శక్తిలో పాలిటెక్నిక్ కోర్సు విలీనంపై మంత్రి వివేక్
లాటరల్ ఎంట్రీతోనూ ఇంజనీరింగ్‌లో ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ కళాశాలలను సంస్కరించేందుకే శక్తి విభాగంలోకి తీసుకొచ్చామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెల్లడించారు. కే వలం పరిపాలన పరంగా శాఖ మాత్రమే మారిందని, మిగిలినవన్నీ యథాతథంగా ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాలిటెక్నిక్ కోర్సు పూర్తయిన తర్వాత లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరవచ్చన్నారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రయోజనాలు, ప్రస్తుత విధానాల్లో ఏమాత్రం మార్పులు లేవన్నారు. విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్టైపెండ్ ఇస్తామని, వచ్చేనెల నుంచి పంపిణీ జరుగుతుందన్నారు. పాలిటెక్నిక్ కోర్సుల ఫీజులు పెరగబోవని మంత్రి స్పష్టం చేశారు. స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి బోధన సిబ్బంది రావడంతో అక్కడ పనిచేస్తున్న లెక్చరర్లకు అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్లుగా మంచి పదోన్నతులు లభిస్తాయని మంత్రి వివరించారు. కొన్ని రాజకీయ పార్టీలు విద్యార్థులు, లెక్చరర్లలో అపోహలు సృష్టించి తప్పుదోవ పట్టిస్తున్నాయని మంత్రి మండిపడ్డారు.
ఏఐ కారణంగా వైట్‌కాలర్ ఉద్యోగాలు పోతున్నాయని, బ్లూకాలర్‌లో ఎక్కువ ఉద్యోగాలను సాధించేందుకు నైపుణ్యాలు అందించేలా అంతర్జాతీయ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజీలను పట్టించుకోలేదని, ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో స్కిల్స్ యూనివర్సిటీ, ఏటీసీలు, ఐటీఐలు, పాలిటెక్నిక్‌లన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయని చెప్పారు. ప్రస్తుతం ఎస్‌బీటీఈటీని రెండుగా విభజిస్తున్నామన్నారు. ఒకటి పాలిటెక్నిక్‌గా, మరొకటి యథావిధిగా ఎస్‌బీటీఈటీగా కొనసాగుతుందన్నారు. పాలిటెక్నిక్ ప్రవేశాలకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. వరంగల్‌లో విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడి చేయాల్సిన అవసరమే లేదని, విద్యార్థులపై లాఠీఛార్జి ఘటన బాధాకరమన్నారు. అక్కడి సీఐని తక్షణమే విధుల నుంచి తప్పించామని తెలిపారు. ప్రతి పాలిటెక్నిక్‌లో ప్లేస్‌మెంట్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. పునర్వ్యవస్థీకరణ అమలుకు ఎస్‌బీటీఈటీ, ఏఐసీటీఈ, వైఐఎస్‌యూ అధ్యాపకుల ప్రతినిధులతో జాయింట్ కోఆర్డినేషన్ టాస్‌్కఫోర్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.


