‘భూదాన్‌’ స్వాహాకు కు‍ట్ర | Deep-rooted conspiracy in Nagaram land transactions: ED to Telangana High Cour | Sakshi
Sakshi News home page

‘భూదాన్‌’ స్వాహాకు కు‍ట్ర

Jun 15 2025 1:29 AM | Updated on Jun 15 2025 1:29 AM

Deep-rooted conspiracy in Nagaram land transactions: ED to Telangana High Cour

అక్రమార్కులకు అధికారుల సహకారం

ప్రాథమికంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించారు

కోర్టు ఆదేశిస్తే ఇతర భూములపై ముందుకు..

హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన ఈడీ

సాక్షి, హైదరాబాద్‌: భూదాన్‌ భూముల స్వాహాకు అక్రమార్కులు కుట్రపన్నారు.. ఫోర్జరీ పత్రాలు, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు.. తద్వారా డీ నోటీఫై చేసిన భూదాన్, గైరాన్‌ (ప్రభుత్వ) భూములను విక్రయించారు.. దీనికి సబ్‌ రిజిస్ట్రార్‌ నుంచి కలెక్టర్‌ వరకు అంతా సహకరించారు.. డాక్యుమెంట్లు, కోర్టు ఉత్తర్వులను కనీస పరిశీలన చేయకుండానే డీనోటీఫైకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారు.. ఆ వెంటనే అక్రమార్కులు భూములను విక్రయించేశారు.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నంబర్‌ 181, 182లోని సర్కార్‌ భూముల స్వాహాపై విచారణ సందర్భంగా ఈమేరకు బహిర్గతమైందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసింది.

న్యాయస్థానం ఆదేశిస్తే పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని చెప్పింది. సర్వే నం. 181, 194, 195లో భారీ భూ కబ్జాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ అంబర్‌పేట్‌కు చెందిన బిర్లా మహేశ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈడీ తరఫున అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గజ్‌రాజ్‌ సింగ్‌ ఠాకూర్‌ హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. ఈడీ కౌంటర్‌లోని ముఖ్యాంశాలివీ...

ఖదీరుసా సహా పలువురిపై కేసు
‘సర్వే నం. 181, 194, 195లోని భూమికి సంబంధించి మోసపూరిత కార్యకలాపాలపై పిటిషనర్‌ మహేశ్‌ పేర్కొన్నారు. ఇప్పటికే సర్వే నంబర్‌ 181, 182లోని భూముల అక్రమ విక్రయంపై కేసు నమోదైంది. ఖదీరున్సిసా, మునావర్, బొబ్బిలి విశ్వనాథ్, సంతోష్‌కుమార్, దామోదర్‌రెడ్డితో పాటు ఈఐపీఎల్‌ నిర్మాణ సంస్థపై దర్యాప్తు కొనసాగుతోంది. పిటిషనర్‌ ఇచ్చిన ఫిర్యాదును ఎఫ్‌ఐఆర్‌ నమోదు నిమిత్తం డీజీపీ కార్యాలయానికి పంపించాం. అక్కడి నుంచి మాకు ఎలాంటి బదులురాలేదు. నవాబ్‌ హాజీఖాన్‌కు 779.77 ఎకరాల భూమి ఉంది. ఇందులో 103 ఎకరాలను కుమారులకు బహుమతి (హిబ్బా)గా, ఏపీ భూదాన్‌ యజ్ఞ బోర్డుకు విరాళంగా ఇచ్చారు.

దీనికి అంగీకరిస్తూ నాటి తహసీల్దార్‌ 1995, నవంబర్‌ 26న ఉత్తర్వులిచ్చారు. సర్వే నం. 181లోని మిగిలిన భూమిని ప్రభుత్వం గైరాన్‌ భూమిగా ప్రకటించింది. కుమారులు తమ భూమిని 2005లో దస్తగిర్‌ షరీఫ్, ముజాఫర్‌ హుస్సేన్‌కు విక్రయించారు. అయితే, 2006లో సర్వే నం. 181లోని మొత్తం భూమి సర్కార్‌దిగా పేర్కొంటూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనిపై దస్తగిరి హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. చట్టప్రకారం 181లోని 95 ఎకరాల్లో 50 ఎకరాలు భూదాన్‌గా, 45 ఎకరాలు గైరాన్‌ భూమిగా పేర్కొంటూ ఎంఆర్‌వో 2012లో నిషేధిత జాబితాలో చేర్చి నోటిఫై చేశారు’

తప్పుడు పత్రాలతో సేల్‌ డీడ్‌లు
‘తప్పుడు పత్రాలతో తన భూమిని కబ్జా చేశారంటూ షరీఫ్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో 2023, మార్చిలో ఖదీరునిసా, మునావర్‌ ఖాన్, బొబ్బిలి దామోదర్‌రెడ్డి, బొబ్బిలి విశ్వనాథ్‌రెడ్డి, ఎన్‌.సంతోష్, కొండపల్లి శ్రీధరర్‌రెడ్డిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 2004లో తన తండ్రి 51 ఎకరాలను హిబ్బాగా ఇచ్చారంటూ ఖదీరునిసా, ఆమె కుమారుడు మునావర్‌ 2014లో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించినట్లు ఈడీ విచారణలో తేలింది.

అక్రమంగా పొందిన పట్టా పాస్‌పుస్తకాలు, భూ విక్రయాలు కోర్టు ఆదేశాలతో రద్దయ్యాయి. మళ్లీ 2021లో ఖదీరున్నీసా.. విశ్వనాథ్‌రెడ్డి, సంతోష్‌కుమార్‌కు 40 ఎకరాలు విక్రయించారు. ప్రభుత్వ భూమి అని తెలిసినా నాటి సబ్‌ రిజిస్ట్రార్‌ జ్యోతి, నిందితులతో కలసి కుట్రకు పాల్పడ్డారు. ప్రభుత్వ భూమిగా నోటిఫై చేసిన భూములను మోసపూరితంగా బదిలీ చేసుకోవడంతోపాటు సేల్‌ డీడ్‌లు సృష్టించారు.’

డీనోటిఫైలో అధికారుల పాత్ర
‘హజీ అలీకి తాను ఏకైక కుమార్తెనని ఖదీరునిసా పేర్కొంది. కానీ, అప్పటికే రెవెన్యూ రికార్డుల్లో అలీఖాన్‌ ఇద్దరు కుమారుల పేర్లున్నాయి. తప్పు డు పత్రాలు సృష్టించేందుకు రెహమాన్, అక్తర్, షుకూర్, చంద్రయ్య, మరికొందరు సహకరించారు. నకిలీ లేఖతో నిషేధిత జాబితాలోని భూ మిని డీ–నోటిఫై చేయించారు. డీనోటిఫైకి భూదాన్‌ యజ్ఞ బోర్డుతోపాటు కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్, సబ్‌ రిజిస్ట్రార్‌కు భాగస్వామ్యం ఉంది. అబ్దుల్‌ షుకూర్‌ బంధువులు 1992లో నవాబ్‌ హాజీ అలీఖాన్‌ నుంచి సర్వే నం. 194లోని భూమిని కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.

నకిలీ పత్రాలతో భూ కబ్జా చేసినందుకు షుకూర్‌పై రెండు కేసులు నమోదయ్యాయి. 1992లో కొనుగోలు చేసినట్లు చూపిస్తున్న డాక్యు మెంట్లపైనా అనుమానాలున్నాయి. ఎందుకంటే.. 1992 కంటే ముందే హాజీఖాన్‌ భూ మంతా విక్రయించారు. నకిలీ పత్రాల వాడకం, రెవెన్యూ రికార్డులను తారు మారు చేయడం లాంటి వాటితో విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. అధికారుల పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు మా దృష్టికి వచ్చిన వ్యక్తులు, ప్రభుత్వ అధికారుల పాత్రపై మరికొన్ని వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది.’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement