రాయచోటి టౌన్: అన్నమయ్య జిల్లా రాయచోటిలో మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది. రాయచోటిలోని కొత్తపేటలో నివాసం ఉండే ఫజల్ (42) ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో గాలివీడు రోడ్డులో ద్విచక్రవాహనంపై తన ఇంటికి వెళుతుండగా కుక్కలు వెంటపడ్డాయి. వాటి నుంచి తప్పించుకోవాలని బైకును వేగంగా నడిపాడు.
అయినా కుక్కలు విడిచిపెట్టలేదు. దీంతో వేగాన్ని అదుపుచేసుకోలేక ఎదురుగా ఉన్న గుడి గోడను ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, రాయచోటిలో రోడ్లపై ఎక్కడికక్కడ కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే చలనం లేదని వాపోతున్నారు.


