ఏజెన్సీలలో​ కరోనా వ్యాప్తి.. కిట్లు లేవు.. పరీక్షలు లేవు   

Covid Second Wave  Spreading Faster In India - Sakshi

వెనుదిరుగుతున్న బాధితులు

వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్‌

గిరి గ్రామాల్లో అవగాహన అంతంతే..

సాక్షి, ఉట్నూర్‌(ఆదిలాబాద్‌): కరోనా వైరస్‌ వ్యాప్తి మొదట్లో రోజుకు ఉట్నూర్‌ సీహెచ్‌సీల్లో వంద మందికి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాభై చొప్పున కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేవారు. రానురాను కిట్ల కొరతతో పరీక్షల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఆరోగ్య కేంద్రాలకు సరిపడా కిట్లు రావడం లేదు. దీంతో పరీక్షల కోసం వచ్చిన వారు వెనుదిరుగుతున్నారు. అందులో వైరస్‌ ఉన్న వారితో మరింతగా వ్యాప్తి చెందుతోంది.

గిరి గ్రామాల్లో వైరస్‌ ఉధృతి.. 
ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో కరోనా వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. సాధారణంగా గిరిజన గ్రామాల్లో వ్యాధులు, జ్వరాలు వస్తే వైద్యం కంటే మూఢనమ్మకాలు, ఆరాధ్యాదైవాలను ఎక్కువగా నమ్ముతారు. ఇప్పటికీ ఆదివాసీ గిరిజనుల్లో కరోనా వైరస్‌పై పూర్తిస్థాయిలో అవగాహన లేక వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. ఫలితంగా ఏజెన్సీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే పదుల సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో వైద్యశాల ప్రతి గిరిజన గ్రామాల్లో నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వైరస్‌ సోకిన వారికి హోం క్వారంటైన్‌లో ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం కరోనా నిర్ధారణ ర్యాపిడ్‌ అంటిజెన్‌ కిట్ల కొరత ఏర్పడడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఒక్కప్పుడు యాభై చొప్పున వచ్చే కిట్లు ఇప్పుడు ఎన్ని వస్తాయో తెలియని పరిస్థితి. వచ్చే అరకొర కిట్లతో సిబ్బంది నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

ఉదయం నుంచే ఆరోగ్య కేంద్రాలకు...
ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఉదయం నుంచే గిరిజనులు కరోనా నిర్ధారణ పరీక్షల కోసం బారులు తీరుతున్నారు. కిట్ల కొరతతో వైద్యాధికారులు వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహించలేకపోతున్నారు. ఇలా ప్రతి రోజు వైరస్‌ సోకినవారు, అనుమానిత బాధితులు పరీక్షల కోసం ఆరోగ్య కేంద్రాలకు బారులు తీరుతుండడంతో అనుమానితులు కూడా వైరస్‌ బారిన పడుతున్నారు. అప్పటికే ఒక్కటి రెండు రోజులు పరీక్షలకు వెళ్లి వెనుదిరిగి ఇంటికి రావడం, అప్పటికీ  పరీక్ష నిర్ధారణ కాకపోవడంతో అలాంటి వారు బయట విచ్చలవిడిగా తిరగడం, కుటుంబ సభ్యులతో కలిసి ఉండడంతో కుటుంబ సభ్యులు వైరస్‌ బారిన పడుతున్నారు. 

ఏజెన్సీ తట్టుకోగలదా...?
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6138.50 స్కేర్‌ కిలో మీటర్ల పరిధిలో ఏజెన్సీ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతాల్లో 4,95,794 గిరిజన జనాభా నివసిస్తోంది. వీరందరికీ వైద్య సౌకర్యాల కోసం ఏజెన్సీలో మూడు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 186 ఉప ఆరోగ్య కేంద్రాలున్నాయి.  ప్రతి ఏటా ఏజెన్సీలో గిరిజనులు జ్వరాలు, వ్యాధుల బారిన పడుతూ మృత్యువాతపడుతుంటారు. దీనికి తోడు ఇప్పటికే సికెల్‌సెల్, తలసేమియా లాంటి ప్రాణాంతక వ్యాధులు గిరిజనుల పాలిట శాపంగా మారాయి. సహజంగా మహిళల్లో హీమోగ్లోబిన్‌ 12నుంచి 15 శాతం, పరుషుల్లో 14 నుంచి 16శాతం ఉంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వైద్యులు చెబుతుంటారు. ఏజెన్సీలో ఏళ్ల తరబడి నెలకొన్న పోషకాహార లోపంతో మహిళల్లో హీమోగ్లోబిన్‌ 6 నుంచి 9శాతం, పురుషుల్లో 12శాతం వరకు, చిన్నారుల్లో 5 నుంచి 10శాతం వరకే ఉంటోంది. వీరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడంతో చిన్న సమస్యలకే అనారోగ్యం పాలు అవుతుంటారని పలు సందర్భాల్లో వైద్య బృందాలు తేల్చాయి. గిరి గ్రామాల్లో పరిస్థితులు అదుపు తప్పకముందే చర్యలు తీసుకుంటే మేలు.

అవగాహన కల్పిస్తున్నాం
ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్‌ సోకినవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి గ్రామంలోని ఆశ కార్యకర్తలు గ్రామాల్లోని గిరిజనుల ఆరోగ్య స్థితిగతులపై అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పైఅధికారులకు సమాచారం అందించాలని ఆదేశాలు జారీ చేశాం. వైరస్‌ నిర్ధారణ కోసం జిల్లా కేంద్రం నుంచి వస్తున్న కిట్ల సంఖ్యను బట్టి పీహెచ్‌సీలకు పంపిణీ చేస్తున్నాం.     

– మనోహర్, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top