
సాక్షి, సిరిసిల్ల : ఆరేళ్ల బాలుడు కుక్క తోకను తొక్కగా అది కరిచేందుకు వచ్చిందని తిట్టిన విషయం సిరిసిల్లలో వివాదానికి కారణమైంది. కుక్కను పెంచుకుంటున్న వారు, పిల్లవాడి తల్లిదండ్రులు పరస్పరం గొడవకు దిగారు. ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సిరిసిల్ల టౌన్ సీఐ వెంకటనర్సయ్య తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణం రాజీవ్‌నగర్‌కు చెందిన బీసు శ్రీనివాస్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి సాయికీర్తన్(6) కుమారుడున్నా డు. ఈ బాలుడు రోజూ మాదిరిగానే ఆదివారం రాత్రి చుట్టుపక్కల ఆడుకొని, తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న శ్రీహరి ఇంటి వద్దకు వచ్చాడు.
అక్కడ శ్రీహరి వాళ్లు పెంచుకుంటున్న కుక్క రోడ్డుపై ఉండటంతో సాయికీర్తన్ దాని తోక తొక్కాడు. దీంతో అది అరుస్తూ కరిచేందుకు రావడంతో బాలుడి కుటుంబీకులు దాన్ని వెళ్లగొట్టే ప్రయత్నంలో పలు మాటలు అన్నారు. అవి కుక్కను కాదు తమనే అన్నారని దాన్ని పెంచుకుంటున్న వాళ్లు తమపై దాడి చేశారని శ్రీనివాస్ తెలిపాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీహరి, మరొకరిపై, ఇంటి ఎదుట బీడీలు చేసుకుంటున్న తమపై అకారణంగా దాడి చేశారని శ్రీహరి, అతని భార్య ఇచ్చిన ఫిర్యాదుతో శ్రీనివాస్‌తోపాటు మరొకరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.