముందే  స్కూళ్ల యాజమాన్యాలు వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు మొదలు పెట్టాయి. ముందస్తు› ప్రవేశాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల  నిలువు దోపిడీ ప్రారంభమైంది. టెక్నో, ఈ టెక్నో, ఈ స్మార్ట్‌ అంటూ రకరకాల పేర్లతో అడ్మిషన్ల  దందాకు దిగాయి.కొన్ని పాఠశాలలు  ముందస్తు సీట్‌ బుక్‌ చేసుకుంటే ఫీజులో రా యితీ అని  తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారు. నిబంధనల ప్రకారం  విద్యా సంవత్సరం ముగిశాక వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతున్నా విద్యాశాఖాధికారులు నిద్రమత్తులో జోగుతుండడం విమర్శలకు తావిస్తోంది. 

సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూళ్లలో తీవ్ర పోటీ 
సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూళ్లల్లో ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొంది. ఎల్‌కేజీ, యూకేజీ సీట్లకు అధిక డిమాండ్‌ ఉండగా, అతర్వాత తరగతుల్లో సీట్ల ఖాళీలును బట్టి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఫీజులు, అడ్మిషన్‌ ఫీజు విషయం పక్కకు పెడితే ..అసలు సీటు దక్కడం అనే ప్రశ్నార్ధకంగా తయారైంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా ఆయా స్కూల్‌లో పూర్తయినట్లు తెలుస్తోంది. ఒక్కో దరఖాస్తుకు  రూ. 1000 నుంచి 2 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.  ఆయా స్కూల్స్‌లో సీట్లకు రెండింతలు దరఖాస్తులు రావడంతో ప్రతి సీట్‌కు తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. 

ఇష్టారాజ్యమే...  
కార్పొరేటు, ప్రైవేటు స్కూల్స్‌లో అడ్మిషన్ల ప్రక్రియ ఇష్టారాజ్యంగా తయారైంది. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వారి ఆగడాలకు అడ్డూ..అదుపూ లేకుండా పోతోంది. నర్సరీ నుంచి పదవ తరగతి వరకూ ముందస్తు అడ్మిషన్లకు తెరలేపి.. అందిన కాడికి దండుకుంటున్నాయి. కేవలం నర్సరీకే రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకూ ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నారు. స్కూల్‌ యూనిఫాం, పుస్తకాలు ముడిపెట్టి  ముందుగానే అడ్మిషన్‌  ఫీజు చేలిస్తేనే సీటు గ్యారంటì  హామీ ఇవ్వడం పరిపాటిగా తయారైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ విద్యా సంస్థ కూడా డొనేషన్లు వసూలు చేయకూడదు. 

కనిపించని నోటీసు బోర్డు  
తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రైవేటు స్కూల్స్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. దీని ఆసరాగా తీసుకున్న కార్పొరేట్, ప్రై వేటు స్కూల్స్‌ యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లొదిలేశాయి. నిబంధనల ప్రకారం పాఠశాలల్లో తాము వసూలు చేసే ఫీజు వివరాలను తరగతుల వారీగా నోటీసు బోర్డులో ఉం చాలి. కానీ, ఈ నిబంధన ఏ ఒక్క పాఠశాలలో కూడా అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. 

ప్రైవేటు టీచర్లకు టార్గెట్‌ 
కార్పొరేట్,  ప్రై వేటు స్కూళ్లలో అడ్మిషన్లకు  యజమాన్యాలు ఆయా సూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు సైతం టార్గెట్‌ పెడుతున్నాయి. ఒక్కొక్కరికి 10 నుంచి 15 అడ్మిషన్లు చేయించాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. టార్గెట్‌ పూర్తి చేయకుంటే వచ్చే విద్యాసంవత్సరంలో ఉద్యోగానికి ఎసరు తప్పని పరిస్థితి నెలకొంది.

ఇదీ చదవండి: Andhra Pradesh: బోధనలో నవశకం 

Advertisement
Advertisement