సమావేశంలో కేరళం, తమిళనాడు, కర్ణాటక సీఎంలు సతీశన్, విజయ్, డీకే శివకుమార్‌తో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల
సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి చర్చలే కీలకమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. మహాబలిపురంలో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ సమస్యలను ఈ సందర్భంగా ప్రస్తావించి వాటి పరిష్కార చర్యలను సూచించారు. రాష్ట్రాల మధ్య సమస్యలను చర్చలకే పరిమితం చేయకుండా నిర్ణయాలు తీసుకుని వేగంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రత్యేక ప్రయోజనాలను కోరడం లేదని, ఇప్పటికే ఏర్పాటైన న్యాయపరమైన వ్యవస్థల ద్వారా రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటానే కోరుతున్నామని భట్టి స్పష్టం చేశారు.
కృష్ణా జలాల వంటి అంశాలు ట్రిబ్యునల్‌కు వెళ్లకుండా, కమిటీ అవసరం లేకుండా, మరో దఫా ఉత్తర ప్రత్యుత్తరాలు లేకుండానే పరిష్కారం కావాలని ఆయన ఆకాంక్షించారు. పాలమూరు–రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల పథకాల అంశాలను ఏర్పాటు చేసిన న్యాయ ప్రక్రియ ద్వారానే పరిష్కరించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని కోరారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణతో పాటు తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 అమలుకు పుష్కరకాలం పూర్తయినా తెలంగాణ–ఏపీ మధ్య అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని భట్టి విక్రమార్క వివరించారు. షెడ్యూల్–9లోని 23 సంస్థలపై తెలంగాణ తన అభిప్రాయాలను కేంద్ర హోంశాఖకు ఇప్పటికే సమరి్పంచిందని తెలిపారు. షెడ్యూల్–10 సంస్థల ఆస్తుల విభజనపై కూడా చట్ట నిబంధనల ప్రకారమే పరిష్కారం కావాలని స్పష్టం చేశారు. నీటి భద్రత, ఇంధనం, వాతావరణ మార్పులు, పట్టణీకరణ, లాజిస్టిక్స్ వంటి అంశాల్లో దక్షిణాది రాష్ట్రాల మధ్య మరింత సహకారం అవసరమన్నారు. తదుపరి 32వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తుందని భట్టి ఈ సందర్భంగా ప్రకటించారు.
ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలి: మంత్రి తుమ్మల
ఖమ్మం అర్బన్: తెలంగాణకు సంబంధించి పలు అంశాలను ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో కలిపిన భద్రాచలం పరిసరాల్లోని ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయడం, పెద్దవాగు ప్రాజెక్టు పునరుద్ధరణకు ఏపీ వాటా నిధుల విడుదల, ఆయిల్‌పామ్ గెలలు టన్నుకు రూ.25 వేల కనీస ధర, భద్రాచలం–ఏలూరు రహదారికి జాతీయ రహదారి హోదా కల్పించడంపై విజ్ఞప్తి చేశారు.


