కేటీఆర్‌పై ఆ విమర్శలు చేయొద్దు.. రేవంత్‌కు సిటీ సివిల్‌ కోర్టు ఆదేశం 

Do Not Criticize KTR In Connection With Drugs Case: City Civil Court - Sakshi

ఆ వ్యాఖ్యలు వద్దు

డ్రగ్స్‌ కేసుతో ముడిపెట్టి కేటీఆర్‌పై విమర్శలు చేయొద్దు 

రేవంత్‌రెడ్డికి సిటీ సివిల్‌ కోర్టు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారక రామారావుకు సిటీ సివిల్‌ కోర్టులో ఊరట లభించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న డ్రగ్స్‌ కేసుతో ముడిపెట్టి, కేటీఆర్‌కు వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు, విమర్శలు చేయరాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కోర్టు ఆదేశించింది. పత్రికలు, టీవీ, సామాజిక మాధ్యమాల్లో సైతం ప్రస్తావించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు మూడో అదనపు చీఫ్‌ జడ్జి కళ్యాణ చక్రవర్తి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు (యాడ్‌ ఇంటరిమ్‌ ఇంజక్షన్‌) జారీ చేశారు. డ్రగ్స్‌ కేసుతో ముడిపెట్టి తనకు వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా రేవంత్‌ను ఆదేశించాలని కోరుతూ కేటీఆర్‌ దాఖలు చేసిన పరువు నష్టం దావాను న్యాయమూర్తి విచారించారు.  

అడ్డగోలుగా ఆరోపణలు..: మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి ఎటువంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని ఆయన తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. డ్రగ్స్‌ కేసుతో ఎటువంటి సంబంధం లేకపోయినా నిరాధారమైన ఆరోపణలతో ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనివల్ల కేటీఆర్‌ పరువు, ప్రతిష్టలకు తీవ్రస్థాయిలో భంగం కలుగుతోందని తెలిపారు. మంత్రిగా ఉత్తమ పనితీరుతో రాష్ట్రంలో, దేశ, విదేశాల్లోనూ కేటీఆర్‌ పేరు సంపాదించుకున్నారని, అనేక అవార్డులు పొందారని వివరించారు. దీంతె స్పందించిన న్యాయమూర్తి... పై ఆదేశాలు జారీ చేశారు. ప్రతివాది రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను అక్టోబర్‌ 20వ తేదీకి వాయిదా వేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top