‘పరిష్కారాల’ తర్వాతే ధరణి | Sakshi
Sakshi News home page

‘పరిష్కారాల’ తర్వాతే ధరణి

Published Fri, Sep 25 2020 1:49 AM

Dharani Only After Land Issues Are Resolved KCR Says - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌ పూర్తిస్థాయిలో రూపుదిద్దుకునే లోపే ప్రజలకు సంబంధించిన భూములు, ఆస్తుల సమస్యలన్నింటినీ గుర్తించి, విధానపరమైన పరిష్కా రాలను రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. హైదరాబాద్‌ నగరం, రాష్ట్రంలోని మిగతా అన్ని పట్టణాలు, పల్లెల్లో నివాస స్థలాల సమస్యల్లేకుండా చేయాలని, దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న నిర్మాణాలు, ఇళ్లు, ఆస్తుల వివాదాలను శాశ్వతంగా పరిష్కరించాలని సీఎం నిర్ణయించారు. ‘గుణాత్మక మార్పు, ప్రజల జీవితాల్లో పరివర్తన కోసం చట్టాలలో మార్పులు తెచ్చినప్పుడు గరీబులకే అత్యధిక ప్రాధా న్యతనివ్వాలి.

ధరణి వెబ్‌ పోర్టల్‌ను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ఈ లక్ష్యం నెరవేరుతుంది. పేదల ఆస్తులకు పూర్తి రక్షణ దొరుకుతుంది. వ్యవ సాయ భూములకు ఆకుపచ్చ, వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్‌ రంగు పాస్‌పుస్తకాలను అందజేయాలి. ప్రజలకు సంబంధించిన ప్రతి అంగుళం ఆస్తిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న నివాస స్థలాలు, భూ సమస్యల పరిష్కారానికై మున్సిపాలిటీల పరిధిలోని ప్రజాప్రతినిధులు, మేయర్లతో సీఎం కేసీఆర్‌ గురువారం ఇక్కడి ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. మున్సిపాలిటీల పరిధిలో ప్రజల ఇళ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్‌ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. 

ఒక్క నిరుపేదకూ బాధ కలగవద్దు..
దార్శనికతతో రూపొందిస్తున్న నూతన చట్టాల అమలు సందర్భంగా, ఏ ఒక్క నిరుపేదకూ బాధ కలగకుండా, చివరి గుడిసె వరకు వాటి ఫలితాలు అందేలా చూడటమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. నూటికి నూరు శాతం ప్రజలే కేంద్ర బిందువులుగా, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా తీసుకొస్తున్న నూతన చట్టాల అమలుకు ప్రజాప్రతినిధులు, అధికారులు 24 గంటలూ శ్రమించాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక పాలనా సంస్కరణల్లో భాగంగా అమలుపరుస్తున్న వినూత్న చట్టాలు పదికాలాలపాటు ప్రజలకు మేలు చేయనున్నాయని సీఎం పేర్కొన్నారు. వీటి అమలు క్రమంలో నిరుపేదలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చట్టాలను జాగ్రత్తగా కార్యాచరణలో పెట్టాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులదేనని అన్నారు. భూములను క్రమబద్ధీకరించడం ద్వారా పేదల నుంచి వచ్చే పైసలతో ఖజానా నింపుకోవాలని తమ ప్రభుత్వం చూడటం లేదని సీఎం స్పష్టం చేశారు.

గూండాగిరి తగ్గింది...
‘తెలంగాణ ఏర్పడ్డ తొలినాళ్లలో భూముల ధరలు పడిపోతాయని గిట్టనివాళ్లు శాపాలు పెట్టారు. కానీ, వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ తెలంగాణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు విపరీతంగా డిమాండ్‌ పెరుగుతూ వస్తున్నది. సుస్థిరపాలన వల్ల భూతగాదాలు, భూకబ్జాలు, దౌర్జన్యాలు, వేధింపులు, గూండాగిరీ తగ్గింది. కళ్లకు కడుతున్న అభివృద్ధి హైదరాబాద్‌ నగరానికి ఉండే గంగాజమునా సంస్కృతిని ద్విగుణీకృతం చేసింది. మార్వాడీలు, గుజరాతీలు, సింథీలు, పార్శీలు, దేశం నలుమూలల నుంచీ వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డ ప్రజలు తమ భవనాలను, ఆలయాలను నిర్మించుకొని, వారి సంస్కృతులను స్వేచ్ఛగా చాటుకుంటున్నారు. మరోపక్క తెలంగాణ రాకముందు కరువుతో అల్లాడిన గ్రామాల ప్రజలు హైదరాబాద్‌ నగరానికి వచ్చి స్థిరపడ్డారు. నిరుపేద ముస్లింలు పాతబస్తీలోనే కాకుండా న్యూసిటీ తదితర ప్రాంతాల్లో ఉన్నారు.

పేదరికానికి కులం, మతం లేదు. కులాలు, మతాలకు అతీతంగా అవసరమున్న ప్రజలందరి కోసం పనిచేసే ప్రభుత్వం మనది’అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘ఒకనాడు స్లమ్‌ ఏరియాల్లోని గుడిసెలు నేడు పక్కా ఇళ్లు, బంగళాలుగా మారాయి. ప్రజలు మనల్ని భారీ మెజారిటీతో గెలిపించారు. వారి గుండె తీసి మనచేతుల్లో పెట్టారు. చారిత్రక విజయాన్ని కట్టబెట్టి, మనల్ని కడుపులో పెట్టుకున్న ప్రజల కోసం అహర్నిశలూ శ్రమించవలసిన బాధ్యత మనపై ఉన్నది. నోటరీ, జీవో 58, 59 ద్వారా పట్టాలు పొందిన లబ్ధిదారులకు, దశాబ్దాలుగా ఇళ్లు కట్టుకొని నివసిస్తున్న పేదలకు మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వనిర్ణయాలు ఉంటాయి. ఎన్ని పనులున్నా రద్దు చేసుకొని ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డులవారీగా తిరుగుతూ, ప్రజల ఆస్తుల వివరాలు సేకరించి·తఆన్‌లైన్‌లో పొందుపరిచేలా చూడాలి. భూములకు, ఆస్తులకు సంబంధించిన సూక్ష్మ సమాచారం సైతం అప్‌డేట్‌ చేయాలి’అని సీఎం కేసీఆర్‌ ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. 

సీఎంపై ప్రజాప్రతినిధుల ప్రశంసలు
సమీక్ష సందర్భంగా సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లతో సీఎం మాట్లాడించారు. వారివారి నియోజకవర్గాల పరిధుల్లోని ప్రజల నివాసస్థలాలు, ఇళ్లు, ఆస్తులకు సంబంధించి దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు. ఆ సమస్యలను సానుకూలంగా విన్న ముఖ్యమంత్రి, ప్రతిసమస్యనూ అధికారులతో నోట్‌ చేయించారు. ఈ సమస్యల తక్షణ పరిష్కారం కోసం విధివిధానాలు రూపొందించాలని సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. కాగా, తమ రాజకీయజీవితంలో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని మున్సిపాలిటీల నివాసస్థలాలకు సంబంధించిన సమస్యలను ఇంత క్షుణ్ణంగా, లోతుగా పరిశీలించిన ముఖ్యమంత్రిని తాము ఇంతవరకూ చూడలేదని సీనియర్‌ ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.

పట్టణ పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా సీఎం కేసీఆర్‌ దార్శనికతతో తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయని వారంతా ఆనందం వ్యక్తం చేశారు. సమావేశంలో మంత్రులు కె.తారక రామారావు, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్‌ కుమార్, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ, నరగ, పట్టణ ప్రాంతాల ఎమ్మెల్యేలు, మేయర్లు పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement