ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో పెద్ద సవాల్ గా మారుతున్న రోగ నిర్దారణ
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంఇస్నాపూర్‌కు చెందిన డి.పాపారావు తీవ్రమైన నడుం నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఆర్సీపురంలోని ఈఎస్‌ఐ ప్రాంతీయ ఆస్పత్రిలో వైద్యులను సంప్రదించాడు. అక్కడ మందులు ఇచ్చినప్పటికీ నొప్పి తగ్గలేదు. దీంతో అక్కడి వైద్యుడు ఎంఆర్‌ఐ స్కానింగ్ కోసం సనత్‌నగర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. రెండు నెలల పాటు వెయిట్ చేసి గత నెల 20వ తేదీన ఎంఆర్‌ఐ స్కానింగ్ తీయించాడు. 15 రోజులు దాటిపోయినా రిపోర్టు మాత్రం ఇంకా ఇవ్వలేదు. ఇంకా పది రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతుండడంతో పాపారావు బాధ చెప్పనక్కర్లేదు. - చిలుకూరి అయ్యప్ప
ఈఎస్‌ఐ చందాదారులు, కుటుంబ సభ్యులకు అత్యాధునిక రోగ నిర్ధారణ పరీక్షలు అతి పెద్ద సవాలుగా మారాయి. అంతర్గత సమస్యలను సూక్ష్మస్థాయిలో గుర్తించే సీటీ (కంప్యూటెడ్ టోమోగ్రఫీ) స్కాన్, ఎంఆర్‌ఐ (మాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్) స్కానింగ్ చేయించాలంటే నెలల తరబడి నిరీక్షించాల్సివస్తోంది. సాధారణంగా రోగ నిర్ధారణ ప్రక్రియ వేగవంతంగా జరగాలి. ఎంత త్వరగా రోగ నిర్ధారణ జరిగితే వైద్యులు అంత త్వరగా చికిత్స మొదలుపెట్టేందుకు అవకాశం ఉంటుంది. కానీ రోగ నిర్ధారణలో తీవ్రమైన జాప్యం ఒక్కోసారి ప్రాణం కోల్పోయేందుకూ కారణం కావొచ్చు. అయినప్పటికీ ఈఎస్‌ఐ చందాదారులు నిస్సహాయ పరిస్థితిలో ఉండిపోతున్నారు. అత్యాధునిక వసతులతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులో ఉన్నా..అవసరమైన సేవలు మాత్రం అందడం లేదని రోగులు విమర్శిస్తున్నారు.
రోగ నిర్ధారణ కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు. ఎలాగోలా స్కానింగ్ లాంటిది పూర్తయినా రిపోర్టులు వచ్చేందుకు మరో రెండు, మూడు వారాలు ఎదురు చూడాల్సి వస్తోందని, ఈలోగా వ్యాధి ముదిరిపోతే అంతే సంగతి అని వాపోతున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉన్న స్కానింగ్ యంత్రాలు కొన్నేళ్లుగా పని చేయకపోవడమే ఇందుకు కారణమని, మెడికల్ కాలేజీ యంత్రాలపైనే అంతా ఆధారపడి ఉండటంతో రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని తెలుస్తోంది. కీలకమైన స్కానింగ్ యంత్రాల విషయంలో ఈఎస్‌ఐసీ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నెలనెలా వేతనంలో 0.75 శాతం చందా
రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 21 లక్షల మంది ఈఎస్‌ఐ చందాదారులున్నారు. నిజానికి వీరి సంఖ్య 25 లక్షలని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. మొత్తం చందాదారులు, వారి కుటుంబసభ్యుల్ని కలిపితే దాదాపు 90 లక్షల మంది లబ్ధిదారులుంటారు. ఒక్కో చందాదారు నెలకు తన వేతనం నుంచి 0.75 శాతం చందా ఇస్తుండగా, యాజమాన్యం 3.25 శాతం చొప్పున చెల్లిస్తోంది. చందా రూపంలో రూ.వెయ్యి కోట్ల వరకు జమ అవుతున్నట్లు సమాచారం. ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈఎస్‌ఐ కార్పొరేషన్‌కు జమ అవుతుంది.
ఏటా సగటున రూ.650 కోట్ల మేర ఈఎస్‌ఐసీ నుంచి రాష్ట్ర డీఐఎంఎస్ (డైరెక్టర్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్) విభాగానికి నిధులు అందుతాయి. దీంతో పాటు ఆస్పత్రుల నిర్వహణ కూడా కార్పొరేషన్ పర్యవేక్షిస్తోంది. రాష్ట్రంలో నాలుగు ఈఎస్‌ఐ ప్రాంతీయ ఆస్పత్రులున్నాయి. హైదరాబాద్‌లోని నాచారం, రామచంద్రాపురం, వరంగల్, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ఇవి నడుస్తున్నాయి. ఇవి కాకుండా సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐసీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా ఉంది. వీటి పరిధిలో 71 డిస్పెన్సరీలు ఉన్నాయి.
మెడికల్ కాలేజీ యంత్రాలే దిక్కు
రోగి తొలుత డిస్పెన్సరీకి వెళ్లితే పరిస్థితిని బట్టి అక్కడి వైద్యులు ప్రాంతీయ ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. అక్కడ కూడా సమస్య పరిష్కారం కాకుంటే అత్యాధునిక వసతులు, స్కానింగ్ సౌకర్యం ఉన్న సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐసీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి పంపిస్తారు. ఈ ఆస్పత్రి అత్యంత కీలకమైంది. రాష్ట్రంలోని డిస్పెన్సరీలు, ప్రాంతీయ ఆస్పత్రుల్లో లేని సేవలు ఇక్కడ అందిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈఎస్‌ఐకి సంబంధించి కేవలం సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐసీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో, అదే ప్రాంగణంలోని ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీలో మాత్రమే సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్ యంత్రాలున్నాయి.
అయితే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని సీటీ స్కానింగ్ మెషీన్, ఇతర మెషీన్లకు రెండేళ్ల క్రితమే కాలం చెల్లింది. అయినా కొత్తవి ఏర్పాటు చేయలేదు. దీంతో మెడికల్ కాలేజీలోని యంత్రాలపైనే ఆధారపడుతున్నారు. రోగుల తాకిడి ఎక్కువగా ఉండడంతో టోకెన్ విధానంలో రోగులకు తేదీలు ఖరారు చేస్తున్నారు. దీంతో ఒక్కో రోగి స్కానింగ్ చేయించుకోవాలంటే కనిష్టంగా రెండు నెలలు వేచి చూడాల్సి వస్తోంది.
కొనుగోలు పేరిట కాలయాపన
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో మెషీన్లు చెడిపోవడంతో కొత్తవి కొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారని, ఇందుకు సంబంధించి అప్రూవల్స్ ప్రక్రియ తుది దశకు వచ్చినట్లు సమాచారం. అప్రూవల్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈఎస్‌ఐ కార్పొరేషన్ టెండర్ పిలిచి కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసి మెషీన్లు కొనుగోలు చేస్తుంది. ఇందుకు కనిష్టంగా ఆర్నెల్ల సమయం పడుతుందని అధికారులే చెబుతున్నారు.
అయితే ప్రత్యామ్నాయంగా ప్రైవేటు డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో స్కానింగ్ చేయించే వెసులుబాటు ఉంది. ఇందుకు ప్రత్యేకంగా ఒక డయాగ్నొస్టిక్ కేంద్రాన్ని కూడా ఎంపిక చేశారు. కానీ అధికారులు ప్రైవేటుకు పంపించకుండా కేవలం ప్రభుత్వ మెషీన్ల వాడకానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. నాచారం పరిధిలో సీటీస్కాన్, ఎంఆర్‌ఐ స్కానింగ్‌ను ప్రైవేటుకు ఇచ్చే ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ప్రభుత్వం అనుమతి వచ్చిన వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని నాచారం ప్రాంతీయ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ ‘సాక్షి’కి వివరించారు.
నిర్విరామంగా స్కానింగ్‌లు
తొమ్మిది నెలల వ్యవధిలో ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీలో 15,294 సీటీ, 5172 ఎంఆర్‌ఐ స్కానింగ్ చేశారు. ఇవి కాకుండా ఈఎస్‌ఐసీ సూపర్ స్పెషాలిటీకి సంబంధించి 9,616 సీటీ స్కాన్‌లు, 7,963 ఎంఆర్‌ఐ స్కాన్‌లు కూడా మెడికల్ కాలేజీ యంత్రాలపైనే తీశారు. మొత్తంగా 9 నెలల వ్యవధిలో 24,910 సీటీ స్కాన్‌లు, 13,135 ఎంఆర్‌ఐ స్కాన్‌లు తీసినట్లు అధికారులు చెబుతున్నారు. అంటే రోజుకు సగటున 92 సీటీ స్కాన్‌లు, 48 ఎంఆర్‌ఐ స్కానింగ్‌లు చేస్తున్నారన్న మాట. ఒక్కో సీటీ స్కానింగ్‌కు కనీసం 10 నుంచి 20 నిమిషాల సమయం తీసుకుంటుంది.
ఎంఆర్‌ఐ స్కానింగ్‌కు 20–30 నిమిషాల కనిష్ట సమయం పడుతుంది. దీంతో ఈ మెషీన్లురోజుకు 16 నుంచి 20 గంటలు నడుపుతున్నారు. మెషీన్ వాడకం నిరంతరాయంగా సాగుతుండడంతో దాని జీవితకాలం వేగంగా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా రిపోర్టుల జారీలో జాప్యం జరుగుతోందని సిబ్బంది చెబుతున్నారు. పరీక్షలు, రిపోర్టుల కోసం నిరీక్షణ భరించలేదక చాలామంది రోగులు ప్రైవేటు ఆస్పత్రుల వైపు పరుగులు పెడుతున్నారు. ఫీజులు భారమైనా విధిలేని పరిస్థితుల్లో చెల్లించి త్వరితగతిన స్కానింగ్‌లు పూర్తి చేసుకుంటున్నారు. ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ ప్రాణాలు కాపాడుకునేందుకే ప్రైవేటును ఆశ్రయిస్తున్నామని కార్మికులు చెబుతున్నారు.
సరైన వైద్యం అందకపోతే ఆస్పత్రులు ఎందుకు?
ఇన్సూరెన్స్ పథకం కింద వారు చెల్లిస్తున్న చందాకు తగినట్లుగా సరైన వైద్యం ఇవ్వకపోతే ఈ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు ఉండి లాభమేంటి? రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది లబ్ధిదారులకు వైద్య పరీక్షలు చేసేందుకు కేవలం ఒక సీటీ స్కాన్ మెషీన్, ఒక ఎంఆర్‌ఐ మాత్రమే అందుబాటులో ఉంచడం అత్యంత శోచనీయం. ఆదిలాబాద్ నుంచి అయినా, భద్రాచలం నుంచి అయినా రోగులు చికిత్స కోసం హైదరాబాద్ రావాల్సి ఉండడం నిజంగా దురదృష్టకరం. ఈ అంశంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కార్పొరేషన్ నుంచి కనీస స్పందన లేదు. సనత్‌నగర్ ఈఎస్‌ఐసీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో సీటీ స్కానింగ్ మెషీన్ 2023 లోనే కన్డెమ్ అయ్యింది. అయినా ఇప్పటివరకు కొత్త మెషీన్ కొనుగోలు చేయలేదు. – బి.అర్జున్, ఈఎస్‌ఐ బోర్డు మాజీ సభ్యుడు


