అభివృద్ధి చేసిన భారతీయశాస్త్రవేత్తల బృందం
సంప్రదాయ కేన్సర్ చికిత్సలోసరికొత్త విప్లవం.. ఆరోగ్యకర కణాలకు హాని చేయని స్మార్ట్ ఔషధం
ప్రాథమిక పరీక్షల్లో అద్భుతఫలితాలిచ్చిన మందు
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ కేన్సర్ వైద్య విధానాల వల్ల శరీరంలోని ఆరోగ్యకర కణాలు దెబ్బతిని రోగులకు జుట్టు ఊడిపోవడం, నీరసం వంటి తీవ్ర దు్రష్పభావాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారంగా భారత శాస్త్రవేత్తలు ఒక ప్రయోగాత్మక స్మార్ట్ కేన్సర్ ఔషధాన్ని అభివృద్ధి చేశారు. ఈ సరికొత్త మందు కేన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకొని పనిచేయడం విశేషం. ఐఐటీ గువాహటి, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు సంయుక్తంగా ఆర్‌కే–251 పేరుతో ఔషధాన్ని అభివృద్ధి చేశారు. ఈ పరిశోధన బృందానికి డాక్టర్ అసిస్ బాలా, డాక్టర్ కె.పి.భాబక్ నాయకత్వం వహించారు. ఈ పరిశోధన వివరాలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జర్నల్ ఆఫ్ మెడిసినల్ కెమిస్ట్రీలో ప్రచురితమయ్యాయి.
ఔషధం పనితీరు ఇలా..
కేన్సర్ కణాల్లో రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసిస్ (ఆర్‌ఓఎస్) అనే రసాయన అణువుల స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆర్‌కే–251 మందు అటువంటి కేన్సర్ కణంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్న ఆర్‌ఓఎస్ అణువులు ఈ మందును మేల్కొల్పుతాయి. దీంతో మందు క్రియాశీలమై వెంటనే తన లోపల ఉన్న ఎన్‌బీడీహెచ్‌ఈఎక్స్ అనే శక్తివంతమైన కేన్సర్ నిరోధక సమ్మేళనాన్ని (ఔషధాన్ని) కేన్సర్ కణం లోపల విడుదల చేస్తుంది.
కేన్సర్ కణాలు చనిపోకుండా బతకడానికి, ఇతర చికిత్సలను తట్టుకొని నిలబడటానికి కొన్ని ప్రత్యేక ప్రొటీన్లను వాడుకుంటాయి. ఈ ఎన్‌బీడీహెచ్‌ఈఎక్స్ ఆ ప్రొటీన్ల పనితీరును పూర్తిగా అడ్డుకుంటుంది. దీనివల్ల కేన్సర్ కణాలు బలహీనపడి నశిస్తాయి. సాధారణ, ఆరోగ్యకర కణజాలాల్లో ఆర్‌ఓఎస్ అణువులు తక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ఈ మందు పనిచేయకుండా ఉంటుంది. కేవలం కేన్సర్ కణాల లోపలే ఇది పనిచేయడం వల్ల శరీరంలోని మంచి కణాలకు హాని జరగదు.
ప్రాథమిక పరీక్షల్లో అద్భుత ఫలితాలు..
పరిశోధనశాలలో నిర్వహించిన ప్రాథమిక ప్రయోగాల్లో ఈ ఔషధం రొమ్ము కేన్సర్ కణాలపై అద్భుత ప్రభావాన్ని చూపించింది. అదే సమయంలో సాధారణ ఆరోగ్యకర కణాలపై దీని ప్రభావం చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. జీబ్రా ఫిష్ పిండాలపై జరిపిన ప్రయోగాల్లోనూ విషపూరిత లక్షణాలేవీ కనిపించలేదు. అంతేకాకుండా కేన్సర్ కణాల్లోని ఆక్సిజన్ అణువుల సమక్షంలో ఈ ఔషధం ఒక రకమైన కాంతిని ప్రదర్శించింది. దీనివల్ల ఈ మందు కేన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకుంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మరిన్ని అధ్యయనాలు, క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాక ఈ మందును కేన్సర్ చికిత్స కోసం అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.


