స్మార్ట్‌ఫోన్లలోకి వైరస్‌ల ద్వారా చొరబడేందుకు సైబర్ నేరస్తుల ఎత్తులు
వివిధ పేర్లతో లింక్‌లు పంపి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము కాజేసే వ్యూహం
ఇటీవల కాలంలో భారీగా పెరిగిన సైబర్ నేరాలు
తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నసైబర్ భద్రతా నిపుణులు
సాక్షి, హైదరాబాద్: ‘నా ఫోన్ హ్యాక్ అయింది... వాట్సాప్‌ను ఎవరో టేకోవర్ చేశారు... ఫేస్‌బుక్ క్లోన్ అయింది. నా పేరు, ఫొటోలతో మెసేజ్‌లు పంపి కొందరు కేటుగాళ్లు డబ్బు అడుగుతున్నారు. దయచేసి ఇలాంటి సందేశాలను చూసి ఎవరూ మోసపోవద్దు’అంటూ ఇటీవల కాలంలో ఎంతో మంది సైబర్ క్రైం బాధితులు తమ బంధువులు, స్నేహితులు, సన్నిహితులను కోరుతున్నారు.
కొందరి కేసుల్లో కథ ఇక్కడితో ఆగిపోతే మరికొందరు బాధితులు మాత్రం తమ బ్యాంకు ఖాతాలు ఖాళీ కావడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ తరహా సైబర్ నేరాలు పెరగడానికి సైబర్ హ్యాకర్లు పంపే రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (ర్యాట్), ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ (ఏపీకే) ఫైల్స్‌తోపాటు వాట్సాప్ టేకోవర్లే కారణమని సైబర్ క్రైం నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేరాల బారినపడకుండా ఉండాలంటే స్మార్ట్‌ఫోన్ల వినియోగదారులకు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు.
యాడ్స్ మాటున ర్యాట్...
ఇంటర్నెట్, సోషల్ మీడియాల్లో అనేక యాప్స్‌కు సంబంధించి కనిపించే యాడ్స్‌ను చాలా మంది నెటిజన్లు అవసరం లేకపోయినా స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. దీంతో సైబర్ నేరస్తులు ఈ తరహా యాడ్స్ మాటున పంపుతున్న ఆయుధమే ‘ర్యాట్’. యాప్స్, వీడియోలు, అప్‌డేట్స్ పేరుతో పంపే లింకుల మాటున ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను పొందుపరుస్తారు. ఎవరైనా ఆ లింక్‌ను క్లిక్ చేస్తే ఆ సాఫ్ట్‌వేర్ వారి ఫోన్లో డౌన్‌లోడ్ అయిపోతుంది.
ఫలితంగా వినియోగదారుడికి తెలియకుండా, ప్రమేయం లేకుండానే సైబర్ క్రిమినల్ పంపే ట్రోజన్ కూడా అదే మొబైల్ ఫోన్లోకి దిగుమతి అయిపోతుంది. అలా జరిగిన మరుక్షణం నుంచే సైబర్ నేరస్తుల అ«దీనంలోకి వెళ్లిపోతుంది. దీంతో చేతిలో సెల్‌ఫోన్ లేకపోయినా దాన్ని రిమోట్ యాక్సెస్ చేస్తూ కేటుగాళ్లు వారికి అవసరమైన విధంగా వాడగలుగుతున్నారు. అందుకే ఈ వైరస్‌ను రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (రాట్) అంటారు. ఓటీపీలను సంగ్రహించడానికీ సైబర్ నేరగాళ్లు ర్యాట్ ఫైల్స్ వాడుతున్నారు.
‘డాట్’పేరుతో స్పాట్...
ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు తమ పంథా పూర్తిగా మార్చేశారు. డార్క్ వెబ్ నుంచి సేకరించిన ఫోన్ నంబర్ల ఆధారంగా బాధితులను ఎంచుకుంటున్నారు. వారికి ఫోన్లు చేసి క్రెడిట్ కార్డుల ఆఫర్ల పేరిట వలపన్ని ఆసక్తి చూపిన వ్యక్తుల నుంచి చిరునామాలు సేకరిస్తున్నారు. ఈ కార్డుల జారీ కోసం సిమ్ వెరిఫికేషన్ తప్పనిసరి అయినందున టెలికం శాఖ యాప్ లింకును పంపుతున్నామని చెబుతున్నారు.
ఇది నిజమేనని నమ్మే బాధితులు వాటిని క్లిక్ చేయగానే రిమోట్ యాక్సెస్ యాప్‌లు సైబర్ క్రిమినల్స్ ఫోన్లలో ఇన్‌స్టల్ అయిపోతున్నాయి. దీంతో బాధితుల బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు వారికి వెళ్లడం మొదలవుతోంది. దీంతో నేరగాళ్లు బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.
ఏపీకే ఫైల్స్‌తోనూ ఎటాక్స్...
ప్రభుత్వ పథకాలు, బ్యాంకు సేవలు, పెట్టుబడుల అవకాశాలు, పెండింగ్ చలాన్లు, రుణాలు, ఆధార్ అప్‌డేట్‌ల పేరుతో ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్స్ (ఏపీకే) ఫైల్స్ పంపి సైబర్ నేరగాళ్లు బాధితుల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.
వాట్సాప్ సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, నకిలీ వెబ్‌సైట్ల ఆధారంగా లింకుల రూపంలో సైబర్ నేరగాళ్లు ఈ ఏపీకే ఫైల్స్ పంపుతున్నారు. వాటిని క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేస్తే ఫోన్లు వారి అ«దీనంలోకి వెళ్లిపోతున్నాయి. ఈ రకంగానూ నేరగాళ్లు వినియోగదారుల బ్యాంకు ఖాతాల లాగిన్లు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం సహా సున్నిత వివరాలు పొందుతున్నారు.
సైబర్ నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలివీ...
– అపరిచిత నంబర్ల నుంచి వచ్చే లింక్‌లు క్లిక్ చేయొద్దు.
– ఎవరికీ ఓటీపీలు, యాక్టివేషన్ కోడ్‌లు చెప్పొద్దు.
– ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ మినహా లింక్‌ల ద్వారా వచ్చే యాప్స్‌ను డౌన్‌లోడ్ చేయకూడదు.
– వాట్సాప్ టోకేవర్ బారినపడకుండా ఉండాలంటే వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకొని అందులో టూ–స్టెప్ వెరిఫికేషన్‌ను యాక్టివేట్ చేసుకోవాలి. తద్వారా ఆ నంబర్‌తో కూడిన వాట్సాప్‌ను మరోసారి, మరో ఫోన్‌లో యాక్టివేట్ చేయాలంటే ఓటీపీతోపాటు యాక్టివేషన్ కోడ్ కూడా అవసరం అవుతుంది.
– కొందరు కేటుగాళ్లు మాల్‌వేర్‌ను ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు రూపంలో పంపిస్తుంటారు. అందువల్ల వాట్సాప్ సెట్టింగ్స్‌లో డౌన్‌లోడ్ ఆప్షన్‌ను ‘నన్’అని యాక్టివేట్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటో డౌన్‌లోడ్ ఎంచుకోవద్దు. ఆటో డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటే వినియోగదారుల ప్రమేయం లేకుండానే ఆ వైరస్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిపోయే అవకాశం ఉంటుంది.
– సైబర్ దాడికి గురైతే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేసి లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లోకి లాగిన్ అయి ఫిర్యాదు చేయాలి. ఈ విషయంలో ఎంత ఆలస్యమైతే రికవరీలు అంత తక్కువగా ఉంటాయన్నది మర్చిపోవద్దు.
లింక్ క్లిక్ చేస్తే.. ఫోన్ బ్లాక్.. ఖాతా ఖాళీ
సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువకుడిని (36) డీటీడీసీ కొరియర్ పేరుతో లింక్ పంపి అతని ఖాతా నుంచి రూ. 2.47 లక్షలు కాజేసిన ఉదంతం మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఆర్టీఏ కార్యాలయం నుంచి వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ) కోసం వేచి చూస్తున్న యువకుడికి అదే సమయంలో డీటీడీసీ కొరియర్ పేరుతో ఓ మెసేజ్ వచ్చింది. పార్సిల్‌ను డెలివరీ చేయడానికి రెండోసారి చేసిన ప్రయత్నం సైతం విఫలమైందనేది దాని సారాంశం. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయాలంటూ సైబర్ నేరగాళ్లు వల విసిరారు. ఇది నిజమేనని నమ్మిన బాధితుడు ఆ లింక్ క్లిక్ చేయగానే ఆయన ఫోన్ స్తంభించిపోయింది. కాసేపటికే అతని బ్యాంకు ఖాతా నుంచి రూ. 2.47 లక్షలు మాయమయ్యాయి.


