
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో మరోసారి పెచ్చులు విరిగిపడ్డాయి. భారీ వర్షానికి సీఎం రేవంత్ కాన్వాయ్ వచ్చే మార్గంలోనూ పెచ్చులు కూలాయి. పెచ్చులు ఊడి పడడంతో సచివాయం సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. కాగా, గత వారం రోజుల నుంచి సచివాలయానికి సిబ్బంది రిపేర్లు చేస్తున్నారు. సచివాలయంలో పెచ్చులు ఊడి పడుతున్న ఘటనలపై సచివాలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ సచివాలయలో పీవోపీ పార్టిషన్ స్వల్పంగా కూలింది. పెచ్చులు ఊడిపడ్డాయి. సీఎం ఛాంబర్ అంతస్తులో పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడి.. రామగుండం మార్కెట్ కమిటీ ఛైర్మన్ కారుపై పడ్డాయి. కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పెచ్చులు ఊడిపడడంతో ఉద్యోగులు ఆందోళన చెందారు. పీఓపీ పెచ్చులు ఊడి పడటంతో అధికారులు, భదత్రా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఇటీవలే కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయం పీఓపీ కూలడం చర్చనీయాంశంగా మారింది. సచివాలయ నిర్మాణ లోపాలపై చర్చ జరుగుతోంది.
ఘటనపై స్పందించిన సచివాలయ నిర్మాణ సంస్థ
సెక్రటేరియట్ పెచ్చులు ఊడిన ఘటనపై షాపూర్జీ పల్లోంజీ నిర్మాణ సంస్థ స్పందించింది. ‘‘ రెగ్యులర్ డిపార్ట్‌మెంట్ పనుల్లో భాగంగా కేబుల్, లైటింగ్ కోసం పనులు చేపట్టినట్లు పేర్కొంది. నిర్మాణం ప్రాబ్లం కాదని.. అది కాంక్రీట్ వర్క్ కాదని తెలిపింది. స్ట్రక్చర్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని.. ఊడి పడింది జీఆర్‌సీ ఫ్రేం. ఇటీవల లైటింగ్ కోసం, కొత్త కేబుల్స్ కోసం జీఆర్‌ఎసీ డ్రిల్ చేస్తున్నారు.. దీంతో జీఆర్‌సీ డ్యామేజ్ అవుతుంది. స్ట్రక్చర్ నిర్మాణం పూర్తయి రెండేళ్లు అవుతోంది. ఎలాంటి నాణ్యత లోపం లేదు. మేము ఘటనపై రివ్యూ చేస్తున్నాం అని’’ ఆ సంస్థ వెల్లడించింది. తాజాగా, మరోసారి సచివాలయంలో పెచ్చులు ఊడడం చర్చాంశనీయంగా మారింది.