
నిర్మల్ జిల్లా: దొంగలు దొంగతనానికి కొత్త దారులు ఎంచుకుంటున్నారు. ఖరీదైన ఇన్నోవా కారులో రెండు ఆవులను అపహరించుకెళ్లారు. కాస్త వింతగా అనిపించినా సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యంతో నిజమేనని తెలుస్తోంది. నిర్మల్ జిల్లా భైంసా మండలం సుంక్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని రాజేందర్, రాజవ్వకు చెందిన రెండు ఆవులు కనిపించలేదు. రాత్రి సమయంలో ఆవులు ఎక్కడికి వెళ్లాయోనని వెతికారు.
శనివారం ఉదయం 8 గంటల వరకు జాడ కనిపించలేదు. దొంగతనం జరిగి ఉంటుందని భావించి సమీప ఇళ్లలో సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఎదుట రోడ్డు పక్కన ఇన్నోవా కారును నిలిపి ఉంచి ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు ఆవులను తీసుకెళ్లి వెనుకవైపు నుంచి లోపలికి ఎక్కించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆవుల చోరీకి ఇన్నోవా కారు వినియోగించడం, వెనుక వైపు డోరు తెరిచి ఎక్కించడం చూసి అవాక్కయ్యారు. బాధితులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.