ఇమ్యూనిటీ ఏమో గాని.. ఇబ్బందులే సుమా! 

Doctors Said Beware Of Covid Prevention Boosters in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంట్లో తయారు చేసుకున్న కషాయాలతో ఇమ్యూనిటీ పెరగడం సంగతేమో గాని ఇతర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్‌ బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా అనేక మంది వివిధ రకాల ఇమ్యూనిటీ బూస్టర్లను వాడుతున్నారు. కొంతమంది మార్కెట్లో రెడీమేడ్‌గా తయారు చేసిన పౌడర్లు వాడుతుండగా.. మరికొందరు ఇంట్లోని వంటగదిలో లభించే లవంగాలు, మిరియాలు, దాల్చిని, శొంఠి, తిప్పతీగతో కషాయాలు చేçసుకుంటున్నారు. వేడినీటిని కూడా ఎక్కువగా  తాగేస్తున్నారు. నిజానికి ఈ కషాయాలు, వేడినీళ్లు ఆరోగ్యానికి మంచివే. ఓ పరిమితి వరకు ఎలాంటి నష్టాలు ఉండవు. కానీ.. వైరస్‌ నుంచి త్వరగా కోలుకోవాలనే ఆలోచనతో కొంత మంది మోతాదుకు మించి వీటిని వాడుతున్నారు. వైరస్‌ నుంచి బయటపడటమేమో గాని.. తీవ్రమైన గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, ఛాతిలో మంట వంటి జీర్ణకోశ సంబంధ సమస్యల బారిన పడుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. గతంతో పోలిస్తే ఈ తరహా సమస్యలు రెట్టింపు స్థాయిలో నమోదవుతున్నట్లు ఉస్మానియా ఆస్పత్రికి చెందిన ప్రముఖ సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ మధుసూదన్‌ అభిప్రాయపడ్డారు.  

వైద్యులను సంప్రదించకుండానే..  
దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఇరుగుపొరుగుకు తెలిస్తే వారితో ఇబ్బందులు తలెత్తుతాయని భావించి చాలా మంది వైద్యులను సంప్రదించకుండానే మందులు వాడేస్తున్నారు. నిజానికి కోవిడ్‌ లక్షణాలు టైఫాయిడ్, మలేరియా, డెంగీ, స్వైన్‌ఫ్లూ జ్వరాల్లోనూ ఉంటున్నాయి. ప్రస్తుతం కోవిడ్‌ టెస్టులు మినహా ఇతర జ్వరాలకు సంబంధించిన టెస్టులు పెద్దగా చేయడం లేదు. ఏది ఏ జ్వరమో? నిర్ధారణ వైద్యులకే కష్టమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో టెస్టులు చేయించకుండా కనీసం వైద్యులను కూడా సంప్రదించకుండా ఆన్‌లైన్, యూట్యూబ్, సోషల్‌ మీడియాలో వచ్చిన మెసేజ్‌లు చూసి నేరుగా మెడికల్‌ షాపులకు వెళ్లి మందులు కొనుగోలు చేసి వయసు, బరువు, బీపీ, షుగర్‌ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా నేరుగా వాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సిన మందులను నేరుగా వాడుతుండటంతో పల్స్‌ రేట్‌లో హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. శ్వాస నాళాలపై వైరస్‌ లోడు పెరిగి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి అప్పటికప్పుడు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించి పలువురు మృతి చెందుతున్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఇప్పటికీ స్పష్టత లేదు.. 
కరోనా పేషెంట్లు ఏ మందులు వాడాలో మొదట్లో వైద్యులకే అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడే ఒక అవగాహనకు వస్తున్నారు. మొదట్లో హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్, విటమిన్‌ సి, పారాసిటమాల్‌ వంటివి బాగా పని చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో చాలా మంది వైరస్‌ రాకముందే వీటిని విరివిగా వాడేశారు. ఆ తర్వాత డెక్సామిథసోన్, ఫావిపిరవిర్, ప్లాబీఫ్లూ వంటి మందులు బాగా పని చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో వీటిని కూడా చాలా మంది వాడుతున్నా రు. విటమిన్‌ టాబ్లెట్స్‌తో పెద్దగా ప్రమాదం లేకపోయినప్పటికీ.. డెక్సామిథసోన్‌ వంటి కార్డికో స్టెరాయిడ్‌ వాడితే హృద్రోగ సమస్యలు తలెత్తే ప్రమాదం లేకపోలేదని నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌(నిమ్స్‌) కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ ఆర్వీ కుమార్‌ అభిప్రాయపడ్డారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top